నిడదవోలు రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాల ప్రచార ఆర్భాటలే తప్ప ఏ ఒక్కటీ సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవు. సూపర్ సిక్స్ పథకాల పరిస్థితి అలా ఉంచితే.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాలు మంజూరు పేరుతో హడావుడి చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో కార్యచరణ రూపు దాల్చలేదు. కారణాలు ఏమైనా బీసీ కార్పొరేషన్ మంజూరు ఉత్తుత్తి ప్రచారంగా మిగిలిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నియోజకవర్గంలో నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుల స్వీకరణ, ఏప్రిల్ 4, 5 తేదీల్లో హడావుడిగా ఇంటర్వ్యూలు జరిగాయి. కానీ 8 నెలలు గడుస్తున్నా ఒక్కరికీ రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో ప్రభుత్వ తీరుపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. రుణాలంటూ హడావిడి చేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రుణాల కోసం నిరీక్షణ
నిడదవోలు మండలంలోని 23 గ్రామాల్లో ఉన్న లబ్ధిదారులకు 10 బ్యాంకుల పరిధిలో 79 యూనిట్లు మంజూరు కాగా.. 1,249 మంది బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గోపవరం, పురుషోత్తపల్లి, విజ్జేశ్వరం, పందలపర్రు గ్రామాలకు చెందిన 251 మంది ల బ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా.. కేవలం 12 యూనిట్లు మంజూరు చేసేందుకు చైతన్య గ్రామీణ గోదావరి బ్యాంక్ (పురుషోత్తపల్లి) ముందుకొచ్చింది.
ఒక్కొక్క యూనిట్ విలువ రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు కేటాయింపు ఉంటుంది. అందులో బ్యాంకర్ల వాటా సగం, ప్రభుత్వ సబ్సిడీ వాటా సగం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల కోసం లబ్ధిదారుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. యూనిట్ల మంజూరు కేటాయింపులు తక్కువ ఉండటంతో ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే ప్రభుత్వం ఈ ప్రక్రియ నిలిపివేసింది.
నిడదవోలు మండలంలో 112 యూనిట్లకు 255 మంది వరకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వ పెద్దల సిఫార్సులు ఉన్నవారికే రుణాలు ఇస్తారన్న కారణంగా.. కొందరు అభ్యర్థులు రుణాలపై ఆశలు వదులుకున్నారు. మరి కొందరు మాత్రం ఇంటర్వ్యూలు ముగిసినప్పటి నుంచి తమకు సబ్సిడీ రుణాలు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టే?
ఎంతో ఆర్భాటంగా సబ్సిడీ రుణాల కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలు హుళక్కేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. బీసీ కార్పొరేషన్ ఇంటర్వ్యూలు ప్రక్రియ ముగిసిన తర్వాత కొద్ది రోజులకే మండల పరిషత్ కార్యాలయాల సిబ్బంది అర్హుల జాబితా సిద్ధం చేసి బ్యాంకర్లకు పంపించారు. అయితే లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీ జమ అయితే కానీ రుణాలు మంజూరు చేయని పరిస్థితిలో బ్యాంకర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో లబ్ధిదారులు బ్యాంకులు, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిధులు లేని కారణంగానే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో కార్పొరేషన్ రుణాల మంజూరు నీటి మీద రాతలా మారయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అడుగడుగునా మోసమే
చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులను అడుగడుగునా మోసం చేస్తోంది. సబ్సిడీ రుణం మంజూరు చేస్తే సొంతంగా షాపులు పెట్టుకుని జీవనోపాధి పొందుతారు. కానీ, ఆర్భాటంగా కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తామని దరఖాస్తులు స్వీకరించారు. మళ్లీ ఆ రుణాల ఊసే ఎత్తడం లేదు. నిరుద్యోగ భృతి కింద ప్రతి నెల రూ.3 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి అన్ని విధాలా మోసం చేశారు. ఇప్పటికైన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులకు సబ్సిడీ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలి.
– బయ్యే విజయ్, శెట్టిపేట, నిడదవోలు మండలం


