ఫ్యాన్సీ నంబర్ల పిచ్చి తెలియంది కాదు.. మనం కొనుగోలు చేసిన వాహనం ధరను కూడా మించిపోయి మరీ ఫ్యాన్సీ నంబర్లు వేలంలో మెరుస్తూ ఉంటాయి. ఒక ఫ్యాన్సీ నెంబర్ కోసం వేలు, లక్షలు దాటి కోట్లు పెట్టారంటే ఆ నంబర్లకున్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. ఇదే జరిగింది హర్యానా రాష్ట్రంలో. అయితే ఇది జరిగి వారం రోజులు అవుతుంది. కానీ నంబర్‌ను వేలంలో పెట్టి కొనుగోలు చేసిన వ్యక్తి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో ఆ నంబర్ మళ్లీ ఆక్షన్‌కు వచ్చింది. ఇంతకీ ఆ నంబర్ ఏంటి.. ఆ కధేంటి అనేది తెలుసుకుందాం
భారత్‌లోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్,..
HR88B8888- ఇదీ నెంబర్. ఇది కచ్చితంగా ఫ్యాన్సీ నంబరే. హెచ్‌ఆర్ 88 దగ్గర్నుంచీ ఆపై వచ్చే నంబర్ కూడా మొత్తం 8888గా ఉంది. దీని కోసం సుధీర్ కుమార్ అనే వ్యక్తి పోటీ పడ్డాడు. ఆ నంబర్ వేలంలో రూ ఒక కోటి 17 లక్షలకు పాడి దక్కించుకున్నాడు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ నంబర్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని సుధీర్ చెల్లించలేకపోయాడు.
ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీస్ రోములస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా ఉన్న సుధీర్.. రెండు రోజుల బిడ్డింగ్ తర్వాత ఆ నంబర్‌ను భారీ ధరకు పాడేశాడు. ఇది భారత్‌లోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా రికార్డు కూడా సృష్టించింది. కానీ ఆ మొత్తాన్ని చెల్లించే క్రమంలో తాను సాంకేతిక సమస్య తలెత్తిందని, శని, ఆదివారాల్లో రెండుసార్లు చేసిన యత్నం విఫలమైందన్నాడు. ఆ కారణం చేత ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయానన్నాడు. మరొకవైపు అంత పెద్ద మొత్తాన్ని నంబర్ ప్లేట్‌కు పెట్టడంపై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేశారన్నాడు. సోమవారం సాయంత్రానికి దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని సుధీర్ తెలిపాడు.
హర్యానా నంబర్ ప్లేట్ల వేలం ఇలా..
ఫ్యాన్సీ నంబర్లు, వీఐపీ నంబర్ల వేలాన్ని వారానికి ఒకసారి నిర్వహిస్తుంది హర్యానా ఆర్టీవో. ప్రతీ బుధవారం ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహిస్తారు. బుధవారం సాయంత్రం ఐదుగంటల వరకూ ఈ వేలాన్ని ఆన్‌లైన్ వేదికగా నిర్వహిస్తారు. fancy.parivahan.gov.in పోర్టల్ ద్వారా అధికారికంగా ఈ వేలాన్ని ఏర్పాటు చేస్తారు.
ఈ క్రమంలోనే HR88B8888 నంబర్‌కు అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయని ఆర్టీవో అధికారులు తెలిపారు. మొత్తం 45 దరఖాస్తుల ఈ నంబర్ కోసం వచ్చాయన్నారు. అయితే ఒకసారి వేలంలో పాడి ఆ నంబర్‌కు నిర్ణీత సమయంలో నగదు సమర్పించకపోతే ప్రతీ నిమిషానికి రూ. 50 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందట. ఈ క్రమంలో సుధీర్‌కు ఇచ్చిన సమయం దాదాపు అయిపోవడంతో ఆ నంబర్ తిరిగి వేలంలోకి వచ్చే అవకాశం ఉంది. నేటి( సోమవారం) సాయంత్రం ఐదు గంటల లోపు ఆ మొత్తాన్ని చెల్లిస్తేనే ఆ నంబర్‌ను సుధీర్ చేజిక్కించుకుంటారు. లేకపోతే మళ్లీ ఆ నంబర్ తిరిగి వేలంలోకి వచ్చే అవకాశం ఉంది.


