breaking news
Woman Health counseling
-
ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
నేను ప్రస్తుతం 30 వారాల గర్భిణిని. ఇది నా మొదటి బిడ్డ. నా గ్రోత్ స్కాన్ లో బిడ్డ పెరుగుదల కొంచెం తక్కువగా ఉందని. తరచుగా స్కాన్లు చేయించుకోవాలని, మెరుగుదల లేకపోతే ముందుగానే డెలివరీ చేయాల్సి రావచ్చని చెప్పారు. నేను చాలా ఆందోళనగా ఉన్నాను. ఇది ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. బిడ్డ పెరుగుదల మెరుగుపడటానికి, ముందుగానే డెలివరీ జరగకుండా ఉండటానికి నేను ఏమి చేయాలి?– సుశీల, రాజమండ్రి. మీ ఆందోళన అర్థమవుతోంది. చాలామంది గర్భిణులకీ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. గర్భధారణలో బిడ్డ ఎదుగుదల గర్భకాలానికి తగినంతగా లేకపోతే దానిని ‘ఫీటల్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ లేదా ‘ఇంట్రా యూటరైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ ’ అంటారు. ఇది సుమారు పది శాతం గర్భధారణల్లో కనిపించే పరిస్థితి. అంటే ఇది అరుదు కాదు, కానీ జాగ్రత్తగా పర్యవేక్షించాల్సినది. ఈ పరిస్థితి రావడానికి పలు కారణాలు ఉంటాయి. గర్భిణి మహిళకు అధిక రక్తపోటు ఉండటం, మధుమేహం, అధిక బరువు, వయస్సు ముప్పై ఐదు ఏళ్లు దాటడం, జంట గర్భం లేదా మల్టిపుల్ గర్భధారణ, గతంలో చనిపోయిన బిడ్డ పుట్టిన చరిత్ర, రక్తహీనత, గుండె సంబంధిత వ్యాధులు లేదా ఆటో ఇమ్యూన్ సమస్యలు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకపోయినా సహజంగానే బిడ్డ ఎదుగుదల కొంచెం మందగించవచ్చు. అయితే మంచి విషయం ఏమిటంటే, చాలామంది ఇలాంటి బిడ్డలు పుట్టిన తరువాత పూర్తిగా ఆరోగ్యంగా ఎదుగుతారు. కాబట్టి ముందుగా భయపడకుండా వైద్యుల సూచనలను జాగ్రత్తగా పాటించాలి. ముందుగా మీరు చేయాల్సింది ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం.ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. డాక్టర్ సూచించినంత వరకే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ధూమపానం, మద్యం అలవాట్లు ఉంటే వెంటనే వాటిని పూర్తిగా మానేయాలి. ఇవి బిడ్డకు ఆక్సిజన్ సరఫరా తగ్గించి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నియమితంగా వైద్య పర్యవేక్షణలో ఉండటం చాలా ముఖ్యం. బిడ్డ ఎదుగుదలలో తేడా ఉన్నప్పుడు, డాక్టర్ తరచుగా గ్రోత్ స్కాన్లు సూచిస్తారు. ఈ స్కాన్లలో బిడ్డ బరువు, రక్తప్రవాహం, యామ్నియోటిక్ ద్రవం పరిమాణం వంటి అంశాలు చూస్తారు. డాప్లర్ పరీక్షల ద్వారా బిడ్డకు తల్లి నుంచి రక్తప్రవాహం ఎలా జరుగుతోందో అంచనా వేస్తారు. ఈ వివరాల ఆధారంగా డాక్టర్ తదుపరి చర్యలను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో తల్లి రక్తంలో చక్కెర స్థాయులు లేదా రక్తపోటు నియంత్రణలో లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ విలువలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. ప్రోటీన్ లోపం ఉంటే ఆహారంతో దాన్ని పూడ్చుకోవాలి. చాలామంది తరచుగా స్కాన్ చేయించుకోవడమే బిడ్డకు హానికరమని అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. అల్ట్రాసౌండ్ పరీక్ష గర్భంలోని బిడ్డను అంచనా వేయడానికి అత్యంత సురక్షితమైన విధానం. బిడ్డ ఎదుగుదల పూర్తిగా ఆగిపోతే లేదా స్కాన్‌లో రక్తప్రవాహం తగ్గిపోతే, బిడ్డలో ఒత్తిడి లక్షణాలు కనిపిస్తే, అప్పుడే ముందుగా డెలివరీ చేయడం అవసరం అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిడ్డ ఊపిరితిత్తులు పక్కాగా పనిచేయేందుకు