రండి.. ప్రధానితో మాట్లాడండి | Opportunity For Students To Interact With PM Modi Through Pariksha Pe Charcha 2026 Program, More Details Inside | Sakshi
Sakshi News home page

రండి.. ప్రధానితో మాట్లాడండి

Dec 8 2025 1:56 PM | Updated on Dec 8 2025 2:59 PM

PM Narendra Modi will directly interact with students

విద్యార్థులకు ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనే అవకాశం 

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల భాగస్వామ్యం  

ఆన్‌లైన్‌లో నమోదుకు జనవరి 11 తుది గడువు

రాయవరం: ప్రధానితో నేరుగా మాట్లాడాలనుకుంటున్నారా.. ఇప్పుడు ఆ అవకాశం మీ చేతుల్లోనే ఉంది. మీరు చేయాల్సిందల్లా ప్రధానమంత్రి ‘పరీక్షా పే చర్చ’ యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు కావాలి. ఏటా పరీక్షల ముందు ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిని కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, ఇప్పుడు 9వ ఎడిషన్‌కు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ప్రధాని మోదీ నేరుగా సంభాషించనున్నారు. పరీక్షలను సమర్ధవంతంగా, ఒత్తిడి లేకుండా ఎదుర్కోవడం, చిరునవ్వుతో పరీక్షలకు సమాధానాలు రాయడం ద్వారా విద్యార్థులకు పరీక్షలంటే భయాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  

పరీక్షల సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఆ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలి.. విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? విద్యార్థుల ఆకాంక్ష ఏంటి? వాటిని చేరుకోవడానికి అనుసరించాల్సిన మార్గాలు.. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఎలా ఉండాలి.. తదితర అంశాలపై ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు అర్హులు. దీనిద్వారా ప్రధానమంత్రి శక్తివంతమైన యువతతో కనెక్ట్‌ అవుతారు. యువతతో మమేకమై వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. 

యువత ఎదుర్కొనే సవాళ్లు, ఆకాంక్షలను మరింతగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం కూడా కలుగుతుంది. ‘పరీక్షా పే చర్చ’ మొదటి ఎడిషన్‌ 2018 ఫిబ్రవరి 16న ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించారు. ఇప్పుడు కూడా విద్యార్థులు తమ ప్రశ్నను ప్రధానమంత్రిని నేరుగా అడగవచ్చు. ప్రశ్న గరిష్టంగా 500 అక్షరాల లోపు ఉండాలి. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పాల్గొనవచ్చు. వారి ఎంట్రీలను కూడా ఆన్‌లైన్‌లో పంపే అవకాశం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కల్పించింది. వీటిలో మంచి ప్రశ్నలను ఎంపిక చేసి అర్హులను నిర్ణయిస్తారు. 

విజేతలుగా నిలిస్తే.. 
పరీక్షా పే చర్చలో విజేతలు నేరుగా ప్రధానమంత్రిని కలుసుకునే అవకాశాన్ని పొందుతారు. ప్రతి విజేతకు ప్రత్యేక కిట్‌ అందజేస్తారు. విజేతలకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు. విజేతలు ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్‌ను, ఫొటోతో కూడిన డిజిటల్‌ సావనీర్‌ను పొందే అవకాశముంది.

లాగిన్‌ అవ్వాలిలా.. 
విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హెచ్‌టీటీపీఎస్‌://ఇన్నోవేట్‌ఇండియా.మైజీవోవీ.ఇన్‌ అని క్లిక్‌ చేయాలి. ఎంటర్‌ కాగానే క్లిక్‌ ఏజ్‌ స్టూడెంట్, టీచర్, పేరెంట్స్‌ అనే లాగిన్స్‌ కనిపిస్తాయి. వాటిలోకి ఎంటర్‌ కాగానే మీ మొబైల్‌ నంబరు లేదా జీమెయిల్‌ ఖాతాను పూర్తి చేయాలి. ఓటీపీతో లాగిన్‌ అయి క్లిక్‌ చేయాలి. ఓటీపీ రాగానే మళ్లీ లాగిన్‌ చేయాలి. స్టూడెంట్స్‌కు నేరుగా ఫోన్‌ నంబరు, జీమెయిల్‌ లేని సందర్భంలో టీచర్స్‌ లాగిన్‌ ద్వారా ఎంటర్‌ అయ్యే అవకాశం కల్పించారు. 

విద్యార్థులు/ఉపాధ్యాయులు/తల్లిదండ్రులు ప్రాథమిక సమాచారం వివరాలను పూర్తి చేయాలి. కార్యాచరణ వివరాలను పూర్తి చేసిన తర్వాత థీమ్‌ను ఎంచుకుని 500 అక్షరాల లోపు వివరించాలి. అధిక సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పరీక్షా పే చర్చలో పాల్గొనేలా ఉప, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలి. పరీక్షా పే చర్చకు ఎంపికైన సుమారు 2,050 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా పీపీసీ కిట్‌లను బహుమతిగా అందజేయనున్నారు.

క్షేత్ర స్థాయిలో ఆదేశాలు ఇచ్చాం 
పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా క్షేత్ర స్థాయిలో ఆదేశాలు ఇచ్చాం. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షలంటే భయం పోగొట్టడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. మనం సంధించే ప్రశ్న ద్వారా నేరుగా ప్రధానిని కలుసుకునే అవకాశం చిక్కుతుంది.  
– జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా  

సద్వినియోగం చేసుకోండి 
‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. 6–12 తరగతులకు చెందిన విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఇది చక్కని అవకాశం. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ఎవరి స్థాయిలో వారు కృషి చేయాలి. జాతీయ స్థాయిలో జిల్లాకు గుర్తింపు తీసుకురావాలి.  
– డాక్టర్‌ షేక్‌ సలీం బాషా, డీఈఓ, అమలాపురం   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement