ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..? | Health Tips: Im Pregnant. How Can I Avoid Having My Baby Early | Sakshi
Sakshi News home page

ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

Nov 30 2025 4:34 PM | Updated on Nov 30 2025 4:41 PM

Health Tips: Im Pregnant. How Can I Avoid Having My Baby Early

నేను ప్రస్తుతం 30 వారాల గర్భిణిని. ఇది నా మొదటి బిడ్డ. నా గ్రోత్‌ స్కాన్‌ లో బిడ్డ పెరుగుదల కొంచెం తక్కువగా ఉందని. తరచుగా స్కాన్లు చేయించుకోవాలని, మెరుగుదల లేకపోతే ముందుగానే డెలివరీ చేయాల్సి రావచ్చని చెప్పారు. నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. బిడ్డ పెరుగుదల మెరుగుపడటానికి, ముందుగానే డెలివరీ జరగకుండా ఉండటానికి నేను ఏమి చేయాలి?
– సుశీల, రాజమండ్రి. 

మీ ఆందోళన అర్థమవుతోంది. చాలామంది గర్భిణులకీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గర్భధారణలో బిడ్డ ఎదుగుదల గర్భకాలానికి తగినంతగా లేకపోతే దానిని ‘ఫీటల్‌ గ్రోత్‌ రిస్ట్రిక్షన్‌ ’ లేదా ‘ఇంట్రా యూటరైన్‌  గ్రోత్‌ రిస్ట్రిక్షన్‌ ’ అంటారు. ఇది సుమారు పది శాతం గర్భధారణల్లో కనిపించే పరిస్థితి. అంటే ఇది అరుదు కాదు, కానీ జాగ్రత్తగా పర్యవేక్షించాల్సినది. ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు ఉంటాయి. గర్భిణి మహిళకు అధిక రక్తపోటు ఉండటం, మధుమేహం, అధిక బరువు, వయస్సు ముప్పై ఐదు ఏళ్లు దాటడం, జంట గర్భం లేదా మల్టిపుల్‌ గర్భధారణ, గతంలో చనిపోయిన బిడ్డ పుట్టిన చరిత్ర, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఆటో ఇమ్యూన్‌ సమస్యలు. 

కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినా సహజంగానే బిడ్డ ఎదుగుదల కొంచెం మందగించవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలామంది ఇలాంటి బిడ్డలు పుట్టిన తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి ముందుగా భయపడకుండా వైద్యుల సూచనలను జాగ్రత్తగా పాటించాలి. ముందుగా మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. 

డాక్టర్‌ సూచించినంత వరకే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యం అలవాట్లు ఉంటే వెంటనే వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి బిడ్డకు ఆక్సిజన్‌ సరఫరా తగ్గించి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నియమితంగా వైద్య పర్యవేక్షణలో ఉండటం చాలా ముఖ్యం. బిడ్డ ఎదుగుదలలో తేడా ఉన్నప్పుడు, డాక్టర్‌ తరచుగా గ్రోత్‌ స్కాన్‌లు సూచిస్తారు. ఈ స్కాన్‌లలో బిడ్డ బరువు, రక్తప్రవాహం, యామ్నియోటిక్‌ ద్రవం పరిమాణం వంటి అంశాలు చూస్తారు. 

డాప్లర్‌ పరీక్షల ద్వారా బిడ్డకు తల్లి నుంచి రక్తప్రవాహం ఎలా జరుగుతోందో అంచనా వేస్తారు. ఈ వివరాల ఆధారంగా డాక్టర్‌ తదుపరి చర్యలను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లి రక్తంలో చక్కెర స్థాయులు లేదా రక్తపోటు నియంత్రణలో లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ విలువలను ఎప్పటికప్పుడు చెక్‌ చేయించుకోవాలి. ప్రోటీన్‌  లోపం ఉంటే ఆహారంతో దాన్ని పూడ్చుకోవాలి. చాలామంది తరచుగా స్కాన్‌ చేయించుకోవడమే బిడ్డకు హానికరమని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. 

అల్ట్రాసౌండ్‌ పరీక్ష గర్భంలోని బిడ్డను అంచనా వేయడానికి అత్యంత సురక్షితమైన విధానం. బిడ్డ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతే లేదా స్కాన్‌లో రక్తప్రవాహం తగ్గిపోతే, బిడ్డలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే, అప్పుడే ముందుగా డెలివరీ చేయడం అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిడ్డ ఊపిరితిత్తులు పక్కాగా పనిచేయేందుకు ముందుగానే స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. డెలివరీ విధానం సాధారణమా లేదా సిజేరియన్‌  చేయాలా అనేది బిడ్డ ఆరోగ్యం, తల్లి పరిస్థితి, గర్భధారణ వయస్సు లాంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. 

ఇప్పుడున్న ఆధునిక పరీక్షలు, ముఖ్యంగా స్కాన్‌లు, బిడ్డ ఎదుగుదల మందగించే ప్రమాదం ఉన్న మహిళలను ముందుగానే గుర్తించడానికి సహాయ పడుతున్నాయి. కొన్ని బయోకెమికల్‌ పరీక్షలతో పాటు, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్‌ మందు ఇవ్వడం ద్వారా ఫీటల్‌ గ్రోత్‌ రెస్ట్రిక్షన్‌  తగ్గించవచ్చు. అందుకే, మీరు మీ వైద్యుడి దగ్గర క్రమం తప్పకుండా ఫాలోఅప్‌ చేయించుకోవాలి. భయపడకండి. జాగ్రత్తగా వైద్యుల సూచనలను పాటిస్తే, మీ బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా పుడతారు. 
డాక్టర్‌ కడియాల రమ్య, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌హైదరాబాద్‌ 

(చదవండి: ‘ఎగ్‌’సలెంట్‌ లుక్‌, గోళ్ల ఆరోగ్యం కోసం!)
 

Advertisement
 
Advertisement
Advertisement