ముందుగానే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. డెలివరీ విధానం సాధారణమా లేదా సిజేరియన్ చేయాలా అనేది బిడ్డ ఆరోగ్యం, తల్లి పరిస్థితి, గర్భధారణ వయస్సు లాంటి అంశాలపై ఆధారపడి నిర్ణయిస్తారు. ఇప్పుడున్న ఆధునిక పరీక్షలు, ముఖ్యంగా స్కాన్లు, బిడ్డ ఎదుగుదల మందగించే ప్రమాదం ఉన్న మహిళలను ముందుగానే గుర్తించడానికి సహాయ పడుతున్నాయి. కొన్ని బయోకెమికల్ పరీక్షలతో పాటు, ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికి తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మందు ఇవ్వడం ద్వారా ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ తగ్గించవచ్చు. అందుకే, మీరు మీ వైద్యుడి దగ్గర క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయించుకోవాలి. భయపడకండి. జాగ్రత్తగా వైద్యుల సూచనలను పాటిస్తే, మీ బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా పుడతారు. డాక్టర్ కడియాల రమ్య, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ (చదవండి: ‘ఎగ్’సలెంట్ లుక్, గోళ్ల ఆరోగ్యం కోసం!) -
HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
సాధారణ రొమ్ము కేన్సర్ గురించి అందరికీ తెలిసింది. కానీ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ గురించి చాలామంది మహిళలకి తెలియదు. ఇది సాధారణ రొమ్ము కేన్సర్ కంటే ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ చాలా దూకుడుగా ఉంటుంది, పైగా శరీరంలోని ఇతర భాగాలకు చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇటీవల కాలంలో ఈ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన తోపాటు ఎలాంటి చర్యలతో ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు వంటి వాటి గురించి హైదరాబాద్‌కి చెందిన ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వింధ్య వాసిని మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.1 ప్రశ్న: హైదరాబాద్‌లో HER2-పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా? ఎందుకు?డాక్టర్: దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు మనం HER2-పాజిటివ్ నిర్ధారణలను ఎక్కువగా ఉన్నాయనే చెప్పారు. బహుశా దీనిపై అవగాహన పెరగడం, ఎక్కువమంది మహిళలు ముదుగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వంటివి అయ్యిండొచ్చని అన్నారు. అలాగే జీవనశైలి మార్పులు కూడా ఈ కేసులు అధికమవ్వడానికి కారణం కావొచ్చని ఆమె అన్నారు. 2 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ ఇతర వాటికంటే ఎలా భిన్నంగా ఉంటుంది?డాక్టర్: HER2-పాజిటివ్ రొమ్ము కేన్స ర్అనేది కణాల ఉపరితలంపై కణ పెరుగుదల, విభజనను ప్రోత్సహించే గ్రాహకమైన HER2 (హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 కి సంక్షిప్తంగా) ప్రోటీన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుందని అన్నారు. అందువల్ల ఈ కేన్సర్ ఇతర రకాల కేన్సర్ల కంటే మరింత దూకుడు స్వభావం కలది. అయితే దీన్ని HER2ను లక్ష్యంగా చేసుకుని మందులతో రోగులకు చికిత్స అందించవచ్చు. గత రెండు దశాబ్దాలుగా ఈ చికిత్సలు HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ దృక్పథాన్నే మార్చేశాయి. ఒకప్పడు ఈ కేన్సర్ అధిక ప్రమాదకరమైనదిగా పరిగణించేవారని, ఇప్పుడూ మందులతో నిర్వహించేలా చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.3 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌పై హైదరాబాద్‌లో ఏవైనా శాస్త్రీయ ఆవిష్కరణలు జరుగుతున్నాయా?