మన్యంలో చలి పంజా
● దట్టంగా కమ్ముతున్న పొగ మంచు
● క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
బుట్టాయగూడెం: పొడి వాతావరణం ఏర్పడడంతో పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతూ తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు దట్టమైన మంచు కమ్ముకుంటుంది. ఆకాశంలో పాక్షికంగా మేఘావృతమై శీతల గాలులు వీస్తున్నాయి. తెల్లవారుజామున సుమారు 15 నుంచి 17 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత వాతం రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలితీవ్రతతో ఏజెన్సీ ప్రజలు వణికిపోతున్నారు. ఉన్ని దుస్తులు, స్వెటర్‌లు, మంకీ క్యాప్‌లు లేకుండా బయట తిరగలేకపోతున్నారు. సాయంత్ర వేళల్లో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఉదయం 10 గంటల వరకూ చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో పాఠశాలలకు వెళ్ళే చిన్నారులు కూడా చలికి అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు, కూలీలు కూడా పొగమంచు, చలి గాలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చలిగాలుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
కొండప్రాంతాల్లో పెరిగిన చలిప్రభావం
కొండ ప్రాంతాల్లోని గ్రామాలైన రేగులపాడు, రేపల్లి, డోలుగండి, లంకపాకల, అలివేరు, దొరమామిడి డ్యామ్, చింతకొండ, గొట్టాలరేవు, తానిగూడెం, మోతుగూడెం, కామవరం, గుబ్బల మంగమ్మతల్లి పరిసర ప్రాంతం, పులిరామన్నగూడెం, ముంజులూరు, ఉప్పరిల్ల, చింతకొండ, దారావాడ, చిలకలూరు, గడ్డపల్లి, గిన్నేపల్లి గ్రామాల్లో ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలు నమోదవుతుండడంతో అక్కడ చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఉదయం 11 గంటల వరకూ ఆయా గ్రామాల్లో గిరిజనులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం, సాయంత్రం చలిమంటలు వేసుకుంటూ చలినుంచి కాపాడుకుంటున్నారు.
మన్యంలో చలి పంజా


