ఫిర్యాదుల కోసం మందుల షాపుల్లో క్యూఆర్ కోడ్
అందరికీ కనిపించేలా టోల్ ఫ్రీ నంబర్ సైతం
భారత ఔషధ భద్రతా వ్యవస్థలో పెద్ద ముందడుగు
దేశవ్యాప్తంగా వెంటనే అమలు చేయాలన్న కేంద్రం
ఫార్మసీలో అడుగు పెట్టగానే మందులు, న్యూట్రాస్యూటికల్స్, కొన్ని రకాల జనరల్ ఐటమ్స్ దర్శనమిస్తాయి. ఇక నుంచి ఓ క్యూఆర్ కోడ్ కూడా ప్రత్యక్షం కానుంది. క్యూఆర్ కోడే కదా అని తీసిపారేయకండి. భారత ఔషధ భద్రతా వ్యవస్థలో ఇదొక పెద్ద ముందడుగు. ఔషధాల వల్ల ఆరోగ్య సమస్య తలెత్తితే ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్ విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఫార్మసీలు, హోల్‌సేల్ మందుల దుకాణాల్లో అందరికీ కనిపించేలా ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా క్యూఆర్ కోడ్‌తోపాటు టోల్‌ఫ్రీ నంబర్ 1800–180–3024 ప్రదర్శించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఆదేశించింది.
ఔషధం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయితే.. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వినియోగదారులు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్య, ఆ మందు తాలూకా బ్యాచ్, కంపెనీ వివరాలు అందిస్తే చాలు. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిట రింగ్ సిస్టమ్ ఈ ఫిర్యాదులను స్వీకరించి సదరు బ్యాచ్‌లో తయారైన ఔషధాల నాణ్యతను పరీక్షి స్తుంది. లోపం ఉందని తేలితే నిబంధనల ప్రకా రం చర్యలు తీసుకుంటారు.
నేరుగా ప్రజల నుంచే..
మధ్యప్రదేశ్‌లో కోల్డ్‌రిఫ్ అనే దగ్గు మందు ఇటీవల 23 మంది పిల్లల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఔషధ తయారీలో ఫార్మా –గ్రేడ్‌కు బదులుగా పారిశ్రామిక అవసరాలకు వాడే ముడిపదార్థాలను ఉపయోగించినట్టు ఈడీ తేల్చింది. ఔషధ రంగ పరిమాణంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్‌లో నాసిరకమైన మందులు, నకిలీలు పెద్ద ముప్పుగా నిలిచాయి. ఔషధాల వల్ల తలెత్తే ప్రతికూల ఫలితాలపై ఫిర్యాదులను నేషనల్ ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ కింద 2010 నుంచి కేంద్ర ప్రభుత్వం స్వీకరిస్తోంది.
నకిలీలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే టాప్–300 బ్రాండ్స్ ఔషధాలపై కంపెనీలు క్యూఆర్ కోడ్ ముద్రిస్తున్నాయి. అన్ని టీకాలు, యాంటీమైక్రోబయాల్స్, నార్కోటిక్, సైకోట్రోపిక్ మందులకు దశలవారీగా ఈ విధానం అమలు చేయనున్నారు. అయితే ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే ఉత్పాదన గుర్తింపు సంఖ్య, బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీ చూపిస్తుంది. ఈ వివరాలు చూపించలేదంటే నకిలీ అన్నట్టు.
ఒక్క ఫిర్యాదు సైతం..
ఆరోగ్య రంగంలో ఉన్న నిపుణుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. సీడీఎస్‌సీఓ తాజా నిర్ణయం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుందని, నేరుగా వారి నుంచే ఫిర్యాదులు అందుతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. మన దేశంలో ఔషధాల వల్ల తలెత్తే హానికర సంఘటనలను ట్రాక్ చేసే విధానంలో క్యూఆర్ కోడ్ ఒక సంచలనం అని చెప్పవచ్చు.
‘వాస్తవానికి ప్రాణాలకు హాని జరిగితే తప్ప ఇటువంటివి బయటి ప్రపంచానికి తెలియవు. చాలా మంది రోగులు మందుల వల్ల దుష్ప్రభావాలు సహజమని లేదా తాత్కాలికమైనవని భావిస్తారు. సంబంధిత అధికారులను ఎప్పుడూ అప్రమత్తం చేయరు. దీంతో నాసిరకమైన మందుల గుర్తింపు జరగడం లేదు. సమస్యను ముందుగానే గుర్తించడంలో, వందలాది మందికి ఎదురయ్యే హానిని నివారించడంలో ఒక్క ఫిర్యాదు సైతం సహాయపడుతుంది’ అని సీడీఎస్‌సీఓ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
మూడు గంటలకు ఒకటి..
దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 32,000 కంటే ఎక్కువ శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. 2,500కుపైగా శాంపిల్స్ నకిలీ, కల్తీ అయ్యాయని నిర్ధారణ అయింది. సగటున ప్రతిరోజూ ఎనిమిది మందులు స్టాండర్డ్ క్వాలిటీ టెస్టుల్లో విఫలమవుతున్నాయి. అంటే దాదాపు ప్రతి మూడు గంటలకు ఒకటి అన్నమాట.
ముప్పు ఉందని భావిస్తే..
తయారీ సంస్థలపై తనిఖీలు నిరంతరంచేపడుతు న్నాం. ప్రధానంగా దగ్గు మందుల వంటి ముప్పు ఉండే ఔషధ తయారీ యూనిట్లలో నాణ్యతను పరీక్షిస్తూనే ఉన్నాం. ఫార్మసీల్లో క్యూఆర్ కోడ్ అమలైతే తయారీ సంస్థల్లో జవాబుదారీ, నాణ్యత విషయంలో ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా జనవరి నుంచి గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) కొత్త రూల్స్ రానున్నాయి. – పి.రాము, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ
ప్రజలకే ప్రయోజనం..
దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల మందుల దుకా ణాలు ఉన్నాయి. క్యూఆర్ కోడ్ విధానం అమలైతే ప్రజలకే ప్రయోజనం కలుగుతుంది. అసోసియే షన్ తరఫున క్యూఆర్ కోడ్స్ ముద్రించి అన్ని దుకా ణాలకు సరఫరా చేస్తున్నాం. నాసిరకం, నకిలీలకు మేం వ్యతిరేకం. ఔషధాన్ని పరీక్షిస్తేనే నాణ్యత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మందుల తయారీ విషయంలో పటిష్ట జీఎంపీ, లైసెన్సింగ్ విధానాలు అమలు కావాలి. – డాక్టర్ ఘీసూలాల్ జైన్, ప్రెసిడెంట్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కెమిస్ట్, డ్రగ్గిస్ట్


