వాషింగ్టన్/లండన్: భారత సంతతికి చెందిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాసన్ కులకర్ణికి బ్రిటన్‌కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ స్వర్ణ పతకం దక్కింది. అమెరికావాసి అయిన కులకర్ణి అంతరిక్ష రంగంలో కాల విభాగంలో జరిపిన మైలురాళ్ల వంటి పరిశోధనలకు ఈ పురస్కారాన్ని గెలుచుకున్నారు. పలు ఆస్ట్రో ఫిజికల్ పరిశోధనల్లో ఆయన స్టీఫెన్ హాకింగ్, జోస్లిన్ బెల్ బర్న్‌వెల్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ల సరసన నిలువదగ్గ స్థాయిలో కృషిచేశారు. కులకర్ణి 1985 నుంచి కాలిఫోరి్నయా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
మరుగుజ్జు తారలు, సుదూరాల్లోని గామా కిరణ విస్ఫోటనాలు వంటివాటి గుట్టుమట్లు విప్పడంలో ఆయన ఎనలేని కృషి చేశారు. బర్కిలీ వర్సిటీలో పరిశోధక విద్యార్థిగా ఉండగానే మిల్లీసెకన్ పల్సర్‌పై చేసిన పరిశోధనలతో ఆ రంగంలోని ఉద్ధండుల దృష్టిలో పడ్డారు. కులకర్ణి 1997లో చేసిన పరిశోధన గామా కిరణ విస్ఫోటాలు తారా సమూహాలకు ఆవల కూడా సంభవిస్తాయని రుజువు చేసింది. ఇది ఆస్ట్రోఫిజిక్స్ తీరుతెన్నులనే కొత్త మలుపు తిప్పింది. పాలోమర్ ట్రాన్సియెంట్ ఫ్యాక్టరీ (పీటీఎఫ్), జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ (జీటీఎఫ్) వంటి కీలక సూత్రాల ఆవిష్కరణలో ఆయనది కీలక పాత్ర.
ఆశ్చర్యం, ఆనందం: కులకర్ణి
ఆర్‌ఏఎస్ పురస్కారం పట్ల కులకర్ణి హర్షం వెలిబుచ్చారు. గతంలో దాన్ని అందుకున్న హేమాహేమీల సరసన తన పేరు చేరడం ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉందన్నా రు. కులకర్ణి 1978లో ఐఐటీ ఢిల్లీలో మాస్టర్స్ చేశారు. అనంతరం 1983లో బర్కిలీ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం నాసా 2030లో ప్రయోగించబోతున్న యూవీఈఎక్స్ అ్రల్టావయోలెట్ స్కై సర్వే మిషన్‌తో పాటు కెక్ అబ్జర్వేటరీ తాలూకు జెడ్‌షూటర్ స్పెక్ట్రోమీటర్ మిషన్‌లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీకి 200 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఆ్రస్టానమీ మొదలుకుని జియోఫిజిక్స్ దాకా పలు రంగాల్లో అద్భుతమైన కృషి చేసిన శాస్త్రవేత్తలకు ఆర్‌ఏఎస్ ప్రదానం చేసే గోల్డ్‌మెడల్‌ను వారి సేవలకు అత్యంత విలువైన గుర్తింపుగా భావిస్తుంటారు.


