మామిడి పూతల కోసం ఎదురుచూపులు
పూతలు కనిపిస్తున్నాయి
పూత రావడంలో ఆలస్యం
● మామిడి పూతలు సకాలంలో వచ్చేనా...!
● మామిడిపైనే రైతుల ఆశ
నూజివీడు: పండ్లలో రారాజుగా ప్రసిద్ధి చెందిన మామిడిపై రైతులు ఆశలు పెట్టుకుని పూతల కోసం ఎదురు చూస్తున్నారు. అకాల వర్షాలు, నల్లతామర, తెగుళ్ల దాడితో గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులకు ఈ ఏడాదైనా మామిడి తీపిని పంచుతుందేమోననే ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. డిసెంబరు తొలివారం గడిచినప్పటికీ ఇంకా ఎక్కడా మామిడి పూతలు కనిపించడం లేదు. జిల్లాలోని నూజివీడు డివిజన్‌లోని 6 మండలాల్లో కలిపి దాదాపు 45 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించాయి. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఎక్కువగా బంగినపల్లి, కలెక్టర్(తోతాపురి), చిన్న, పెద్ద రసాలు వంటి రకాలను రైతులు సాగుచేస్తున్నారు. మామిడి పూతలు సాధారణంగా డిసెంబర్ నెల ప్రారంభం నుంచి ఫిబ్రవరి వరకు వస్తాయి. మామిడి పూతలు రావడానికి రాత్రిపూట అధిక చలి, పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు ఉండాలి. ప్రస్తుత వాతావరణం గమనిస్తే మామిడికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో పూతలు బాగానే ఉండవచ్చని రైతులు భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబరు నెలాఖరు వరకు అధిక వర్షాలు కురవడంతో పూతలు వస్తాయో, లేదోననే ఆందోళన రైతులను వెంటాడుతోంది. ఎందుకంటే మామిడికి బెట్ట పరిస్థితులైతే ఎంతో అనుకూలం. గత ఏడాది మామిడి దిగుబడి పెద్దగా లేని నేపథ్యంలో ఈ ఏడాదైనా బాగుంటుందని ఆశతో ఉన్న రైతులు గత పది రోజుల నుంచే పూతల కోసం రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. దీనిలో భాగంగా సల్ఫర్, ఇమిడాక్లోప్రిడ్, బోరాన్ వంటి వాటిని పిచికారీ చేస్తున్నారు. 5 నుంచి 10శాతం తోటల్లో పూతలు కనిపిస్తున్నాయి. పూత కనిపిస్తున్న తోటల్లో పూత కాడలపై తేనెమంచు పురుగులు కనిపిస్తున్నాయని వాపోతున్నారు.
గతేడాది నష్టపోయినా నష్టపరిహారం చెల్లించలేదు
గతేడాది ప్రారంభంలో పూతలు ఆశాజనంగానే వచ్చినప్పటికీ జనవరి ప్రథమార్ధంలో నల్లతామర ఉధృతంగా ఆశించడంతో వచ్చిన మామిడి పూతంతా మాడిపోయి పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. సంక్రాంతి తర్వాత వచ్చిన పూత కొంతమేర నిలవడంతో దిగుబడులు అంతంత మాత్రంగా వచ్చాయి. అయితే ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాలతో మామిడికి ధర పూర్తిగా పడిపోవడంతో రైతులు నష్టాల పాలయ్యారు. తోతాపురి రకం టన్ను రూ.3 వేలకు పడిపోయి కోత ఖర్చులు, కిరాయిలు సైతం రాని పరిస్థితులు నెలకొనడంతో రైతులు కాయలను కోయకుండా చెట్లకే వదిలేశారు. బంగినపల్లి సైతం టన్ను ధర రూ.8 వేలకు పడిపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని మామిడి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించి ఏలూరు జిల్లాలోని నూజివీడు ప్రాంతంలోని రైతాంగానికి రూపాయి కూడా చెల్లించలేదు.
వాతావరణం అనుకూలమే
పగటిపూట అధిక ఉష్ణోగ్రత, రాత్రిపూట అధిక చలి ఉండే వాతావారణం మామిడి పూత రావడానికి అనుకూలం. ప్రస్తుతం చూస్తే పగలు ఎండతో పాటు రాత్రిపూట చలి అధికంగానే ఉండడంతో వాతావరణం కలిసి వస్తోందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. కొన్నితోటల్లో పూతలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఇకముందు కూడా ఎలాంటి తుపాన్లు లేకుండా, పురుగులు, నల్లతామర వంటి పురుగుల దాడి లేకుండా ఉంటే మామిడికి మరింత అనుకూలంగా ఉన్నట్లేనని మామిడి రైతులు పేర్కొంటున్నారు.
మామిడి పూతలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. పది శాతం తోటల్లో పూతలు వస్తున్నాయి. పూతల కోసం రైతులు ఇప్పటికే ఒక కోటా రసాయన మందులు పిచికారీ చేశారు. గతేడాది నష్టాలు వచ్చినందున ఈ ఏడాదైనా మామిడి ఆదుకుంటుందని ఆశతో ఉన్నాం.
బాణావతు రాజు, లైన్‌తండా, నూజివీడు మండలం
గత పది రోజులుగా వాతావరణం మామిడి పూతలు రావడానికి అనుకూలంగా ఉంది. వర్షాలు పడకుండా ఇదే వాతావరణం కొనసాగితే తోటలన్నింటిలో పూతలు వస్తాయి. తోటల్లో అక్కడక్కడ తేనెమంచు పురుగులు కనిపిస్తున్నాయి. వాటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్‌ను 0.5 గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆర్.హేమ, ఉద్యాన అధికారి, నూజివీడు
మామిడి పూతల కోసం ఎదురుచూపులు
మామిడి పూతల కోసం ఎదురుచూపులు
మామిడి పూతల కోసం ఎదురుచూపులు


