సాక్షి రాయచోటి: పండ్ల తోటల రైతులకు ప్రతిసారి కష్టకాలమే ఎదురవుతోంది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాల వ్యవధిలో వ్యయ ప్రయాసలు తప్ప ప్రయోజనం కనిపించడం లేదు. మామిడి రైతులు సీజన్‌లో ధరలు లేక అల్లాడిపోగా, ప్రస్తుతం వ్యవసాయం గిట్టుబాటు కాదని చెట్లన్నీ కొట్టేస్తున్నారు. మరోవైపు బొప్పాయి రైతులు కూడా దళారుల బాధపడలేక...ధరలు లేక నడిరోడ్డుపై ఆందోళన చేపట్టారు.
అయితే అంతంత మాత్రం ధరలతో సమస్య సర్దుమణిగేలా చేశారు తప్ప పూర్తి స్థాయి పరిష్కారంచూపలేదు. ఇలా చెబుతూపోతే ఒకటేమిటి..మొన్నటివరకు టమాటాకు కూడా ధర లేక అన్నదాతలు అల్లాడిపోయారు. గతంలో ఒక వెలుగు వెలిగిన అరటి పంటకు కూడా ధర లేదు. ప్రస్తుతం అరటికి సంబంధించి టన్ను రూ. 2–3 వేల లోపు ధర పలుకుతుండడంతో ఏం చేయాలో పాలుపోక పడరాని కష్టాలు పడుతున్నారు.
రైతుకు నష్టం...వ్యాపారులకు లాభం
జిల్లాలో అరటి రైతు కుదేలవుతున్నాడు. ధర లేకపోవడంతో ఎందుకు సాగు చేశామన్న మీమాంసలో ఉన్నాడు. కనీసం పెట్టుబడులకు కూడా సరిపోయే ధర లేకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఇదే క్రమంలో బయట మార్కెట్‌లో వ్యాపారులు మాత్రం సొమ్ము చేసుకుంటున్నారు. రైతుకు ధర గిట్టుబాటు లభించడం లేదు. అదే బయట మార్కెట్‌లో డజను రూ.40–50లకు అమ్ముతున్నారు.
ఒక్కచోట ఏమిటీ...రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె ఇలా అన్నిచోట్ల పట్టణాల్లో బయట మార్కెట్‌లో ఈ ధర పెట్టి కొనాల్సి వస్తోంది. రైతుకు గిట్టుబాటు ధర ఎందుకు దక్కడం లేదో అర్థం కావడం లేదు. కాయలు రైతుల నుంచి మండీలకు వచ్చి అక్కడి నుంచి వ్యాపారులకు చేరుతున్నాయి. మధ్యలో దళారులు కూడా మాయ చేస్తూ రైతులను దెబ్బతీస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తోటల్లోనే మాగుతున్న అరటి
జిల్లాలో అరటి రైతుకు విపత్కర పరిస్థితులు ఎదురవుతున్నాయి. టన్ను రూ. 2–3 వేలు ధర ఒక ఎత్తయితే... కాయలు కొనుగోలు చేసేవారు లేకపోవడంతో తోటల్లోనే చెట్లపైనే కాయలు మాగుతున్నాయి. రైతు లు ఎవరికీ చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్నారు.
చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోడంతో ఏమి చేయాలో పాలుపోక అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఒకప్పుడు వైఎస్సార్ సీపీ హయాంలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మద్దతు ధరతోనైనా కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఏది ఏమైనా అరటి రైతుకు ప్రస్తుతం కంటిమీద కునుకు లేకుండా పోతోంది.
అరటి రైతుకు కడగండ్లు
అన్నమయ్య జిల్లాలో 12 వేల ఎకరాలకు పైగా పంట సాగులో ఉండగా, 9 వేల ఎకరాల్లో మొదటి, రెండు, మూడో క్రాప్‌కు సంబంధించిన కాయలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు గత కొన్ని రోజులుగా ధరలు గణనీయంగా పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు నుంచి ప్రతినిత్యం నాందేడ్, మహరాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు పదుల సంఖ్యలో లారీల్లో లోడు వెళ్లేది.
కానీ ప్రస్తుతం ధరలు లేకపోవడంతో అడిగేవారు లేరు. దీంతో లారీలు కూడా రైల్వేకోడూరులో పక్కన పెట్టేశారు. గతంలో వైఎస్సార్ సీపీ హయాంలో రూ. 25–30 వేల వరకు ధరలు పలికాయి. ప్రస్తుతం దళారుల మాయో లేక డిమాండ్ లేకనో తెలియదుగానీ టన్ను అరటి రూ. 2–3 వేలకు పడిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
దిక్కుతోచడం లేదు
మూడు ఎకరాల్లో అరటిపంటను సాగు చేశా. మొదటి కోతకు వచ్చేసరికి మార్కెట్లో ధర లేదు. రూ. లక్షలు పెట్టు బడి పెట్టి అమ్ముకోలేక పంటను పొలంలోనే వదిలేశాను. ఏం చేయాలో దిక్కుతోచకుండా ఉంది.
– టి.ప్రభాకర్‌రెడ్డి,అనంతంపల్లి, పుల్లంపేట మండలం
పెట్టుబడి కూడా రాని వైనం
16 ఎకరాల్లో అరటిపంట సాగు చేశాను, ధర పూర్తిగా పతనమైంది. దీంతో పెట్టుబడులు కూడా రావడంలే దు. ప్రస్తుతం అరటి టన్ను రెండు రూ. 2–4 వేలు పలుకుతోంది. దళారులు కుమ్మక్కై ధర తగ్గిస్తున్నారు. ప్రభుత్వం ఆదు కోవాలి.
– ఎన్.సురేష్‌కుమార్‌రెడ్డి, పుల్లంపేట
తీవ్రంగా నష్టపోయాం
ఏడు ఎకరాల్లో అరటిని సాగు చేశాను. ఎకరాకు దాదాపు రూ. లక్షకు పైగా ఖర్చు వచ్చింది.ప్రస్తుతం ధరలు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం ఆదుకోవాలి. – వాసు, రైతు, అనంతసముద్రం, పుల్లంపేట మండలం
కాయలు తోటల్లోనే మాగిపోతున్నాయి
పది ఎకరాల్లో అరటి సాగు చేశాను. ఎకరాకు రూ. 1.20 లక్షలు ఖర్చు వచ్చింది. ధ రలు లేకపోవడంతో కాయలు తోటల్లోనే మాగిపోతున్నాయి. రూ. 15 లక్షల వరకు నష్టపోయాను. తోటను పూర్తిగా వదిలి వేశా.
– సుధాకర్‌రెడ్డి, రైతు, కోనయ్యగారిపల్లె, పుల్లంపేట మండలం


