ఫిరాయింపులపై వారిది ఒకటే తీరు | Kishan Reddy Fires On BRS and Congress | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులపై వారిది ఒకటే తీరు

Nov 30 2025 5:31 AM | Updated on Nov 30 2025 5:31 AM

Kishan Reddy Fires On BRS and Congress

కాజీపేట మండలంలోని రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి వివరిస్తున్న రైల్వే అధికారి

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై కిషన్‌రెడ్డి ధ్వజం 

ఈ రెండు పార్టీల వల్లే బీసీలకు అన్యాయం 

బిహార్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌ 42% రిజర్వేషన్ల ప్రకటన 

బీసీ జనాభాను తగ్గించి చూపి బీఆర్‌ఎస్‌ అన్యాయం చేసింది 

వరంగల్‌ స్టేషన్‌లో కేంద్రమంత్రి చాయ్‌ పే చర్చ

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రజాతీర్పును కాలరాయడంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల వైఖరి ఒక్కటేనని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోగా, అలా వచి్చన కొందరు సిగ్గులేకుండా మంత్రి పదవుల్లో కొనసాగారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ కూడా అదే పని చేస్తోందని, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుందని విమర్శించారు. తమ పార్టీలో చేరే వారిని రాజీనామా చేసి వస్తేనే తీసుకున్నామని చెప్పారు.

ఆ రెండు పార్టీల నిర్ణయాల వల్లే రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. కిషన్‌రెడ్డి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రేటర్‌ వరంగల్‌లో పర్యటించారు. వందేభారత్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఆయన.. స్టేషన్‌లో పనులను పరిశీలించి, చాయ్‌ పే చర్చ నిర్వహించారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ (ఆర్‌ఎంయూ)ను సందర్శించారు.  

కాంగ్రెస్సే మా ప్రధాన శత్రువు 
‘బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ కపట నాటకం ఆడుతోంది. బిహార్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని ప్రకటన చేసింది. చివరకు ఇప్పుడు 32 శాతం కూడా లేకుండా అన్యాయం చేసింది. బీసీలకు కేటాయించిన స్థానాల్లో ముస్లింలు పోటీ చేసే అవకాశం ఉంది. నిజమైన బీసీలకు రిజర్వేషన్లు దక్కడం లేదు. బీసీ జనాభాను తగ్గించి చూపి అన్యాయం చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీకి బీసీ రిజర్వేషన్లపై ఒక్కమాట కూడా మాట్లాడే హక్కులేదు. కాంగ్రెస్‌ పార్టీయే మాకు ప్రధాన శత్రువు. ఆ పార్టీ ప్రభుత్వ అవినీతిపై పోరాటాలు చేస్తాం. హిల్ట్‌ పి వెనుక ఉన్న కుంభకోణంపై కూడా పోరాటాలు చేస్తాం. 22 పరిశ్రమలకు చెందిన భూములను అన్యాక్రాంతం చేయాలని చూడటం దారుణం. గ్రేటర్‌ వరంగల్‌ను వరంగల్, హనుమకొండ జిల్లాలుగా విభజించి, 27 మున్సిపాలిటీలను గ్రేటర్‌ హైదరాబాద్‌లో విలీనం చేసి పారిశ్రామిక వాడలను తరలించాలని ప్రభుత్వం చూడటంపై బీజేపీ పోరాటం చేస్తుంది..’అని కిషన్‌రెడ్డి తెలిపారు.  

త్వరలోనే వరంగల్‌కు ప్రధాని 
‘దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. 40 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణకు రూ.కోట్లు వెచి్చంచాం. పీఎం మిత్రకింద కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో ఇప్పటికే 3 కంపెనీలు అగ్రిమెంట్‌ చేసుకుని ముందుకెళ్తున్నాయి. కాజీపేట ఆర్‌ఎంయూ వచ్చే ఏడాదిలో పూర్తయ్యేలా పనులు వేగవంతం చేశాం. మామునూరు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ తది దశకు చేరుతోంది. మామునూరు ఎయిర్‌పోర్టు, మెగా టెక్స్‌టైల్‌ పార్కులలో భూమిపూజ చేసేందుకు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని వరంగల్‌కు తీసుకు వస్తాం..’అని కేంద్రమంత్రి చెప్పారు.

 ‘మోదీ ప్రధాని అయ్యాక రూ.60 వేల కోట్ల ఎంఎస్‌పీ చెల్లించి పత్తి కొనుగోళ్లు చేశాం. తెలంగాణలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు గతేడాది 110 ఉంటే ఈసారి 123కు పెంచాం. దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు తెలంగాణ నుంచే అత్యధికంగా పత్తి కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు కేంద్రమే మద్దతు ధర ఇస్తోంది..’అని కిషన్‌రెడ్డి తెలిపారు. పలువురు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement