వంద కోట్ల అవినీతి తిమింగలం! | Disproportionate assets case against AD Srinivasulu | Sakshi
Sakshi News home page

వంద కోట్ల అవినీతి తిమింగలం!

Dec 5 2025 4:14 AM | Updated on Dec 5 2025 4:14 AM

Disproportionate assets case against AD Srinivasulu

ఏడీ శ్రీనివాసులుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

కలెక్టరేట్‌ సహా ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేటలో రూ.కోట్లలో ఆస్తులు  

అనంతపురంలో 11, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూములు

ఆస్తుల విలువ రూ.వంద కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా

సాక్షి, రంగారెడ్డి జిల్లా/మహబూబ్‌నగర్‌ క్రైం: రంగారెడ్డి జిల్లా సర్వే సెటిల్‌మెంట్‌ అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ)గా పనిచేస్తున్న కొత్తమ్‌ శ్రీనివాసులు ఏసీబీకి చిక్కారు. తప్పుడు సర్వేలతో ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆరు బృందాలుగా విడిపోయి గురువారం ఏక కాలంలో ఇళ్లు, ఆఫీసు, బంధువులు, బినామీల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 

బహిరంగ మార్కెట్లో ఆయన ఆస్తుల విలువ రూ.వంద కోట్లకుపైగా ఉన్నట్లు అంచనా. శ్రీనివాసులు ప్రస్తుతం హైదరాబాద్‌ ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నాడు. శుక్రవారం ఏసీబీ కోర్టులో ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది. శ్రీనివాసులు మరో ఏడాదిలో పదవీ విరమణ అవుతున్నట్లు సమాచారం.  

మూడు రాష్ట్రాల్లో రూ.కోట్ల ఆస్తులు
శ్రీనివాసులుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా కర్ణాటకలోనూ రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాయదుర్గం మైహోం భూజాలో విలాసవంతమైన ఫ్లాట్, అనంతపురంలో 11 ఎకరాలు, కర్ణాటకలో 11 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తించారు.

 అదే విధంగా నారాయణపేటలో రైస్‌మిల్, మహబూబ్‌నగర్‌లో నాలుగు ప్లాట్లు, నారాయణపేటలో మూడు ప్లాట్లు, ఇంట్లో 1.6 కేజీల బంగారు ఆభరణాలు, 770 గ్రాముల వెండి వస్తువులు, రూ.ఐదు లక్షల నగదు, కియా, ఇన్నోవా కార్లు దొరికాయి. 

ఆయన గతంలో నల్లగొండ సహా మేడ్చల్‌ జిల్లా ల్యాండ్స్‌ అండ్‌ సర్వే రికార్డ్స్‌ అధికారిగా కూడా పని చేశారు. మేడ్చల్‌ జిల్లాలో పని చేస్తున్న సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రాగా, అప్పట్లోనే ఏసీబీ కేసు కూడా నమోదైంది. కొంతకాలం సస్పెన్షన్‌లో ఉండి, ఆ తర్వాత మళ్లీ విధుల్లో చేరారు.

తప్పుడు సర్వేలతో అక్రమార్జన
శంకర్‌పల్లి మండలం మోకిల–కొండకల్‌ రెవెన్యూల మధ్య ఉన్న వంద ఎకరాల గ్యాప్‌ లాండ్స్‌కు 555 సర్వే నంబర్‌ కేటాయించి, విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంలోనూ, ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌ రెవెన్యూ పరిధిలోని 33 ఎకరాల బిలాదాఖల భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 

శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్‌ గ్రామం సర్వే నంబర్‌ 63లో రూ. 2,100 కోట్ల విలువ చేసే 42 ఎకరాల సర్కార్‌ భూమి, శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలోని సర్వే నం. 124/10, 11లోని రూ.రెండు వేల కోట్ల విలువ చేసే 50 ఎకరాలు, శేరిలింగంపల్లి గ్రామం సర్వే నం. 90, 91 నుంచి 102లోని 110 ఎకరాల అలూమినీ కంపెనీ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో, సర్వే నం. 68లో ఐదెకరాల ప్రభుత్వ భూమి పట్టాగా మారడంలోనూ, హఫీజ్‌పేట్‌ సర్వే నం. 80లోని భూమి, కొండాపూర్‌ సర్వే నం. 87, 88 ల్లోని భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. 

అలాగే, వట్టినాగులపల్లి సర్వే నం. 186, 187లో 20 ఎకరాల భూదాన్‌ భూములు, గండిపేట్‌ మండలం ఖానాపూర్‌లోని 150 ఎకరాల బిలా దాఖల భూములకు సర్వే నంబర్‌ 65 కేటాయించి, ఆయా భూములు అన్యాక్రాంతం కావడంలోనూ శ్రీనివాసులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మియాపూర్‌ సర్వే నం. 69లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక అప్పటి శేరిలింగంపల్లి రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్స్‌ అధికారులు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 

గచ్చిబౌలిలో సర్వే నంబర్లు 38 నుంచి 54 వరకు గల 76 ఎకరాల సీలింగ్‌ సర్‌ప్లస్‌ భూములు, మహేశ్వరం మండలం మహేశ్వరం–తుమ్మలూరు గ్రామాల మధ్య ఉన్న 70 ఎకరాల బిలా దాఖల భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వెనుక కూడా శ్రీనివాసులు హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement