జ్వరంతో విద్యార్థిని మృతి
వీరవాసరం: ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోవడంతో ఆదివారం వీరవాసరంలో విషాద చాయలు అలుముకున్నాయి. వీరవాసరంలోని జెడ్పీ పాఠశాల విద్యార్థిని నాలం భాగ్యశ్రీ (13) కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ప్రైవేటు ఆర్‌ఎంపీ వద్ద, పాలకొల్లులోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య చికిత్స చేశారు. పరిస్థితి విషమంగా మారడంతో శనివారం విజయవాడ తీసుకెళ్తుండగా మధ్యలోనే మృతి చెందింది. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, దోమల ఉధృతి ఎక్కువగా ఉండడంతో తీవ్ర జ్వరాల బారిన పడుతున్నారని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. దోమకాటు ప్రభావంతోనే ప్లేట్‌లెట్స్ పడిపోయి భాగ్యశ్రీ మృతి చెందిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


