కరుణించు మంగమ్మ తల్లీ
బుట్టాయగూడెం: కోర్కెలు తీర్చే తల్లిగా, వరాలిచ్చే అమ్మగా, గిరిజన ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న గుబ్బల మంగమ్మ తల్లి గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. చలికాలం అయినప్పటికీ మంచు కురుస్తున్నప్పటికీ తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు మంగమ్మ తల్లి గుడికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వివిధ జిల్లాల నుంచి ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, బస్సుల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మా.. నీ ఆశీస్సులు అందించమ్మా.. అంటూ భక్తులు ఆర్తీతో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని ఆదివారం దర్శించుకున్నారు. మహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ రూ.49,660 ఆదాయం వచ్చిందని చెప్పారు.
నూజివీడు: శ్రీకాకుళంలోని ట్రిపుల్ ఐటీలో నిర్వహించిన ఆర్జీయూకేటీ ఇంటర్ యూనివర్శిటీ స్పోర్ట్స్ టోర్నమెంట్‌లో భాగంగా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వాలీబాల్ విభాగంలో ప్రతిభ కనబరిచారు. బాలుర విభాగంలో వాలీబాల్‌లో నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ జట్టుపై విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. వాలీబాల్ బాలికల విభాగంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ బాలికల జట్టు ఫైనల్‌లో శ్రీకాకుళం చేతిలో ఓటమి పాలైంది. విజేతగా నిలిచిన బాలుర జట్టును, ద్వితీయ స్థానంలో నిలిచిన బాలికల జట్టును నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ అభినందించారు.
ద్వారకాతిరుమల: శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా అంటూ శ్రీవారి భక్తులు చేసిన గోవింద నామస్మరణలతో ఆదివారం క్షేత్ర పరిసరాలు మారు మ్రోగాయి. సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట, ఇతర విభాగాలు భక్తులతో కిక్కిరిసాయి. అలాగే తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపంలో భక్తులు పోటెత్తారు. ఆలయ ఆవరణలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి.
కరుణించు మంగమ్మ తల్లీ
కరుణించు మంగమ్మ తల్లీ


