తిరువనంతపురం: దేశంలోనే అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలు, అధిక నాణ్యత గల ఆసుపత్రులు, అగ్రశ్రేణి అక్షరాస్యత రేటుతో ఆరోగ్య రంగంలో అగ్రగామిగా నిలిచిన కేరళ ఇప్పుడు హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవీ)పెరుగుదలను చవిచూస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్‌ఐవీ నిర్మూలన లక్ష్యానికి చేరుకోవాలని చూస్తున్న తరుణంలో.. కేరళలో మాత్రం ప్రతి నెలా సగటున 100 కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది.
కేరళలో ముఖ్యంగా 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో హెచ్‌ఐవీ వ్యాప్తి కనిపిస్తోంది. ఇది కేరళలోని ఆరోగ్య నమూనాకు సవాలు విసురుతోంది. కేరళలో మొత్తం హెచ్‌ఐవీ కేసుల సంఖ్య జాతీయ సగటు (0.20%) కంటే తక్కువగా (0.07%) ఉన్నప్పటికీ, కొన్ని జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత మూడు ఏళ్లలో ఎర్నాకుళం జిల్లాలో అత్యధికంగా 850 కేసులు నమోదయ్యాయి. దీనికి ప్రధానంగా వలస కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉండటం, వారిలో మాదకద్రవ్యాల వాడకం వంటివి కారణాలుగా నిలుస్తున్నాయి.
కేరళలో ఎర్నాకుళం తర్వాత తిరువనంతపురం (555), త్రిస్సూర్ (518) జిల్లాల్లో అధిక కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులలో 3,393 మంది పురుషులు, 1,065 మంది మహిళలు, 19 మంది ట్రాన్స్‌జెండర్, 90 మంది గర్భిణులు ఉన్నారు. ఇది వ్యాధి అన్ని సమూహాలలో వ్యాపిస్తున్న విషయాన్ని తెలియజేస్తుంది. కేరళ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (కేఏసీఎస్) హెచ్‌ఐవీ కేసుల పెరుగుదలకు ముఖ్య కారణాలను తెలిపింది. ఇవి యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది.
అసురక్షిత సంభోగం
ఇది ఇన్ఫెక్షన్ వ్యాప్తికి గల ప్రధాన కారణాలలో ఒకటి. డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయాలు పెరిగి, నేపథ్యం తెలియని వ్యక్తులతో కండోమ్ వాడకుండా, సంభోగంలో పాల్గొనడం ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తుంది.
ఇంజెక్టబుల్ డ్రగ్స్ వాడకం
డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడానికి ఒకే సిరంజిలను వాడటం. ఇది మలప్పురం తదితర జిల్లాల్లో కూడా కేసుల పెరుగుదలకు దారితీసింది.
కలుషితమైన టాటూ సూదుల వాడకం
సరైన పరిశుభ్రత పాటించని టాటూ కేంద్రాలలో కలుషితమైన సూదుల ద్వారా కూడా హెచ్‌ఐవీ వ్యాప్తి చెందుతోంది.
వలస కార్మికులు
ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కార్మికులు, వారిలో కొంతమంది డ్రగ్స్ వాడకం వల్ల కూడా కేసులు పెరుగుతున్నాయి.
నివారణ- నియంత్రణ చర్యలు
ఈ పెరుగుతున్న కేసులను అరికట్టేందుకు సత్వర చర్యలు అవసరం. ఇందుకోసం కేఏసీఎస్ కొన్ని పరిష్కార మార్గాలను సూచించింది.
ముందస్తు పరీక్ష-చికిత్స
వైరస్ బారిన పడే అవకాశం ఉన్నవారికి త్వరగా పరీక్షలు నిర్వహించి, చికిత్స ప్రారంభించాలి.
గర్భిణులకు పరీక్షలు
తల్లి నుండి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా నిరోధించేందుకు గర్భం దాల్చిన మూడు నెలల్లోపు సిఫిలిస్, హెచ్‌ఐవీ పరీక్షలను తప్పనిసరి చేయాలి.
చికిత్స కొనసాగింపు
ఇన్ఫెక్షన్ గుర్తించిన తర్వాత యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ)ని క్రమం తప్పకుండా కొనసాగించాలి.
సురక్షిత పద్ధతులు
కండోమ్‌ల వాడకం, సురక్షితమైన లైంగిక పద్ధతులు, అధీకృత కేంద్రాల నుండి మాత్రమే రక్త మార్పిడి సేవలను తీసుకోవడంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి.
ఇది కూడా చదవండి: AIDS Day: హెచ్‌ఐవీ నయం అవుతుందా? తాజా పరిశోధనల్లో..


