సీజేఐ ధర్మాసనం వారిస్తున్నా ససేమిరా
తన కేసు వినాల్సిందేనని మంకుపట్టు
బయటకు పంపిన మహిళా మార్షల్స్
న్యూఢిల్లీ: ప్రధాన న్యాయమూర్తి కొలువుదీరిన సుప్రీంకోర్టులో బుధవారం ఒక మహిళా న్యాయవాది తీవ్ర రసాభాస సృష్టించడంతో, ఆమెను కోర్టు మార్షల్స్ బయటకు తీసుకెళ్లాల్సి వచి్చంది. ధర్మాసనం వారిస్తున్నా.. ఆ న్యాయవాది పదేపదే జాబితాలో లేని ఒక కేసును ప్రస్తావించి, విచారణకు అంతరాయం కలిగించారు.
జాబితాలో లేని అంశంపై పట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.కె.సింగ్‌లతో కూడిన ధర్మాసనం ముందు, ఆ మహిళా న్యాయవాది జాబితాలో లేని ఒక అంశాన్ని నోటిమాటగా ప్రస్తావించినప్పుడు ఈ సంఘటన జరిగింది. తొలుత ఆ మహిళా న్యాయవాది మాట్లాడుతూ, ముంబైలో ఉన్నప్పుడు తన స్నేహితురాలు ఢిల్లీలోని ఒక గెస్ట్ హౌస్‌లో హత్యకు గురయ్యారని చెప్పారు. మొదట్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించిన పోలీసు అధికారిని, ఇప్పుడు అదే కేసులో దర్యాప్తు అధికారిగా నియమించారని ఆరోపించారు.
డిప్రెషన్‌లో ఉన్నాను.. వినాల్సిందే
నిరీ్ణత విధానంలో పిటిషన్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి ఆమెకు సూచించగా, ఆమె ‘నేను డిప్రెషన్‌లో ఉన్నాను, కచి్చతంగా దాఖలు చేస్తాను’.. అన్నారు. కానీ అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించారు. కేసు దాఖలుకు ఆమెకు సహాయం చేయాలని అక్కడే ఉన్న ఒక న్యాయవాదికి ధర్మాసనం సూచించి తదుపరి కేసును పిలిచింది. అయినప్పటికీ, ఆ మహిళా న్యాయవాది తన వాదనతో పట్టుబట్టారు.
నన్ను తాకొద్దు..
కోర్టులో ఆమె బిగ్గరగా అరుస్తుండటంతో పరిస్థితి చేయిదాటింది. దీంతో మహిళా కోర్టు మార్షల్స్ ఆమెను బయటకు తీసుకెళ్లడానికి ప్రయతి్నంచగా, ‘గౌరవంగా ప్రవర్తించండి, నన్ను తాకవద్దు’.. అని ఆమె మరింత పెద్దగా అరుస్తూ ప్రతిఘటించారు. జస్టిస్ భూయాన్ సహా తోటి న్యాయవాది ఒకరు.. కోర్టు మర్యాదలు పాటించాలని సలహా ఇచ్చినా, ఆమె మొండిగా వ్యవహరించారు. తన భద్రతకు సంబంధించిన ఈ అంశాన్ని కోర్టుకు చెప్పాల్సిందేనని ఆమె పట్టుబట్టారు. ఆమె పెద్దగా అరుస్తుండటంతో.. కోర్టు కార్యకలాపాల ఆన్‌లైన్ ప్రత్యక్ష ప్రసారం ఆడియో వినిపించకుండా చర్యలు తీసుకున్నారు. కాసేపయ్యాక ఎట్టకేలకు ఆమెను కోర్టు గది నుండి బయటకు పంపించారు.


