అమిత్‌ షా గుట్టువిప్పుతా: మమత | CM Mamata Benerjee claims she has pen drives against Amit Shah | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా గుట్టువిప్పుతా: మమత

Jan 9 2026 7:05 PM | Updated on Jan 9 2026 7:12 PM

CM Mamata Benerjee claims she has pen drives against Amit Shah

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో ఈడీ దాడుల కారణంగా రాజకీయం వేడెక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజకీయంగా తృణముల్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక ఇలా ఈడీ, దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు దిగుతున్నారని ఆరోరించారు. ఇదే సమ​యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు మమత వార్నింగ్‌ ఇచ్చారు. బొగ్గు కుంభకోణంలో అమిత్‌ షా ప్రమేయం ఉందని బాంబు పేల్చారు. దీంతో, మమత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

బెంగాల్‌లో ఐప్యాక్ కార్యాలయంలో ఈడీ సోదాలకు నిరసనగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నిరసన మార్చ్‌లో పాల్గొన్నారు. హజ్రాలో మార్చ్ ముగిసిన తర్వాత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మమత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బెంగాల్ మేల్కొంది, ప్రజల మద్దతు లభిస్తోంది. కార్యకర్తలే దగ్గరుండి ఆందోళనలను నడిపించారు. గతంలో ఇలాంటి ఘటనలు చూశాం. రక్తం వచ్చేలా లాఠీ దెబ్బలు తిన్నాం. ఈ హజ్రాలోనే నేను కూడా దెబ్బలు తిన్నాను. నేను చాలాసార్లు దెబ్బలు తిన్నాను, శరీరమంతా గాయాలతోనే పని చేశాను. నన్ను ఎవరైనా కొట్టిన రోజున నేను పునర్జన్మ పొందుతాను. 

నాపై, నా ప్రభుత్వంపై ఒత్తిడి చేయకండి. నేను ఏం చేస్తానో మీకు తెలుసు. మేము చేస్తే చాలా చేయగలం. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన డబ్బు అమిత్ షా తింటారు. బొగ్గు కుంభకోణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉంది. దేశద్రోహుల ద్వారా ఆ డబ్బు వెళుతుంది. బీజేపీకి చెందిన జగన్నాథ్ బొగ్గు స్కాంలో  ఉన్నారు. జగన్నాథ్ ద్వారా బీజేపీ సువేందు అధికారి నుంచి డబ్బు అమిత్ షా దగ్గరకు వెళుతుంది. నా దగ్గర అన్ని పెన్ డ్రైవ్‌లు ఉన్నాయి, అన్నీ బయటపెడతాను. నేను చేపట్టిన పదవికి గౌరవం ఇచ్చి ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. నాపై మరీ ఎక్కువ ఒత్తిడి తేకండి' అని వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో, మమత వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.

అంతటితో ఆగకుండా..‘ఆరోగ్యంగా ఉన్న పులి కంటే గాయపడిన పులి ప్రమాదకరం. దేశ డబ్బును బయటకు తీసుకెళ్లారు, కానీ గ్రామస్తులకు డబ్బు ఇవ్వలేదు. నా డబ్బు నాకు ఇవ్వండి, ఇది పశ్చిమ బెంగాల్ డబ్బు. నాలుగు సంవత్సరాలుగా ఆవాస్, నీరు, సర్వశిక్షా అభియాన్, మధ్యాహ్న భోజనం నిలిపివేశారు. ఒకరిని ఎన్నికల సంఘంలో కూర్చోబెట్టారు. ఆ వ్యక్తి కేంద్ర హోంమంత్రి కింద పనిచేశారు. ఢిల్లీలో మా ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు, పోలీసులు వారిని తీసుకెళ్లారు. అన్ని ఏజెన్సీలను ఆక్రమించారు. మహారాష్ట్ర, హర్యానా, బీహార్లను బలవంతంగా ఆక్రమించారు, ఇప్పుడు బెంగాల్‌ను కూడా బలవంతంగా ఆక్రమించాలని చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ పేరును భరించలేకపోతున్నారు, బెంగాల్ అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్‌లో కొడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో హిందీ మాట్లాడే వారిపై దాడి జరగలేదు, మేము ఎప్పుడూ చేయలేదు. మేము ఈ బీజేపీకి మర్యాద ఇస్తున్నాము, లేకపోతే చేతల్లో చూపిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  

ఈడీపై ఆగ్రహం.. 
ఈడీని ఉద్దేశించి.. ‘మా పార్టీ పత్రాలను, హార్డ్‌డిస్క్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల సమాచారం కూడా ఉంది. అందుకే వాటిని నేను వెనక్కి తెచ్చేశాను’ అని మమత తెలిపారు. అయితే, చట్టపరమైన దర్యాప్తును మమత అడ్డుకున్నారని, ఆమెతో కలిసి రాష్ట్ర పోలీసులు కీలక ఆధారాలను బలవంతంగా తీసుకుపోయారని ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఆరోపించింది. ఈ పరిణామాలపై ఇరు వర్గాలూ కోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యవహారంలో తక్షణ విచారణ చేపట్టాలని కలకత్తా హైకోర్టును ఈడీ కోరింది. అయితే దీనిపై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement