న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, ఎంపీ శశి థరూర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమవుతున్నారనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆయన పార్టీ కీలక సమావేశాలకు తరచూ గైర్హాజరు కావడం, ప్రధాని నరేంద్ర మోదీని బహిరంగంగా ప్రశంసించడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. థరూర్ వైఖరిని కాంగ్రెస్ నేతలు ‘అవిశ్వాసం’గా పరిగణిస్తున్నారు. మోదీ విజన్, ఆయన అభివృద్ధి విధానాలపై ధరూర్ కురిపిస్తున్నప్రశంసల జల్లు పార్టీలోని సహచరుకు కూడా మింగుడుపడటం లేదు. శశిథరూర్ కాంగ్రెస్ పార్టీపై చూపుతున్న నిరసన మరోమారు బయటపడింది.
నేటి (సోమవారం)నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వ్యూహాత్మక బృందం సమావేశానికి ఎంపీ శశి థరూర్ హాజరు కాకపోవడంతో ఆయన కాంగ్రెస్‌ను వీడుతున్నారనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే థారూర్ ప్రస్తుతం కేరళలో ఉన్నారని, అతని 90 ఏళ్ల తల్లి సంరక్షణను పర్యవేక్షిస్తున్నందున, ఈ సమావేశానికి రాలేకపోయారని ఆయన కార్యాలయం వివరణ ఇచ్చింది. కాగా ఈ తరహా గైర్హాజరు ఇది తొలిసారేమీ కాదు. అంతకుముందు కూడా అనారోగ్యం పేరుతో ‘సర్’ అంశంపై ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారు. థరూర్ గైర్హాజరీపై పార్టీలో ప్రశ్నలు తలెత్తడానికి ప్రధాన కారణం అదే రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే ప్రధాని మోదీని ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు పెట్టారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతపై థరూర్ చేసిన బహిరంగ ప్రశంసలు కాంగ్రెస్‌లో తీవ్రమైన అంతర్గత విభేదాలకు దారితీశాయి. ప్రపంచ సవాళ్ల మధ్య కూడా భారతదేశాన్ని ఉద్భవిస్తున్న మోడల్‌గా మార్చాలనే మోదీ ఆలోచనను థరూర్ కొనియాడారు. ముఖ్యంగా, వలసవాద బానిస మనస్తత్వంను రూపుమాపడం, భాష, సంస్కృతి, వారసత్వం ద్వారా జాతీయ గౌరవాన్ని పెంపొందించడంపై మోదీ దృష్టి సారించడాన్ని ఆయన మెచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని పలువురు నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ సమయంలో థరూర్ తాను కాంగ్రెస్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తన సొంత అభిప్రాయం మాత్రమే ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లోనే ఉంటానని థరూర్ ఎంత గట్టిగా చెబుతున్నా, ఆయన తీరుతెన్నులు, అభిప్రాయాలు పార్టీలో అంతర్గత విభేదాలకు కారణంగా నిలుస్తున్నాయి. కాంగ్రెస్ కీలక సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం, ప్రధానిని బహిరంగంగా ప్రశంసించడం తదితర చర్యలు ఆయన త్వరలో కాంగ్రెస్ గూటిని వీడతారేమో అనే సందేహాన్ని మరింతగా పెంచుతున్నాయి. ప్రస్తుతానికి థరూర్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నా, భవిష్యత్తులో ఆయన పార్టీని వీడుతారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ‘మస్క్’ను తలదన్నేలా.. కుర్రాళ్ల సరికొత్త ఏఐ మోడల్


