నెల్లూరు(బారకాసు): ఆహారానికి సంబంధించి నెల్లూరుకు ప్రత్యేక స్థానం ఉంది. చిరుతిండ్లను ప్రజలు ఎంతో ఇష్టపడి తింటుంటారు. అయితే అవి ఎంత వరకు ఆరోగ్యకరం.. అనేది అటు వ్యాపారులు, ఇటు అధికారులు ఎలాంటి పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు. అధిక శాతం చిరుతిండ్ల వ్యాపారాలు రోడ్లుపైనే నడుస్తున్నాయి. నిత్యం వాహనాలతో రేగే దుమ్మూధూళి నుంచి కనీస రక్షణ ఉండటం లేదు.
అధికారులు కనీసం అటువైపు కూడా చూడటం లేదు. చివరకు ప్రజలు కూడా రోడ్లపై విక్రయించే చిరుతిండ్లతో రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం వివిధ పట్టణాల్లో డయేరియా లక్షణాలతో జనం ఆస్పత్రి పాలవుతున్న నేపథ్యంలో నెల్లూరులోనూ ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది.
దుమ్మూధూళి పడేలా..
నగరంలోని ప్రతి ప్రధాన వీధిల్లో ఆహార పదార్థాలు విక్రయించే టిఫిన్ బండ్లు, స్వీట్లు అమ్మే దుకాణాలు కనిపిస్తుంటాయి. రకరకాల స్వీట్లతో పాటు బజ్జీలు, పకోడి, కారంపూస, బూంది, చెకోడీలను విక్రయిస్తుంటారు. నూనెతో చేసిన పదార్థాలు ఆకర్షణీయంగా కనిపిస్తూ రోడ్డు వెంట వెళ్లేవారి నోరూరిస్తుంటాయి. రోడ్డు పక్కన వ్యాపారాలకు ఎవరూ అభ్యంతరం పెట్టరు. అయితే తినుబండారాలను దుమ్మూధూళి పడేలా ఉంచటం కచ్చితంగా వినియోగదారుల ఆరోగ్యానికి మంచింది కాదు.
నగరంలోని ఇరుకురోడ్లలో తిరిగే వాహనాల్లోంచి వచ్చే పొగ, టైర్ల నుంచి లేచే దుమ్ము ఎక్కువ. నూనెతో చేసిన ఆహార పదార్థాలకు దుమ్ము తేలికగా అతుక్కుపోతుంది. దీనికితోడు కొందరు మరిగించిన నూనెను పదేపదే వాడుతున్నారు. ఇది హానికరమని తెలిసినా ఎవరూ ఖాతరు చేయడం లేదు. అంతేకాకుండా పలుచోట్ల నూనె ప్యాకెట్లను కట్ చేయకుండా వేడి కడాయ్‌లో ఉంచడం వల్ల ప్లాస్టిక్ కవరు కరిగిపోయి నూనె బాండీలో పడుతోంది. ఇది ఎంతో హానికరమైనా వ్యాపారులు పట్టించుకోవడం లేదు.
హానికరమని తెలిసినా కొనేస్తున్న జనం
కేన్సర్ విజృంభిస్తున్న నేటి రోజుల్లో హానికరమైన తినుబండారాలకు దూరంగా ఉండాలనే భావన జనంలో ఉండటం లేదు. రోడ్ల వెంట దుమ్మూధూళి పడేచోటనే కొనుగోలు చేసి తింటున్నారు. స్వీట్లు వంటివి తక్కువ ధరకు వస్తున్నాయనగాని కొనేసి, బంధుమిత్రులకు కానుకగా ఇస్తున్నారు.
తినుబండారాలపై తగిన రక్షణ ఏర్పాట్లు ఉండేలా చూడాల్సిన అధికారులు అటుకేసి చూడటం లేదు. ఫుడ్ సేఫ్టీ, నగరపాలక సంస్థ అధికారులకు ఎవరైనా పనిగట్టుకుని ఫిర్యాదు చేస్తే మినహా, పట్టించుకోవటం లేదు. విధిగా తనిఖీలు చేయాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


