భారతే ముఖ్యం | USA and India are actively working on a bilateral trade agreement | Sakshi
Sakshi News home page

భారతే ముఖ్యం

Jan 13 2026 4:13 AM | Updated on Jan 13 2026 5:29 AM

USA and India are actively working on a bilateral trade agreement

అమెరికాతో విడదీయలేని బంధం

ఈ శతాబ్దంలోకెల్లా ప్రభావశీల భాగస్వామ్యం

నూతన రాయబారి సెర్గియో గోర్‌ వ్యాఖ్య

విభేదాలున్నా వాటికి చర్చలతో పరిష్కారం

స్వేచ్ఛా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయ్‌

బాధ్యతల స్వీకరణ అనంతరం గోర్‌ వెల్లడి

‘ఖనిజ, ఏఐ’ కూటమిలోకి భారత్‌కు ఆహ్వానం

న్యూఢిల్లీ: అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఆయన యంత్రాంగంలోని పలువురు సలహాదారుల నోటి దురుసు కారణంగా భారత్‌తో దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై అమెరికా గట్టిగా దృష్టి సారించింది. భారత్‌లో అమెరికా నూతన రాయబారి సెర్గియో గోర్‌ ఈ దిశగా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కోణంలో చూసినా అమెరికాకు భారత్‌ అంతటి ముఖ్యమైన దేశం మరొకటి లేదని స్పష్టం చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బంది, మీడియాను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయాయన్నది నిజం కాదని గోర్‌ స్పష్టం చేశారు. ఈ దిశగా ఇరు దేశాల ప్రతినిధుల నడుమ మంగళవారమే తర్వాతి దశ చర్చలు జరగనున్నట్టు వెల్లడించారు. అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధకు సంబంధించి అమెరికా సారథ్యంలో రూపొందుతున్న వ్యూహాత్మక కూటమిలో భారత్‌ భాగస్వామి కావాలని అభిలషించారు. ఈ మేరకు ట్రంప్‌ తరఫున భారత్‌ను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. 

‘‘భారత్‌ ప్రపంచంలోకెల్లా అతి పెద్ద దేశం. భారత్, అమెరికా నడుమ ఉన్నది కేవలం సారూప్య ప్రయోజనాలు మాత్రమే కాదు. విడదీయలేని దృఢమైన బంధం కూడా’’ అని అన్నారు. ‘‘భారత్‌ ఓ అద్భుత దేశం. దౌత్యాన్ని ప్రపంచానికే ఆదర్శప్రాయ రీతిలో పునర్‌ నిర్వచించే సువర్ణావకాశం ప్రస్తుతం ఇరుదేశాల ముందుంది. 

భారత్, అమెరికా మైత్రి ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత ప్రభావశీల భాగస్వామ్యంగా రూపుదిద్దుకోగలదు’’ అని 38 ఏళ్ల గోర్‌ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్‌ కంటే ఆవశ్యకమైన భాగస్వామి అమెరికాకు ఇంకెవరూ లేరు. రాయబారిగా భారత్‌తో బంధం విషయంలో వచ్చే కొన్నేళ్లకు సంబంధించి ఓ భారీ ఎజెండాయే నా ముందుంది. వ్యూహాత్మక భాగస్వామ్యం, శక్తి సామర్థ్యాలతో పాటు పరస్పర గౌరవాదరాలు, నాయకత్వ పటిమే పునాదులుగా అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకుందాం’’ అని పిలుపునిచ్చారు. ట్రంప్, ప్రధాని మోదీ మధ్య నిజమైన, దృఢమైన స్నేహముందని గోర్‌ అన్నారు. 

