న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఒక కేసును ‘జాతీయ అవమానం’గా ధర్మాసనం అభివర్ణించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులలో పెండింగ్‌లో ఉన్న యాసిడ్ దాడి కేసులను నాలుగు వారాల్లోగా విచారణ జరిపి, వివరాలను తమకు సమర్పించాలని ఆదేశించింది.
యాసిడ్ దాడి బాధితురాలు షహీన్ మాలిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రోహిణి కోర్టులో 2009 నుండి పెండింగ్‌లో ఉన్న బాధితురాలి కేసులో పదేపదే జరుగుతున్న ఆలస్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మాలిక్ తన కేసు ఎందుకు ఇంకా ముగియలేదో వివరిస్తూ, ఒక దరఖాస్తును దాఖలు చేయాలని కోర్టు కోరింది. అవసరమైతే కోర్టు స్వయంగా విచారణను కూడా చేపట్టవచ్చని కూడా సూచించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందిస్తూ, ఈ తరహా కేసులను త్వరగా పరిష్కరిస్తామని, నేరస్థులు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
తక్షణ న్యాయం అందించేందుకు, యాసిడ్ దాడి కేసులను ప్రత్యేక కోర్టులు విచారించడం ఉత్తమమని ప్రధాన న్యాయమూర్తి కాంత్ సూచించారు. అంతేకాకుండా యాసిడ్ దాడి బాధితులను వైకల్యం ఉన్న వ్యక్తులుగా వర్గీకరించాలని, వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు వీలు కల్పించాలని మాలిక్ చేసిన విజ్ఞప్తిపై స్పందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. నిరంతర వైద్య సంరక్షణలో ఉంటూ, బాధితులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఇబ్బందులను మాలిక్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి: రష్యా అధ్యక్షుడు పుతిన్ రాక.. ఢిల్లీలో హై అలర్ట్..


