‘హెచ్‌ఐవీ’ నేటికీ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది. దీని బారిన పడినవారు నిరంతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. నేడు డిసెంబర్ ఒకటి.. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ నివారణకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు ఏం వెల్లడించాయి? ఎటువంటి పరిష్కారాలను సూచిస్తున్నాయనే వివరాల్లోకి వెళితే..
ఆశాజనకమే.. కానీ..
హెచ్‌ఐవీ అంటువ్యాధిని నివారించడంలో సైన్స్ అద్భుతమైన పురోగతిని సాధించింది. ఇప్పుడు యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ)తో హెచ్‌ఐవీ బాధితులు సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఈ వైరస్‌ను శాశ్వతంగా తొలగించడమే ప్రధాన లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు క్లినికల్ పరీక్షలలో ఆశాజనకమైన ప్రారంభ ఫలితాలను సాధిస్తున్నప్పటికీ, హెచ్‌ఐవీ నిజంగా నయం అవుతుందా? అనేది ఇంకా పూర్తిగా సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలింది.
స్టెమ్ సెల్స్ సాయంతో..
ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగించగల హెచ్‌ఐవీ చికిత్స అందుబాటులో లేదని ROPAN హెల్త్‌కేర్ వ్యవస్థాపకురాలు, యూఎన్ సలహాదారు డాక్టర్ సబీన్ కపాసి తెలిపారు. అయితే బెర్లిన్, లండన్‌కు చెందిన పలువురు రోగులు స్టెమ్ సెల్ మార్పిడి తర్వాత దీర్ఘకాలిక ఉపశమనాన్ని (functional cure) పొందారు. ఈ వ్యక్తులు సీసీఆర్‌ఎస్ మ్యుటేషన్ కలిగిన దాతల నుండి స్టెమ్ సెల్స్‌ను స్వీకరించారు. ఇది వైరస్‌ను కణాలలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఈ కేసులు చికిత్స జీవశాస్త్రపరంగా సాధ్యమే అని నిరూపించినప్పటికీ, స్టెమ్ సెల్ మార్పిడిలో ప్రాణాంతక ప్రమాదాలు ఉన్నందున, ఇది కేవలం తీవ్రమైన క్యాన్సర్లకు చికిత్స చేయడానికి మాత్రమే పరిమితమై ఉంది. అందువల్ల దీనిని ప్రపంచవ్యాప్తంగా అమలు చేయడానికి ఆచరణీయమైన మార్గం కాదని వెల్లడయ్యింది.
సవాల్ విసురుతున్న వైరల్ రిజర్వాయర్లు
హెచ్‌ఐవీ చికిత్సకు సంబంధించి కొత్త పరిశోధనలు విస్తృత స్థాయిలో సురక్షితంగా ఉపయోగించగల విధానాలపై దృష్టి సారించాయి. పరిశోధకులు సీసీఆర్‌ఎస్ గ్రాహకాన్ని నిలిపివేయడానికి లేదా వైరస్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి సీఆర్‌ఐఎస్‌పీఆర్ వంటి జన్యు-ఎడిటింగ్ సాధనాలను పరీక్షించడం సహా వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ అధ్యయనాల నుండి లభ్యమైన ప్రారంభ క్లినికల్ డేటా ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, హెచ్‌ఐవీకి చెందిన దాగి ఉన్న వైరల్ రిజర్వాయర్లు (latent reservoirs) ఒక ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయాయి. ఈ రిజర్వాయర్లు వైరస్‌ను కణజాలాలలో దాచి ఉంచుతాయి. చికిత్సను నిలిపివేసిన తర్వాత వైరస్ తిరిగి పెరగడానికి కారణమవుతాయి.
ఇప్పటికింతే..
ఈ అడ్డంకిని అధిగమించడానికి పరిశోధకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. హెచ్‌ఐవీ నివారణ దశగా పురోగతి కనిపిస్తున్నప్పటికీ, ఔషధాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయనే హామీని ఎవరూ ఇవ్వడంలేదు. ప్రస్తుతానికి హెచ్‌ఐవీ వ్యాప్తిని నిరోధించడానికి అత్యంత శక్తివంతమైన విధానం యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ). దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే, అది వైరల్ లోడ్‌ను కనీస స్థాయికి తీసుకువస్తుంది. బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది. సంక్రమణ ముప్పును నివారిస్తుంది. అసురక్షిత లైంగిక సంపర్కం హెచ్‌ఐవీకి ప్రధాని కారణమని, దీనికి సురక్షిత విధానాలే పరిష్కార మార్గమని వైద్యులు చెబుతుంటారు.
ఇది కూడా చదవండి: మళ్లీ శశిథరూర్ లొల్లి.. ఈసారి అమ్మ కారణం?


