కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుత ఓటరు జాబితాలోని 26 లక్షల మంది ఓటర్ల పేర్లు 2002 నాటి ఓటరు జాబితాతో సరిపోలడం లేదని ఎన్నికల కమిషన్(ఈసీ)తెలిపింది. ఓటరు జాబితా ఎస్‌ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను బెంగాల్‌లోని సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ ఈసీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.
ఎస్‌ఐఆర్‌లో భాగంగా బుధవారం నాటికి రాష్ట్రంలో 6 కోట్లకుపైగా ఎన్యుమరేషన్ దరఖాస్తులను డిజిటైజ్ చేసినట్లు ఈసీ తెలిపింది. అనంతరం వీటిని గత 2002 ఎస్‌ఐఆర్‌నాటి ఓటరు జాబితాతో పోల్చగా ఈ తేడా బయటపడిందని ఓ అధికారి వెల్లడించారు. డిజిటైజేషన్ కొనసాగుతున్నందున ఈ తేడా మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. అయితే, తుది ఓటరు జాబితా నుంచి వీటిని ఈ పేర్లను ఆటోమేటిక్‌గా తొలగించినట్లు కాదన్నారు.