డాక్టర్: అవును. హైదరాబాద్‌లోని అనేక ఆసుపత్రులు ఇప్పుడు కొత్త చికిత్సా పద్ధతులను అందిస్తున్నాయి.ఉదాహరణకు సబ్కటానియస్ ఫార్ములేషన్స్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీలు. ఇవి మందులతో వేగవంతంగా తగ్గించడమే కాకుండా రోగికి సౌకర్యవంతంగా కూడా ఉంటున్నాయి.4 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌కు ఏయే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?డాక్టర్: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌కు అనేక చికిత్సా ఎంపికలు ఉన్నాయి - కేన్సర్ర్ ఎంత అభివృద్ధి చెందింది, అది వ్యాపించిందా, ఎంత వేగంగా పెరుగుతోంది వంటి వాటికి సంబంధించిన మొత్తం రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అదృష్టం ఏంటంటే..HER2 ప్రమేయం ఉందని మనకు తెలుసు కాబట్టి, సాధారణమైన వాటికి అదనంగా ప్రభావవంతమైన "టార్గెటెడ్" చికిత్సలు ఉన్నాయి. అవేంటంటే..a. టార్గెటెడ్ థెరపీలు: ఈ మందులు ప్రత్యేకంగా కేన్సర్ కణాల పెరుగుదలను ఆపడానికి HER2 ప్రోటీన్‌ను నిరోధిస్తాయి.b. కీమోథెరపీ: ప్రభావాన్ని పెంచడానికి తరచుగా టార్గెటెడ్ థెరపీలతో కలిపి ఉపయోగిస్తారు.c. శస్త్రచికిత్స: కేసును బట్టి కణితి లేదా రొమ్ము కణజాలాన్ని తొలగించడం.d. రేడియేషన్ థెరపీ: పునరావృత ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక సందర్భాల్లో శస్త్రచికిత్స తర్వాత ఉపయోగిస్తారు.e. హార్మోన్ల చికిత్స: కణితి కూడా హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్ అయితే సిఫార్సు చేయవచ్చు.ఇప్పుడు లక్ష్యంగా చేసుకున్న చికిత్సలు చర్మం కింద ఇంజెక్ట్ చేసేలా సబ్కటానియస్ ఫార్ములేషన్లుగా అందుబాటులో ఉన్నాయి. అలాగే దీర్ఘ IV ఇన్ఫ్యూషన్లతో (సుమారు 4-6 గంటలు) పోలిస్తే వేగంగా (సుమారు 8 నిమిషాలు) చికిత్సను పూర్తి చేయొచ్చు. రోగి సౌకర్యంగా ఉండేలా చికిత్సా కేంద్రాల్లో గడిపే సమయం కూడా తగ్గేలా పలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 5 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ జర్నీలో రోగులు, సంరక్షకులు తప్పక తెలుసుకోవాల్సినవి ఏవి?డాక్టర్: a. HER2 స్థితిని నిర్ణయించడానికి తగిన చికిత్సను ప్లాన్ చేయడానికి ముందుగా సరైన సమయంలో రోగ నిర్ధారణ చేయడం అనేది ముఖ్యంb. చికిత్సకు కట్టుబడి ఉండటం కీలకం. మోతాదులను కోల్పోవడం లేదా చికిత్సను మధ్యలో ఆపడం వల్ల ప్రభావం తగ్గుతుంది.c. రోగులు,వారి సంరక్షకులకు భావోద్వేగ మద్దతు చాలా ముఖ్యమైనది. ఇది ఒకరకంగా మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడం, స్థితిస్థాపకతను పెంపొందించడంలో సహాయపడుతుంది.d. సంరక్షణ బృందంతో సకాలంలో కమ్యూనికేషన్ ద్వారా దుష్ప్రభావాలను నిర్వహించడం జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది.e. భారతదేశంలో ప్రస్తుతం రోగి సౌకర్యార్థం మెరుగైనా సబ్కటానియస్ థెరపీలు అనే కొత్త చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఇవి రోగి చికిత్సా సమయాన్ని తగ్గించడమే కాకుండా ఆస్పత్రి సందర్శన కూడా తగ్గుతుంది. చివరగా రోగి సంరక్షకులు ఇలాంటి చికిత్సా విధానాలు, మంచి ప్రత్యామ్నాయాల గురించి వైద్యులతో సంభాషించి, సవివరంగా తెలుసుకోవాలి, సత్వరమే కోలుకునే చికిత్సా విధానాల గురించి క్షణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారామె.ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వింధ్య వాసిని -
ప్రపంచ ఆరోగ్య వేదికపై ప్రసంగించిన తొలినటి...! ఏం మాట్లాడారంటే..
