సాక్షి, హైదరాబాద్: రైళ్లలో కర్పూరం వెలిగిస్తే కఠిన శిక్షలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా శబరిమలకు వెళ్లే యాత్రికులు రైలులో పూజ సందర్భంగా కర్పూరం వెలిగించకూడదని సూచిస్తున్నారు. రైల్వే నిబంధనల ప్రకారం ఇది నేరమని వివరించారు. రైళ్లలో కర్పూరం వెలిగిస్తే.. రూ.1,000 వరకు జరిమానా, లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రెండు శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
శబరిమల రైళ్లలో భక్తులు కర్పూరం వెలిగిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్లలో కర్పూరాన్ని వెలిగించడం నిషేధమన్నారు. రైలులో అగ్గిపుల్ల వెలిగించినా నేరమేనని చెప్పారు. ఇలాంటి చర్యలపై ప్రయాణికులు టోల్‌ఫ్రీ నంబరు 182కు ఫోన్ చేసి, సమాచారం అందించాలని ఓ ప్రకటనలో కోరారు.


