ఉపాధి హామీ పథకంలో అవినీతి
విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
● అవకతవకలు సరిచేయడానికి వసూళ్లు
● పట్టించుకోని ఉన్నత అధికారులు
భీమవరం(ప్రకాశం చౌక్): జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి నిర్వహించే ఆడిట్ అవినీతి అధికారులకు వరంగా మారింది. ఏడాదిలో జరిగిన పనులకు సంబంధించి ఆడిట్‌ను ప్రభుత్వం చేపడుతుంది. ఈ ఆడిట్ చేసే కొందరు అధికారులు వసూళ్లు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారు. గత ఏడాది జిల్లాలో జరిగిన ఉపాధి పనులపై జరిగిన సోషల్ ఆడిట్‌లో కొందరు డీఆర్‌పీల అవినీతిపై విచారణ చేసి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. దాంతో ఈ ఏడాది కూడా కొందరు ఆడిట్ అధికారులు చేతివాటం చూపుతూ అక్రమ వసూళ్లు మొదలు పెట్టారు. ఆడిట్ సక్రమంగా ఉంటేనే ఉద్యోగం లేకపోతే ఇబ్బంది పడతారంటూ ఫీల్డ్ అసిస్టెంట్లను భయపెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. 2024–25 ఏడాదికి సంబంధించి జిల్లాలో ఉపాధి హమీ పనులపై సోషల్ ఆడిట్ ప్రారంభించారు. పాలకోడేరు, పెనుగొండ, పోడూరు, పెంటపాడు మండలాలలో ఆడిట్ జరుగుతోంది.
ఫీల్డ్ అసిస్టెంట్లు వేసిన మస్తర్లలో తేడాలు, కొట్టివేతలు, పనులు కొలతలు, కూలీల వివరాలు సక్రమంగా లేకపోవడం ఒకరి జాబ్‌కార్డుపై మరొకరు పనిచేయడం వంటివి అధికారులు గుర్తించి వాటిని సాకుగా చూపించి సరిచేసి సక్రమంగా ఉన్నట్లు చూపడానికి కొందరు అధికారులు ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆయా మండలాల్లో రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగం లేకుండా చేస్తారని భయపడి ఫీల్డ్ అసిస్టెంట్లు అడిగినంతా ఇచ్చుకుంటున్నారు. ఉపాధి పనుల్లో అవకతకల్లో మండల స్థాయిల్లో పనిచేసే కొందరు టీఏల హస్తం కూడా ఉందని, దాంతో వారు కూడా సోషల్ ఆడిట్ అధికారుల అవినీతికి సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఉపాధి హమీ పనుల్లో అవకతవకలు
ఉపాధి హమీ పనుల్లో 60 శాతం కూలీలతో పనులు చేసే కార్యక్రమం జరుగుతుంది. కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు పనికి రాని వారి పేరిట మస్తర్లు వేసి డబ్బులు వారి ఖాతాల్లో పడ్డాక పంచుకుంటున్నారు. కొలతల ప్రకారం కాకుండా తక్కువ కొలతలు ఉన్న పనులకు ఎక్కువ కొలతలు చూపించి పనిచేయించడం వల్ల కూలీల సంఖ్య పెంచి మస్తర్లు వేస్తున్నారు. తక్కువ మంది కూలీలు వచ్చినా ఎక్కువ మస్తర్లు వేస్తున్నారు. ఉపాధి పనులు సంబంధించి జరిగే ఆడిట్ సమయంలో గ్రామ సభ నిర్వహించి అక్కడ కూలీల వివరాలు, పనులు గురించి గ్రామస్తుల మధ్య ప్రస్తావిస్తారు. గ్రామ సభల్లో మస్తర్లలో తేడాలు, పెంచిన కొలతలు, ఎక్కువ మస్తర్ల గురించి ప్రస్తావించకుండా రహస్యంగా ఉంచి గ్రామ సభ ముగిస్తున్నారు.
జిల్లాలో ఏడాది కాలంలో జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి నాలుగు మండలాల్లో ఆడిట్ జరుగుతోంది. ఆడిట్ అధికారులు సక్రమంగా ఆడిట్ చేశారా లేదా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం.
–కేసీసీహెచ్ అప్పారావు, డ్వామా పీడీ, భీమవరం