చలం, అంబేద్కర్ల నుంచి నటి, ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) జెండర్ ఈక్వాలిటీకి ఈ దేశపు రాయబారి కృతిసనన్ దాకా అందరి మాటా ఒకటే స్త్రీ ఆరోగ్యమే దేశ భవిష్యత్ భాగ్యం అని!నిజానికి మహిళా ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేక సందర్భం అక్కర్లేదు.. అయినా ఈ ప్రస్తావనకు ప్రత్యేక సందర్భమూ ఉంది. అదే బెర్లిన్ (జర్మనీ)లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025. ఇందులో ఆమె మహిళల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఇలా వరల్డ్ హెల్త్ సమ్మిట్‌లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కీర్తి గడించారు. ఆ ప్రసంగంలో కీర్తి సనన్ ఏం మాట్లాడారంటే.. ‘మహిళల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయాల్సిన లేదా పక్కన పెట్టాల్సిన విషయం కాదు. తక్షణమే దృష్టిపెట్టాల్సిన అత్యంత అవసరమైన అంశం. ఆమె ఆరోగ్యం.. మానవాళి ప్రగతికి, భవిష్యత్‌కు మూలస్తంభం. అందుకే మహిళా ఆరోగ్యానికి సంబంధించి సుస్థిరమైన పెట్టుబడులు కావాలి. ఆవిష్కరణలు జరగాలి. ఇందుకోసం చేసే ప్రతి ప్రయత్నం అద్భుతమైన ఆర్థిక, సామాజిక మార్పులుగా ప్రతిఫలిస్తుంది. ఏటా ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పదమూడు వందల కోట్ల రాబడి కనిపిస్తోంది. అంటే దాదాపు తొమ్మిది రెట్ల లాభం. ఈ ఇన్వెస్ట్మెంట్ నైతికావసరమే కాదు మన మూకుమ్మడి భవిష్యత్‌కు భరోసా కూడా! ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం.. ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థికసుస్థిరతకు చిహ్నం. కానీ ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళల ఆరోగ్యం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. యూఎన్ఎఫ్పీఏ జెండర్ ఈక్వాలిటీ అంబాసిడర్‌గా చాలా ప్రాంతాలు తిరిగాను. అవన్నీ కూడా బాల్యవివాహాలకు సాక్ష్యంగా కనపడ్డాయి. అమ్మాయిలకు మానసిక ఆరోగ్యం సంగతి అటుంచి కనీసం శారీరక ఆరోగ్య కేంద్రాలు కూడా అందుబాటులో లేని దుస్థితిలో ఉన్నాయి. వీళ్ల జీవితాలు మారాలంటే మహిళల ఆరోగ్యానికి సంబంధించి దృష్టి పెరగాలి. తక్షణమే ఆ దిశగా కార్యాచరణ నిర్ణయాలు జరగాలి’ అన్నారు కృతిసనన్. (చదవండి: 'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్‌ని తలపించేలా..) -
హెల్త్: మహిళల్లో.. ఈ 'డీప్ వీన్ థ్రాంబోసిస్' సమస్యను గురించి విన్నారా!?
కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద పెట్టినంత శ్రద్ధ తమ విషయానికి వచ్చేసరికి మహిళలు గాలికి వదిలేస్తారు. కుటుంబ సభ్యులు కూడా అంతగా పట్టించుకోరు. దాంతో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి, అది తీవ్రరూపం దాల్చేవరకు ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. అలాంటి సమస్యల్లో ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ ఒకటి. ఇది స్త్రీ, పురుషులిద్దరికీ వచ్చే సమస్య అయినప్పటికీ... మహిళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ. గర్భధారణ నుంచి హార్మోన్ల సంక్లిష్టతల వరకు అనేక అంశాలు డీప్ వీన్ థ్రాంబోసిస్కు దారితీస్తాయి. రక్తనాళాల్లో.. ప్రధానంగా చెడు రక్తాన్ని తీసుకెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని ‘డీప్ వీన్ థ్రాంబోసిస్’ (డీవీటీ)గా చెబుతారు. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం. డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాలి సిరల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇంచుమించు ప్రతి 20 మందిలో ఒకరికి... వారి జీవితకాలంలో డీప్ వీన్ థ్రాంబోసిస్ బాధపెడుతుంది. మహిళల్లోనే ప్రభావం చూపడానికి కారణాలు.. ప్రెగ్నెన్సీ: స్త్రీలలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించడానికి గల కారణాలలో గర్భధారణ ఒకటి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం తర్వాత ఆరు వారాల వరకు ఈ ముప్పు ఉంటుంది. గర్భధారణ తర్వాత రక్తనాళాల్లో రక్తప్రవాహం కాస్త నెమ్మదించడం మామూలే. దాంతో రక్తం గడ్డ కట్టే అవకాశాలు పెరగడం. గర్భసంచి బాగా సాగడం: దీంతో రక్తనాళాలపై ఒత్తిడి పడి రక్తం సాఫీగా ప్రవహించడానికి ఆటంకం కలుగుతుంది. నోటి ద్వారా తీసుకునే గర్భనిరోధక మాత్రలు: వీటిల్లోని హార్మోన్లతో డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దాదాపు ప్రతి గర్భనిరోధక మాత్రలో ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిన్ ఉండటంతో అవి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టేలా చేసే అవకాశాలు పెరుగుతాయి. పైగా ఈస్ట్రోజెన్... కాలేయాన్ని ప్రేరేపించి... రక్తంలో ఉండే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ రక్తం గడ్డకట్టేలా చేసే ఫైబ్రినోజెన్ను ఎక్కువగా స్రవింపజేస్తుంది. దీనికితోడు గర్భనిరోధక మాత్రల్లో వాడే కొన్ని రకాల కాంబినేషన్స్ పిల్స్ వల్ల ఈ ముప్పు మరింత పెరుగుతుంది. అందువల్ల గర్భనిరోధక మాత్రలు వాడేవారు డాక్టర్ సలహా మేరకే వాడాలి. హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ: మెనో΄ాజ్ తర్వాత తీసుకునే హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీలోని మందుల్లో ఈస్ట్రోజెన్,ప్రోజెస్టిన్ కాంబినేషన్ ఉంటుంది. ఈ ఈస్ట్రోజెన్ పైన పేర్కొన్న ప్రభావాన్నే చూపడంతో డీప్ వీన్ థ్రాంబోసిస్ ముప్పు పెరుగుతుంది. అందువల్ల ఈస్ట్రోజెన్ మందుల్ని చర్మానికి అంటించే ΄్యాచ్ల రూపంలో ఇస్తే ఈ ముప్పు తగ్గుతుంది. జీవనశైలి అంశాలు: శారీరక శ్రమ లేకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చుని ఉండటం, స్థూలకాయం, ΄÷గతాగడం వంటివి రక్తప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. స్మోకింగ్ ద్వారా దేహంలోకి చేరే నికోటిన్ రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తుంది. వేర్వేరుగా లక్షణాల తీవ్రత.. డీప్ వీన్ థ్రాంబోసిస్లో రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆ లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించక΄ోవచ్చు. దానికితోడు లక్షణాల తీవ్రతలో కూడా మార్పులుండవచ్చు. కొందరిలో రక్తపుగడ్డ చిన్నదిగా ఉంటే కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించక΄ోవచ్చు. సమస్య దానంతట