సోషల్ మీడియా వచ్చిన తరువాత మనుషుల్లోని అపరిచితుడు అనేక రూపాల్లో బయటపడుతున్నాడు. ప్రతీ వాడూ జడ్జి‘మెంటల్’ అయిపోతాడు. పెచ్చుమీరుతున్న ఆన్‌లైన్ ట్రోల్స్ గురించి తలుచుకున్నపుడు ఇలాంటి ఆలోచనే వస్తుంది ఎవరికైనా. పెళ్లి చేసుకున్నా,విడాకులు తీసుకున్నా, తమ అభిప్రాయాల్ని ప్రకటించుకున్నా...వేధింపులే..నోటికొచ్చినట్టు కామెంట్స్ రాసేయడమే. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ప్రాధాన్యతలు, మనోభావాలు ఇవేవీ పట్టించుకోరు. వచ్చామా? కమెంట్ చేశామా..వికృతం అనందం పొందామా? అంతే.. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన జంట మాత్రం తమను అవమానించిన ట్రోలర్స్‌కు ఇచ్చిపడేశారు.
11 ఏళ్ల ప్రేమ తరువాత మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రేమ జంట రిషబ్, సోనాలి ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి సంబంధించినఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలపాల్సింది పోయి, ఆన్‌లైన్‌లో పిచ్చి పిచ్చి కామెంట్లతో వారిని ఆనందాన్ని, ఉత్సాహాన్ని దూరం చేశారు.
రిషబ్ షేర్వానీలో ప్రకాశవంతమైన గులాబీ రంగు శాలువా సఫాతో మెరిసిపోగా, మెజెంటా లెహంగాలో సోనాలీ చాలా అందంగా కనిపించారు. అయితే వరుడు నల్లగా ఉన్నాడంటూ నోరు పారేసుకున్నాడు.
"బ్యాంక్ బ్యాలెన్స్ ముఖ్యం," అని ఒకరు, డబ్బు కోసమే ఈ పెళ్లి అని మరొకరు వ్యాఖ్యానించారు. "దీదీ, ఇలా చేయడం అవసరమా అని ఒకరు, బహుశా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్టుందని మరో యూజర్ ఎగతాళి చేశారు. ఈ ట్రోలింగ్ తీవ్ర కావడంతో, పోస్ట్ 30 లక్షలకు పైగా వీక్షణలను దాటేసింది. అయితే ఈ ట్రోలింగ్‌ను కలర్-షేమింగ్‌ను వ్యతిరేకిస్తూ, వారి నిజమైన ప్రేమకు, అనురాగానికి మంచి మద్దతు కూడా లభించడం ఊరటనిచ్చే అంశం.
ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?
ట్రోలర్స్‌కు కొత్త జంట సమాధానం
మామధ్య ఉన్న దూరం ఇన్నాళ్లకు ముగిసింది. వాళ్లు ఏమన్నా మాకేమీ బాధలేదు. ఈ క్షణాన్నిమేము అస్వాదిస్తున్నామని సోనాలి ట్రోలర్స్‌ను తిప్పి కొట్టింది. రిషబ్ కూడా అదే విధంగా స్పందించారు. సోనాలిని పెళ్లాడే క్షణాలకోసం 2014 నుంచి ఎదురు చూస్తున్నానని, ఆమెను పెళ్లికూతురుగా చూసినప్పుడు కన్నీళ్లను ఆపుకోవడం తన తరం కాలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఉద్యోగం పుకార్లను ప్రస్తావిస్తూ, "మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి. నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు కానీ నేను నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. ఇపుడు నాకు మంచి ఆదాయమే ఉంది. కానీ నాకు ఏమీ లేనప్పుడే ఆమె నన్ను ప్రేమించింది, నా కాలేజీ రోజుల నుంచే నా శరీర రంగు, ఆకారం కంటే. ఆమె నన్ను నన్నుగానే ఇష్టపడింది. నాకు వెన్ను దన్నుగా నిలిచింది...వాళ్ల కమెంట్స్ అస్సలు పట్టించుకోను అని అన్నారు. అలాగే రిషబ్ తన చర్మం రంగు కారణంగా జీవితాంతం వివక్షను ఎదుర్కొన్నా అంటూ ఆవేదను వ్యక్తం చేశారు. బాహ్య సౌందర్యంతో సంబంధం లేకుండా.. నమ్మకమే పునాదిగా నిలబడిన ప్రేమను పరస్పర విశ్వాసం, అనురాగాలతో రిషబ్-సోనాలి కొత్త ప్రయాణం దిగ్విజయంగా సాగిపోవాలని మనమూ మనస్ఫూర్తిగా కోరుకుందాం.


