న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఓటర్ల జాబితాలో సమగ్రత, పారదర్శకతను పెంచేందుకు చేపట్టిన ఈ ప్రక్రియను మరో వారంపాటు పొడిగించింది. పశి్చమబెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ సహా మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ పొడిగింపు వర్తించనుంది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా దరఖాస్తులు స్వీకరించడానికి చివరి తేదీ డిసెంబర్ 4 కాగా, పొడిగింపుతో 11 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
పరిశీలనల అనంతరం 2026 ఫిబ్రవరి 14న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనుంది. ఈ ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో చర్చించిన అనంతరం కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈసీ నిర్ణయంపై కాంగ్రెస్ స్పందించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు షెడ్యూల్‌లో మార్పులు చేయడం చూస్తే.. సభలో ఎస్‌ఐఆర్‌పై చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను పక్కన పెట్టడానికి ప్రభుత్వం కుట్రలు సాగిస్తున్నట్లు అర్థమవుతోందని విమర్శించింది.
గోవాలో 90 వేల నకిలీ ఓట్లున్నట్లు ఎస్‌ఐఆర్‌లో తేలిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సంజయ్ గోయెల్ తెలిపారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయినవారు, మరణించిన వారితోపాటు నకిలీ ఓట్లు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రారంభానికి ముందు నవంబర్ 4న రాష్ట్రంలో మొత్తం 11,85,000 ఓటర్లున్నారని, ఎస్‌ఐఆర్ తరువాత కేవలం 10,55,000 దరఖాస్తులు మాత్రమే ఎన్నికల సంఘానికి అందాయని తెలిపారు. ఇంకా 40 వేల దరఖాస్తులు కమిషన్‌కు రాలేదని వెల్లడించారు.