అదే సమసి΄ోవచ్చు కూడా. కొన్ని సాధారణ లక్షణాలు.. రక్తం గడ్డ కట్టినచోట చర్మం వాపు (ముఖ్యంగా కాలు, ΄ాదం వంటివి) చర్మం ఎర్రబారడం, అక్కడ వేడిగా ఉన్నట్లు అనిపించడం ఒక్కోసారి చర్మంలోంచి రక్తనాళాలు కనిపించడం కాలిలో డీవీటీ ఏర్పడినప్పుడు కాలు బలహీనంగా ఉన్నట్లు అనిపించడం రక్తనాళాలు గట్టి పడడం ఈ లక్షణాలు అకస్మాత్తుగా కనిపించినా లేదా కాలం గడుస్తున్న కొద్దీ తీవ్రత పెరుగుతూ పోతున్నా వెంటనే డాక్టర్‌కు చూపించాలి. కొన్నిసార్లు రక్తనాళంలో ఏర్పడ్డ ఈ గడ్డ (క్లాట్) రక్తప్రవాహంలో కొట్టుకుపోతూ, గుండె రక్తనాళల్లోకి చేరి, గుండెస్పందనలను ఆపివేసే ‘పల్మునరీ ఎంబాలిజమ్’ అనే కండిషన్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. చికిత్స.. డీవీటీ వచ్చే అవకాశాలున్నవారు సపోర్ట్ స్టాకింగ్స్ / కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం. రక్తాన్ని పలచబార్చే మందులైన యాంటీ కోయాగ్యులెంట్స్ వాడటం.. క్లాట్ బస్టర్స్ / థ్రాంబోలైటిక్స్ చికిత్స : చిన్న పైప్ (క్యాథెటర్) ద్వారా రక్తం గడ్డకట్టిన చోటికి థ్రాంబోలైటిక్స్ అని పిలిచే మందును పంపి, రక్తపుగడ్డను చెదరగొట్టే ఔషధాల్ని వాడటం. నివారణ.. మంచి సమతులాహారం తీసుకోవడం అంటే పొట్టు తీయని కాయధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పండ్లు తీసుకుంటూ బరువు పెరగకుండా చూసుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా మహిళలు రోజుకు కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల రక్తప్రవాహం సాఫీగా మారి రక్తపు గడ్డలు ఏర్పడకుండా ఉంటుంది. తగినన్ని నీళ్లు, ద్రవాహారాలు తీసుకుంటూ ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండటం ఒకేచోట స్థిరంగా కూర్చుని ఉండకుండా కాసేపు నడక, స్ట్రెచ్చింగ్ వంటివి చేస్తూ ఉండటం దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు అదేపనిగా వాహనంలో కూర్చుని ఉండకుండా తరచూ బ్రేక్ తీసుకోవటం రక్తనాళాల్లో రక్తప్రవాహం సాఫీగా సాగేందుకు కంప్రెషన్ స్టాకింగ్ వంటివి వాడటం గర్భం దాల్చిన మహిళల కుటుంబ సభ్యుల్లో డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చిన ఆరోగ్య చరిత్ర ఉంటే ముందే డాక్టర్‌కు ఈ విషయాన్ని చెప్పడం మంచిది. — డాక్టర్ నరేంద్రనాథ్ మేడ, కన్సల్టెంట్ వాస్క్యులార్ – ఎండో వాస్క్యులార్ సర్జన్ ఇవి చదవండి: హెల్త్: 'గుండె' పెరగడమా..? అవును ఇదొక సమస్యే..! -
పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: ‘మనం కరెన్సీని కాదు.. కేలరీలను లెక్కించడం చాలా ముఖ్యం’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహిళా ఆరోగ్యంపై రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్త్రీలు, కౌమారదశలో ఉన్న బాలికల మానసిక, శారీరక శ్రేయస్సు ప్రధానమని పేర్కొన్నారు. బాల్యం నుంచే బాలికలకు యోగా, శారీరక వ్యాయామం, సంప్రదాయ ఆహార ప్రాధాన్యాన్ని తెలియజేయాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి ఆహారం ఇస్తున్నారో తెలుసుకోవాలంటే పిల్లల టిఫిన్ బాక్సులను తనిఖీ చేయాలని ఆమె సూచించారు. గతంలో తాను ఒకసారి అలా టిఫిన్ బాక్సులను పరిశీలించానని, చాలా బాక్సుల్లో బయటి నుంచి బర్గర్లు, చిప్స్, పఫ్స్, బిస్కెట్లు, స్నాక్స్ ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయానని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా మహిళల ఆరోగ్య అవసరాలపై ఇంకా స్పష్టత రాలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి మరిన్ని మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయు ష్మాన్ భారత్‌లో మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు వ్యాధుల కవరేజీని ఎక్కువగా పెంచారని ఆమె వెల్లడించారు. -
Health: డెలివరీ తర్వాత తన ప్రవర్తనలో చాలా మార్పు! కారణమేంటి?
Postnatal Stress Disorder: మా అక్క రీసెంట్గా డెలివరీ అయింది. నార్మల్ డెలివరీకి చాలా ట్రై చేశారు. హఠాత్తుగా బేబీ హార్ట్ బీట్ తగ్గడంతో వెంటనే ఆపరేషన్ చేశారు. డెలివరీ అయినప్పటి నుంచి తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. కంగారుగా ఉంటోంది. నిద్ర పోవడం లేదు. కోపమూ ఎక్కువైంది. అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తోంది. ఎవరితోనూ మాట్లాడ్డం లేదు. ప్రసవం తర్వాత సహజంగానే ఇలా ప్రవర్తిస్తారా? – రమణి మీరు చెప్పినదాన్ని బట్టి తనకి యాంగ్జైటీ ఉన్నట్టుంది. మామూలుగా డెలివరీ టైమ్‌లో చాలా మార్పులు ఉంటాయి. హార్మోన్స్ చేంజెస్ ఉంటాయి. డెలివరీ హఠాత్తుగా కాంప్లికేట్ అయినా, వాళ్లు ఊహించినట్లు కాకపోయినా, బర్త్ ట్రామాతో మానసికంగా డిస్టర్బ్ అవుతారు. దీనిని పీఎన్ఎస్డీ.. పోస్ట్‌నాటల్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. దీన్ని ఎమోషనల్ కేర్, సపోర్ట్‌తో సంభాళించాలి. చాలామందికి మందుల అవసరం ఉండదు. కొంతమంది తమ ప్రసవం తాలూకు విషయాలను పదే పదే గుర్తుతెచ్చుకుంటూ.. అదే పునరావృతమవుతున్నట్టు భావిస్తారు. దీనివల్ల చురుకుదనం, బిడ్డ మీద శ్రద్ధ, ఆత్మవిశ్వాసమూ తగ్గుతాయి. తమను తామే నిందించుకునే స్థితిలోకి వెళ్లిపోతారు. వీళ్లకు టాకింగ్ థెరపీ అనేది బాగా పనిచేస్తుంది. ప్రసవమప్పుడు జరిగిన అనుకోని సంఘటలను వాళ్ల మెదడు యాక్సెప్ట్ చేయడానికి ఈ టాకింగ్ థెరపీ దోహదపడుతుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఈ థెరపీ గురించి చెప్తారు. ఏ సమయంలో వాళ్ల మూడ్ చేంజ్ అవుతోందో గమనించాలి. కొన్ని తేదీలు.. వాసనలు.. మనుషులను చూసినప్పుడు పాత విషయాలు, ఎక్స్పీరియెన్సెస్ గుర్తుకువచ్చి డిప్రెస్ అవుతారు. డిప్రెషన్ ఎక్కువగా ఉంది అంటే దానికి సంబంధించి మందులు వాడాలి. కొన్నిసార్లు నమ్మకం ఉన్నవారితో తమ ఆలోచనలను షేర్ చేసుకొమ్మని సూచిస్తాం. చాలాసార్లు కౌన్సెలింగ్‌తో సమస్యను పరిష్కరించవచ్చు. పాత అనుభవంతో కొంతమందికి భవిష్యత్‌లో ప్రెగ్నెన్సీ అంటేనే భయం పట్టుకోవచ్చు. అందుకే సమస్య కొంచెంగా ఉన్నప్పుడే డాక్టర్‌ను సంప్రదిస్తే ఏ విధమైన కౌన్సెలింగ్ ఇవ్వాలి అనేది నిర్ణయించవచ్చు. -డా. భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
మెనోపాజ్ ఆందోళన వీడండి... ఆనందంగా జీవించండి
ఉమన్ హెల్త్ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. కొంతకాలం నుంచి నన్ను ఒక సమస్య తీవ్రంగా కలచివేస్తోంది. అదేమిటంటే మెనోపాజ్ వచ్చిందేమోనని భయంగా ఉంది. ఎందుకంటే గత ఆర్నెల్లుగా నాకు రుతుస్రావం సక్రమంగా అవడం లేదు. ప్రతి చిన్న విషయానికీ అందరిపై చికాకు పడుతున్నాను. అదే పనిగా ఆవేశానికి లోనవుతున్నాను. కలత చెందుతున్నాను. నాలో ఉత్సాహం తగ్గిపోయి నీరసం, నిస్సత్తువ ఆవహించినట్టు ఉంటోంది. ఏ విషయంలోనూ ఏకాగ్రతను పెట్టలేకపోతున్నాను. నాలో వచ్చిన ఈ విపరీతమైన మార్పులతో నా స్నేహితులు ‘నువ్వు మెనోపాజ్‌కు చేరువవుతున్నట్లున్నావు’ అని అంటున్నారు. అసలు నాకు ఏమైంది? - రాజ్యలక్ష్మి, ఒంగోలు మీరు తెలిపిన లక్షణాలను బట్టి చూస్తే మీరు మెనోపాజ్‌తో బాధపడుతున్నట్లు అనిపించడం లేదు. సాధారణంగా మెనోపాజ్ నలభై ఏళ్లు పైబడినవారి తర్వాతే ఎక్కువ. మెనోపాజ్ మొదలైన స్టేజ్‌ని వైద్యశాస్త్రంలో ‘గోల్డెన్ ఏజ్’గా అభివర్ణిస్తారు. దీనికి అంతటి ప్రాముఖ్యత ఉంది. మీకు త్వరగా పెళ్లి కావడం వల్ల మీరు మెనోపాజ్ గురించి అనవసరంగా చాలా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారేమోనని అనిపిస్తోంది. ఇలా తీవ్రమైన ఆందోళనకు గురైనా కూడా త్వరగా మెనోపాజ్‌కు లోనయ్యే అవకాశాలున్నాయి. అయినప్పటికీ మీరు కంగారు పడాల్సిన పనేమీ లేదు. ఈ ప్రక్రియ ప్రకృతి సహజమైనది. జీవితంలో అన్నింటినీ పాజిటివ్‌గా తీసుకుని, మిగతా లైఫ్‌ని ఆనందంగా గడపాలి. ఈకాలంలో మహిళలందరూ ఉన్నతమైన స్థానాలను అధిరోహించి తమ తమ వృత్తి ఉద్యోగాల్లో గొప్పగా రాణిస్తున్నారు. కొందరు మెనోపాజ్ దాటిన వారు కూడా వారిలో ఉన్నారు. వారందరినీ మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మీరు మంచి గైనకాలజిస్ట్‌ను కలవండి. మీ సమస్యతో పాటు మీ అనుమానాలూ క్లియర్ అవుతాయి. ఈలోగా మీరు మంచి ఆహారాన్ని తీసుకోండి. మసాలా, వేపుళ్లు, కాఫీల వంటివి ఎక్కువగా తీసుకోకండి. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండండి. రెస్ట్ తీసుకోండి. వైటమిన్-డి, క్యాల్షియమ్ ఉండే ఆహారాన్ని గానీ లేదా ట్యాబ్లెట్లుగా గానీ తీసుకోండి. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి చేస్తూ స్ట్రెస్‌ను దూరం చేసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసేలా చూసుకోండి. మిత్రులను కలవడం, ఆరోగ్యకరమైన సంభాషణలు వంటివి చేయండి. మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. - డాక్టర్ శాంతకుమారి సీనియర్ గైనకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్


