కేంద్రంపై కపిల్ సిబల్ ధ్వజం
దర్యాప్తు సంస్థల పరిధిపై సుప్రీంకోర్టు విచారణకు డిమాండ్
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపించిన సమయంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విపక్ష నేతలపై దాడులు చేయడం వెనక మతలబు ఏమి టని రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ ప్రశ్నించారు. అసలు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ పరిధిని సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లన్నింటినీ తక్షణం విచారణకు స్వీకరించాల్సిందిగా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
పశ్చిమబెంగాల్‌లో ఈడీ తాజా దాడుల ఉద్దేశం కేవలం విపక్ష నేతలను వేధించమేనని స్పష్టంగా కన్పిస్తోందన్నారు. ఒక సంస్థ కార్యాలయంలోకి చొరబడి కనిపించిన డాక్యుమెంట్లనల్లా జప్తు చేసేస్తామనడం సమంజసమా అని ప్రశ్నించారు.
కేవలం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించలేమనే కడుపు మంటతో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎలాగైనా ఇబ్బందులపాలు చేసేందుకే మోదీ ప్రభుత్వం ఇలా ఈడీని ఉసిగొల్పిందని సిబల్ ఆరోపించారు. గతంలో బిహార్‌లో లాలుప్రసాద్, తేజస్వీ యాదవ్, జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌పైనా సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే ఈడీ దాడులకు దిగిందని గుర్తు చేశారు. బెంగాల్‌లో ఐప్యాక్ సంస్థపై దాడుల తర్వాత ఈడీ ఇప్పుడు ఇంకే విచారిస్తోందని ప్రశ్నించారు.
..అస్సలు అనుకోలేదు!
యూపీఏ హయాంలో 2004–14 మధ్య ఇలా విపక్షాలు, విపక్ష నేతలపై ఇష్టారాజ్యంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం ఎప్పుడూ జరగలేదని సిబల్ అన్నారు. ‘‘ఇప్పుడు మాత్రం ఈడీ సర్వాంతర్యామిగా మారిపోయింది. దేశంలో ఎప్పుడైనా, ఎక్కడికైనా ఇట్టే వెళ్లి వాలిపోతోంది. విచారణ పేరుతో అడ్డ గోలు దాడులకు దిగుతోంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే పనులతో సమాఖ్య వ్యవస్థనే కదలబారుస్తోంది’’అంటూ దుయ్యబట్టారు. యూపీఏ హయాంలో ఈడీని ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి పరిణామాన్ని మేం ఊహించలేదు’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు.


