సార్వత్రిక ఎన్నికల కోడ్ సందర్భంగా సామర్లకోటలోని కాలనీ ముఖద్వారంపై వై.ఎస్.ఆర్.జగనన్న పేరుపై అధికారులు పూసిన నల్ల రంగు
ఆయన పేరుపై రంగుల తొలగింపునకు మీనమేషాలు
పేరు పునరుద్ధరణలో అధికారుల తాత్సారం
టీడీపీ నేతల పేర్లు రాయించుకునేందుకు యత్నాలు!
సామర్లకోట: ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన జగనన్న కాలనీకి ఇంకా ఎన్నికల కోడ్ ముగిసినట్టు లేదు. కోడ్ నిబంధనల మేరకు వేసిన రంగులు నేటికీ తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాలనీ పేరును పునరుద్ధరించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం లే అవుట్‌లో సుమారు 50 ఎకరాల్లో అప్పటి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన జగనన్న కాలనీ పేరిట అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి 2023 అక్టోబరు 12న ప్రారంభించారు.
ప్రత్తిపాడు రహదారికి ఇరువైపులా ఉన్న ఈ కాలనీకి రెండు వైపులా రెండు ముఖద్వారాలు ఏర్పాటు చేసి కౌన్సిల్ తీర్మానంతో జగనన్న కాలనీగా పేరు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముఖద్వారాలపై ఉన్న జగనన్న పేరుపై నలుపు రంగు వేశారు. నాడు వేసిన రంగులు నేటికీ తొలగించపోవడం విమర్శలకు తావిస్తోంది. జగనన్న పేరు పునరుద్ధరణపై నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు మున్సిపల్ కమిషనర్‌కు వివరించినా ప్రయోజనం కనిపించలేదు. కాగా ఈ కాలనీకి టీడీపీ నాయకుల పేర్లు పెట్టుకోవడానికి యతి్నస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉంది.
పేదలకు ఎంతో విలువైన స్థలాలు
ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం రహదారుల కూడలిలో రోడ్డు మార్జిన్‌లో ఈ కాలనీలో ఇప్పటికే అనేక మంది ఇళ్లు నిర్మించుకోవడమే కాకుండా పార్కులతో కాలనీని సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీకి ఆదరణ పెరుగుతుందనే కక్షతో ముఖద్వారాలపై పేర్లు రాయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడంతో ఆయన పేరు చరిత్రలో గుర్తుండిపోతుంది. అటువంటి ముఖ్యమంత్రి పేరును రాయించడానికి మున్సిపల్ అధికారులకు ఎందుకు చేతులు రావడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఏపీ బీసీఎల్ వైపు ఉన్న కాలనీ ముఖద్వారంపై పేరు కనపడకుండా పూర్తిగా వేసిన రంగు
కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం
ఈటీసీ లే అవుట్‌లోని వైఎస్సార్ జగనన్న కాలనీ ముఖద్వారంపై ఉన్న పేరుకు రంగులు తొలగించాల్సిన విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. అనేక కౌన్సిల్ సమావేశాలలో అధికారులను ప్రశ్నించాం. గతంలో తాను పని చేసిన ప్రదేశాల్లోని భవనాలకు రంగులు వేయలేదని, కేవలం పేపర్లు అతికించామని కమిషనర్ చెప్పారు. గతంలో ఉండేలా పేర్లు రాయిస్తానని హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన స్వయంగా పరిశీలించి కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లారు.
– ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సామర్లకోట
జగనన్న కాలనీపై కుట్ర జరుగుతోంది
జగనన్న కాలనీపై ఏదో కుట్ర జరుగుతోంది. ఆ ప్రాంతంలో పారిశుధ్య పనులు సక్రమంగా చేయడం లేదు. ఎన్నికల కోడ్ సమయంలో జగనన్న కాలనీ ముఖద్వారానికి వేసిన రంగుల స్థానంలో పేర్లు రాయించాలని మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య దృష్టికి తీసుకు వెళ్లాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్ధం కాలేదు. మా నాయకుడు దొరబాబుతో చర్చించి ఏంచేయాలో ఆలోచిస్తాం.
– ఉబా జాన్‌మోజెస్, మున్సిపల్ వైస్ చైర్మన్, సామర్లకోట


