ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దేశ రాజధానిలో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని నొక్కిచెప్పింది. గాలి నాణ్యత కారణంగా లక్షల సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతుంటే సుప్రీంకోర్టు చూస్తూ ఉండాలా అని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ని ప్రశ్నించింది.
ఢిల్లీలో గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. గాలి నాణ్యత ఎంత తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుతుంటే ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ను ప్రశ్నించింది. వాయు కాలుష్యంతో లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే సుప్రీం కోర్టు చూస్తూ ఉండాలా అని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. పంట వ్యర్థాల కాల్చివేత ఒక్కటే ఈ సమస్యకు కారణం కాదని అది కేవలం ఇందులో ఒక భాగమేనని తెలిపింది.
జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ "సుప్రీంకోర్టు ఈ సమస్యపై చూస్తూ ఉండలేదు. "పంటవ్యర్థాల కాల్చివేత ఈ సమస్యకు కారణమైతే కోవిడ్-19 సమయంలో మనం ఆకాశంలోని నక్షత్రాలను చూడగలిగేవారిమా? ఈ సమస్యను రాజకీయంగా చూడకూడదు. ఢిల్లీ వాతావరణ కాలుష్యం కేవలం పంట వ్యర్థాల వల్ల ఏర్పడింది కాదు. దీనిని నిర్మూలించడానికి మీరు తీసుకున్న చర్యలేంటో చూపండి". అని చీఫ్ జస్టిస్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ని ప్రశ్నించారు.
ఈ సమస్యను పరిష్కరించే అంశం కోర్టుల పరిధిలోనిది కాదని నిపుణులతో కూడిన కమిటీ వాయు కాలుష్య సమస్యకు పరిష్కారం కనుగొనాలని తెలిపారు. కోర్టులు ఈ సమస్యలను రూపుమాపవు కాని దానికి కావాల్సిన వేదికను ఏర్పాటు చేయగలవు. అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. గాలి కాలుష్యాన్ని పరిష్కరించడానికి స్పష్టమైన సమయాన్ని నిర్దేశించుకొని తగిన ప్రణాళిక రూపొందించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది.


