రామచంద్రపురం: మున్సిపాలిటీలో చక్రం తిప్పుతూ.. అనుకున్న పనులే చేస్తూ.. ఎవరినీ లెక్కచేయకుండా, అన్నీ తానై ఓ ఇంజినీరింగ్ అధికారి వ్యవహరిస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆరోపణలు చేయడం రామచంద్రపురంలో చర్చనీయాంశమైంది. అన్ని పార్టీలు ఏకమై ఆ అధికారిని సాగనంపాలని కోరుతుండటం చూస్తుంటే, పరిస్థితి ఎక్కడ వరకూ వెళ్లిందో చెప్పకనే అర్థమవుతోంది. స్థానిక మున్సిపాలిటీలో ఉన్నత స్థానంలో ఉన్న ఆ అధికారి చర్యలతో వేడిరాజుకుంది.
ఆయన్ని సాగనంపాలని కోడై కూస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయం. కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది, కాంట్రాక్టర్లంతా కలసి ఈ అధికారి మాకొద్దు బాబోయ్ అంటున్నా నియోజకవర్గ ప్రజాప్రతినిధి మాత్రం పట్టించుకోవడం లేదు. ఎంత మంది ఎదురు తిరిగితే నాకేంటి నేను ‘డాడీ గారి’ సేవలో ఉంటే చాలు అంటూ ఆ ఉద్యోగి ఏ మాత్రం జంకు లేకుండా ఉంటున్నారని కౌన్సిలర్లు, సిబ్బంది, కాంట్రాక్టర్లు అంటున్నారు.
ప్రస్తుతం రామచంద్రపురం మున్సిపాలిటీలో పార్టీలకు అతీతంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన కౌన్సిలర్లు చైర్ పర్సన్‌తో కలసి ఆ అధికారిపై స్థానికంగా ఉన్న మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అతనిపై కౌన్సిలర్లతో పాటు తన తోటి సిబ్బంది, కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. ఈయన వ్యవహార శైలి బాగోలేదని, మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని అభియోగాలు మోపారు.
టెండర్ల దగ్గర నుంచి కాంట్రాక్టు పనులు చేయించడం, ఎం బుక్‌లు సైతం ఆయనే రాయిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్లకు నోడ్యూస్ సర్టిఫికెట్లను తన వారికే జారీ చేయడంతో పాటు టెండర్లు, నోడ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలోనే పర్సంటేజీలు మాట్లాడుకోవడం జరిగిపోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కౌంటర్ ఓచర్లు సైతం అతను ఇష్టానుసారంగా పెడుతుంటే, దానికి సంబంధించిన సెక్షన్ అధికారి వాటిని తిప్పి పంపడం, అవి ‘డాడీ గారి’ వద్ద పంచాయితీ పెట్టడం ఇలా ఎన్నో తంతులు మున్సిపాలిటీలో జరుగుతున్నాయని కాంట్రాక్టర్లు, సిబ్బంది వాపోతున్నారు. ఏడాది కాలంగా ఇలా ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకూ ఆయన్ని బదిలీ చేయకపోవడం వెనుక మర్మమేమిటో ఫిర్యాదు చేసిన వారికి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
గతంలోనూ ఇంతే..
సదరు అధికారి గత చరిత్రను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో ఉండగా అక్కడ కూడా ఇదే తరహాలో కౌన్సిలర్లు వ్యతిరేకించారు. వారు మున్సిపాలిటీలో కాకుండా ఒక కల్యాణ మండపంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడంతో దిగి వచ్చిన ప్రభుత్వం అతన్ని రీకాల్ చేసింది. మున్సిపాలిటీ నుంచి వేరే శాఖకు బదిలీ చేసిన అనంతరం కూడా కొన్నేళ్లు విధులకు దూరంగా ఉన్న సదరు అధికారిని తీసుకువచ్చి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారని కౌన్సిలర్లు చెబుతున్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ని ఇక్కడకు ఏ కారణంగా ‘డాడీ గారు’ తీసుకువచ్చారోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లు ఆమోదం పొందేలా చూసి మిగిలిన వారిని పక్కన పెట్టి పర్సంటేజీలు దండేస్తున్నారనే ఆరోపణలతో పాటు తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆ అధికారి వ్యవహరిస్తున్న తీరు అందరిలో మంట రేపుతోంది.