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత రెండు దశాబ్దాల్లోకెల్లా అత్యల్ప స్థాయికి చేరేందుకు కారణమైన విభేదాల పరిష్కారానికి వారి స్నేహబంధం కచ్చితంగా తోడ్పడుతుందని అభిప్రాయç ³డ్డారు. ‘‘నిజమైన మిత్రులు పరస్పరం విభేదించవచ్చేమో. కానీ అంతిమంగా తమ భేదాభిప్రాయాలను పరిష్కరించుకుంటారు’’ అని అమెరికా–భారత్‌ నడుమ బంధానికి బీటలు పడ్డట్టు గోర్‌ పరోక్షంగా అంగీకరించారు. ‘‘ఇరు దేశాల బంధం విషయంలో వాణిజ్యం చాలా ముఖ్యమైన అంశమే. దానితో పాటు భద్రత, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఇంధనం, టెక్నాలజీ, విద్య, వైద్యం వంటి పలు కీలక రంగాల అంశాల్లో ఇరు దేశాలూ అత్యంత సన్నిహితంగా కలిసి పని చేయనున్నాయి’’ అని గోర్‌ వివరించారు.

బంధానికి బీటలు..
ఇటీవలి కాలంలో భారత్, అమెరికా బంధం ఒడిదుడుకుల్లో పడటం తెలిసిందే. రష్యా నుంచి భారత్‌ చమురు కొనడంపై తాను సంతోషంగా లేనని ట్రంప్‌ అనడం, టారిఫ్‌లను భారీగా పెంచుతానని హెచ్చరించడం, అందుకు తగ్గట్టే భారత్, చైనాలపై ఏకంగా 500 శాతం టారిఫ్‌ల  విధింపుకు అమెరికా బిల్లు సిద్ధం చేస్తుండటం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. దాంతో ఇరు దేశాల సంబంధాలు కొంతకాలంగా నేలచూపులు చూస్తూ వస్తున్నాయి. 

పైగా మోదీ స్వయంగా ట్రంప్‌కు ఫోన్‌ చేసి మాట్లాడని కారణంగానే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నిలిచిపోయిందని అమెరికా వాణిజ్య మంత్రి లుట్నిక్‌ బాహాటంగా వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి మరింత దిగజారింది. వీటికి తోడు భారతీ యులను ప్రధా నంగా లక్ష్యంగా చేసుకుని హెచ్‌– 1బీ వీసాలపై అమెరికా నానాటికీ ఆంక్షల చట్రాన్ని బిగిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ సన్నిహిత బృందంలో కీలక సభ్యుడైన గోర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారత్‌ తో సంబంధాలను తిరిగి మెరుగు పరు చుకునే ప్రయత్నాల్లో అవి భాగమేనని భావిస్తున్నారు. గోర్‌ ప్రస్తావించిన పిక్స్‌ సిలికా కూటమిలో జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్, ఇజ్రాయెల్‌ ఇప్పటికే చేరాయి.

మోదీకి ట్రంప్‌ శుభాకాంక్షలు
‘‘భారత్‌ బయల్దేరే ముందే ట్రంప్‌తో మాట్లాడా. ఈ అద్భుత దేశం పౌరులకు, ముఖ్యంగా ప్రియ మిత్రుడు మోదీకి శుభాకాంక్షలు అందించాల్సిందిగా ఆయన నాకు చెప్పారు’’ అని గోర్‌ తెలిపారు. ‘‘రెండు వారాల క్రితం ట్రంప్‌తో మాట్లాడా. ఆయన భారత్‌ సందర్శన తాలూకు అద్భుత అనుభవాలను నాతో పంచుకున్నారు. ఒకట్రెండేళ్లలో మరోసారి భారత్‌లో పర్యటించాలని కూడా ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు’’ అని వివరించారు. ‘‘రాయబారిగా మొట్టమొదటే భారత్‌ వంటి ప్రపంచంలోకెల్లా అతిపెద్ద, అతిపురాతన దేశంలో పని చేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మన రెండు అతి గొప్ప దేశాల బాగస్వామ్యాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లడమే నా ముందున్న లక్ష్యం’’ అని గోర్‌ ప్రకటించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement