హిడ్మా మరణంలో ద్రోహులు వారే.. | Maoist Dandakaranya Special Zonal Committee releases letter | Sakshi
Sakshi News home page

హిడ్మా మరణంలో ద్రోహులు వారే..

Dec 5 2025 4:23 AM | Updated on Dec 5 2025 4:23 AM

Maoist Dandakaranya Special Zonal Committee releases letter

కలప వ్యాపారి మాటలు నమ్మి చికిత్స కోసం విజయవాడకు..

ఇంటెలిజెన్స్‌కు సమాచారం ఇచ్చిన కాంట్రాక్టర్లు, వ్యాపారులు

హిడ్మా మరణంతో దేవ్‌జీకి సంబంధం లేదు.. మనీశ్, సోనిసోరి ఆరోపణలు సరికాదు

మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ పేరిట లేఖ

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఏపీలోని మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్‌కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, శంకర్‌ హత్యలపై న్యాయ విచారణ జరిపించి, దోషులకు కఠిన శిక్ష విధించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరుతో గతనెల 27న జారీ చేసిన లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది. హిడ్మా హత్యకు దేవ్‌జీ కార ణమంటూ మనీశ్‌ కుంజాం, సోనీసోరి చేసిన ఆరో పణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పార్టీ పేర్కొంది. ఆ లేఖలోని ముఖ్య విషయాలు ఇలా ఉన్నాయి.

పోలీసులు పట్టుకొని హత్య చేశారు 
‘విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారిని నమ్మిన హిడ్మా, చికిత్స కోసం అక్కడకు అక్టోబర్‌ 27న వెళ్లాడు. ఆ తర్వాత మరికొందరు మావోయిస్టులు కూడా విజయవాడకు చేరారు. నిరాయుధులైన హిడ్మా సహా ఆరుగురిని పోలీసులు పట్టుకొని హత్య చేశారు. ఆ తర్వాత ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు తప్పుడు కథ అల్లారు. నవంబర్‌ 19న అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో ఏడుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలోనూ నిరాయుధులైన ఏఓబీ (ఆంధ్రా–ఒడిశా స్పెషల్‌ జోనల్‌ కమిటీ) సభ్యుడు శంకర్, మరో ఆరుగురిని పట్టుకొని బూటకపు ఎన్‌కౌంటర్‌లో హత్య చేశారు. 

బయటకు తీసుకెళ్లిన వ్యక్తులే...
నవంబర్‌ 9న మా బలగాల నుంచి కోసల్‌ అనే సభ్యుడు పారిపోయాడు. నేరుగా వెళ్లి తెలంగాణ పోలీసుల ముందు సరెండర్‌ అయ్యాడు. ఆయనకు హిడ్మా ప్రయాణ వివరాలన్నీ తెలుసు. వెంటనే అడవిలోకి వచ్చేయాలని పార్టీ తరఫున హిడ్మాకు సమాచారం ఇచ్చాం. ఈ సమాచారం ఆయనకు నవంబర్‌ 14న మధ్యాహ్నం అందింది. ఆ వెంటనే అడవిలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించాడు.

అదేరోజు సాయంత్రం 4–5 గంటల సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. వారంతా పోలీసుల చేతిలో చనిపోయారు. మరో మావోయిస్టు నేత శంకర్‌ విషయంలోనూ ఇలాగే జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్, విజయవాడలోని కలప ఫర్నిచర్‌ వ్యాపారి, బిల్డర్లు 50 మంది మావోయిస్టుల అరెస్ట్‌కు కారణం. వీరే మావోయిస్టులకు ఆశ్రయం కల్పిస్తామని తీసుకెళ్లి పోలీసులకు చెప్పారు. ఫలితంగా ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులు పట్టుబట్టారు. ఈ వ్యవహారమంతా ప్రభుత్వ ఇంటెలిజెన్స్‌ వర్గాలకు తెలుసు. 

న్యాయ విచారణ చేయాలి
ఈ మొత్తం కుట్ర వెనుక ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల హస్తం స్పష్టంగా తెలుస్తోంది. హిడ్మా, శంకర్‌తోపాటు మొత్తం 13 మందిని అరెస్టు చేసి నకిలీ ఎకౌంటర్లు సృష్టించారు. ఈ హత్యలకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్ద అధికారులు బాధ్యులు. ఈ ఆపరేషన్‌ విజయవంతం కావడానికి విదేశీ కాపలాదారులు కూడా సహకరించారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరగాలి. 

కుట్రలో భాగమే
ఏపీలో అరెస్ట్‌ అయిన వారిలో దేవ్‌జీ, సంగ్రామ్‌ లేరని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. కానీ హిడ్మా మరణానికి దేవ్‌జీ కారణం అనే ప్రచారం జరగడం, దానికి సోని సోరి, మనీశ్‌ కుంజమ్‌ లాంటి నేతలు వంత పాపడటం రాజ్యం పన్నిన కుట్రలో భాగమే’అని మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ఆ లేఖలో వెల్లడించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement