న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ సభలో 'డ్రామా'కు కాకుండా, 'డెలివరీ' (పని)కి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపక్షాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎదురుదాడి చేశారు.
పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోదీ తన ప్రసంగంలో.. ప్రతిపక్షాలు తమ పాత వ్యూహాలను మార్చుకోవాలని, చర్చలకు అవకాశం ఇవ్వాలని సూచించారు. ‘డ్రామా కాదు, డెలివరీ ఉండాలి.. నినాదాలు కాదు, విధానాలకు ప్రాధాన్యత నివ్వాలి’ అని అన్నారు. తొలిసారిగా ఎన్నికైన ఎంపీలకు మాట్లాడే అవకాశం రావడం లేదని, డ్రామా చేయడానికి పార్లమెంట్ సరైన వేదిక కాదని ఆయన ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక గాంధీ.. ఢిల్లీలో వాయు కాలుష్యం, ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (సర్) తదితర క్లిష్టమైన సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తడం నాటకం కాదని స్పష్టం చేశారు.
ఎన్నికల పరిస్థితులు, ఎస్‌ఐఆర్, కాలుష్యం మొదలైనవి చాలా పెద్ద సమస్యలని, వాటిపై చర్చిద్దామని ప్రియాంకా గాంధీ అన్నారు. పార్లమెంటు ఉన్నది దేనికి?.. నాటకాలకు కాదు. సమస్యలపై మాట్లాడటం, లేవనెత్తడం నాటకం కాదని ఆమె అన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చలకు అనుమతించడం లేదంటూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. కాగా ఈ శీతాకాల సమావేశాలు కేవలం 15 రోజులు మాత్రమే జరగడంపై ప్రతిపక్షాలు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం కావాలనే సమావేశాలను తగ్గించి, శాసనసభ చర్చలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాయి. ప్రభుత్వం 14 బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఎస్‌ఐఆర్ సమస్యలు, బీఎల్‌ఓ ఆత్మహత్యలు, ఢిల్లీ ఉగ్ర దాడి, జాతీయ భద్రతా అంశాలపై చర్చలకు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో రాజకీయ వేడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: షాకిస్తున్న కేరళ ‘హెచ్‌ఐవీ’.. నెలకు 100 కొత్త కేసులు


