సాక్షి, హైదరాబాద్: బీసీలకు 42 శాతం కోటాను అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నారంటూ ఒక యువకుడు నిప్పంటించుకున్న వైనం కలకలం రేపింది. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసు ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈరోజు (గురువారం) సాయంత్రం సాయి అనే యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తుందని దీనిపై పోరాటం చేయాలని తీన్మార్ మల్లన్న నీ కలిసేందుకు వచ్చానని చెప్పాడు. అయితే మల్లన్న ఆఫీసులో లేరని రేపు ఉదయం రావాలని చెప్పి పంపించారు అక్కడి సిబ్బంది.
అక్కడి నుండి కిందకి వచ్చిన ఆయన Q న్యూస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజన్‌కు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంటలను ఆర్పి ఆ యువకున్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిని పరామర్శించనున్నారు.


