ముంబై: కొత్తగా నిర్మించిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజా నాయకుడు, దివంగత డీబీ పాటిల్ పేరు పెట్టనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐరోలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. “నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రజా నాయకుడు దివంగత డీబీ పాటిల్ పేరు పెడుతున్నాం” అని ప్రకటించారు.
నవీ ముంబై.. ముంబైకి విస్తరణ మాత్రమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి తదుపరి ఇంజిన్‌గా మారబోతోందని ఫడ్నవీస్ తెలిపారు. ఈ విమానాశ్రయం ఫార్మాస్యూటికల్స్, ఇన్నోవేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, సేవలు, దిగుమతి–ఎగుమతి వంటి రంగాలకు మద్దతు అందిస్తూ నగర ఆర్థిక పునాదిని మరింత బలోపేతం చేస్తుందన్నారు.
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కలంబోలిలో కొత్త జంక్షన్, ఖార్ఘర్–తుర్భే సొరంగం వంటి కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని తెలిపారు. అలాగే నగరవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచేందుకు సిడ్కో ద్వారా మెట్రో నెట్‌వర్క్ అభివృద్ధి జరుగుతోందన్నారు.
రాబోయే రోజుల్లో షిలార్, పోషిర్ ప్రాజెక్టుల ద్వారా నవీ ముంబై నివాసితుల తాగునీటి అవసరాలు పూర్తిగా తీరుతాయని సీఎం తెలిపారు. నవీ ముంబైలో ‘ఎడ్యుసిటీ’ అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను ఆకర్షించి, స్థానిక విద్యార్థులకు విద్యా, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఘన్సోలి సింప్లెక్స్ వద్ద ఇళ్ల పునరాభివృద్ధి చేపడతామని, అదే ప్రాంతంలో ఏపీఎంసీ మార్కెట్‌ను కూడా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
బేలాపూర్‌లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం టెండర్లు పిలిచామని, మన్పాడాలో సెంట్రల్ లైబ్రరీ పనులు ప్రారంభమయ్యాయని ఫడ్నవీస్ తెలిపారు. మత్స్యకార సమాజం, స్థానికుల కోసం ప్రత్యేక ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. జనవరి 15న జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.


