
చలం, అంబేద్కర్‌ల నుంచి నటి, ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్‌ఎఫ్‌పీఏ) జెండర్ ఈక్వాలిటీకి ఈ దేశపు రాయబారి కృతిసనన్ దాకా అందరి మాటా ఒకటే స్త్రీ ఆరోగ్యమే దేశ భవిష్యత్ భాగ్యం అని!
నిజానికి మహిళా ఆరోగ్యం, లింగ సమానత్వం గురించి మాట్లాడుకోవడానికి ప్రత్యేక సందర్భం అక్కర్లేదు.. అయినా ఈ ప్రస్తావనకు ప్రత్యేక సందర్భమూ ఉంది. అదే బెర్లిన్ (జర్మనీ)లో జరిగిన వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2025. ఇందులో ఆమె మహిళల ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గురించి మాట్లాడారు. ఇలా వరల్డ్ హెల్త్ సమ్మిట్‌లో ప్రసంగించిన తొలి భారతీయ నటిగా కీర్తి గడించారు. ఆ ప్రసంగంలో కీర్తి సనన్ ఏం మాట్లాడారంటే..
‘మహిళల ఆరోగ్యం నిర్లక్ష్యం చేయాల్సిన లేదా పక్కన పెట్టాల్సిన విషయం కాదు. తక్షణమే దృష్టిపెట్టాల్సిన అత్యంత అవసరమైన అంశం. ఆమె ఆరోగ్యం.. మానవాళి ప్రగతికి, భవిష్యత్‌కు మూలస్తంభం. అందుకే మహిళా ఆరోగ్యానికి సంబంధించి సుస్థిరమైన పెట్టుబడులు కావాలి. ఆవిష్కరణలు జరగాలి.
ఇందుకోసం చేసే ప్రతి ప్రయత్నం అద్భుతమైన ఆర్థిక, సామాజిక మార్పులుగా ప్రతిఫలిస్తుంది. ఏటా ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేస్తే పదమూడు వందల కోట్ల రాబడి కనిపిస్తోంది. అంటే దాదాపు తొమ్మిది రెట్ల లాభం. ఈ ఇన్వెస్ట్‌మెంట్ నైతికావసరమే కాదు మన మూకుమ్మడి భవిష్యత్‌కు భరోసా కూడా! ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు, సమాజం.. ఆరోగ్యంగా ఉంటాయి.
ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థికసుస్థిరతకు చిహ్నం. కానీ ప్రపంచ జనాభాలో సగంగా ఉన్న మహిళల ఆరోగ్యం ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉంది. యూఎన్‌ఎఫ్‌పీఏ జెండర్ ఈక్వాలిటీ అంబాసిడర్‌గా చాలా ప్రాంతాలు తిరిగాను. అవన్నీ కూడా బాల్యవివాహాలకు సాక్ష్యంగా కనపడ్డాయి.
అమ్మాయిలకు మానసిక ఆరోగ్యం సంగతి అటుంచి కనీసం శారీరక ఆరోగ్య కేంద్రాలు కూడా అందుబాటులో లేని దుస్థితిలో ఉన్నాయి. వీళ్ల జీవితాలు మారాలంటే మహిళల ఆరోగ్యానికి సంబంధించి దృష్టి పెరగాలి. తక్షణమే ఆ దిశగా కార్యాచరణ నిర్ణయాలు జరగాలి’ అన్నారు కృతిసనన్.
(చదవండి: 'జోంబీ' డ్రగ్ జిలాజైన్: అచ్చం 'జాంబీ రెడ్డి' మూవీ సీన్‌ని తలపించేలా..)