2002నాటి జాబితాతో ఎస్‌ఐఆర్ 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్
బూత్ లెవల్ అధికారులకు కీలక బాధ్యతలు
మ్యాపింగ్‌కి మరో రెండు మూడురోజులే గడువు
ఓటర్లు ఫోన్ ద్వారా బీఎల్‌ఓలను సంప్రదించేందుకు చాన్స్
రాష్ట్రంలో మార్చిలో ‘సర్’2026 చేపట్టే అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్/సర్) చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సన్నాహాలు ప్రారంభించింది. రెండో విడత ‘సర్’చేపట్టిన ఆరు రాష్ట్రాల్లో ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించగా, ఫిబ్రవరిలో తుది జాబితాను ప్రచురిస్తామని ఇప్పటికే ఈసీ ప్రకటించింది. కాగా మూడో విడతలో భాగంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో ‘సర్’నిర్వహించేందుకు మార్చిలో ప్రకటన వెలువడే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) పేరుతో ఏటా కొత్త ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు.
అయితే చివరిసారిగా 2002లో ఉమ్మడి ఏపీలో ‘సర్’నిర్వహించారు. ‘సర్’2026 నిర్వహణకు ముందస్తు సన్నాహాల్లో భాగంగా .. ‘సర్’2002లో భాగంగా ప్రచురించిన ఓటర్ల జాబితాతో, ఎస్‌ఎస్‌ఆర్ 2025 జాబితాను మ్యాపింగ్ చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. అంటే ప్రస్తుత ఓటర్ల జాబితాలో ఉన్న వారిలో ఎవరెవరు సర్ 2002 జాబితాలో పేరు కలిగి ఉన్నారో అన్వేషించే బాధ్యతను స్థానిక బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌ఓ)కు అప్పగించింది. మరో రెండు మూడురోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వారికి ఆదేశాలు అందాయి.
మ్యాపింగ్ బాధ్యతలు బీఎల్‌ఓలకు..
బీఎల్‌ఓ యాప్ ద్వారా మ్యాపింగ్ నిర్వహించేందుకు బీఎల్‌ఓలకు శిక్షణ ఏర్పాట్లు చేశారు. యాప్‌లో ‘మ్యాప్ ఎలెక్టర్ విత్ ప్రీవియస్ ఎస్‌ఐఆర్’(సర్) అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకుంటే అందులో మరో రెండు ఐచ్ఛికాలు స్క్రీన్‌పై ప్రత్యక్షం కానున్నాయి. 2025 జాబితాలోని ఓటరునే 2002 సర్ జాబితాలో మ్యాప్ చేసేందుకు ‘మ్యాప్ ఎలుక్టర్ విత్ ప్రీవియస్ ఎస్‌ఐఆర్’అనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉండనుంది. ఒక వేళ ఎస్‌ఎస్‌ఆర్– 2025 జాబితాలోని ఓటర్ల పేరు ..సర్–2002 జాబితాలో లేకపోతే వారి తల్లిదండ్రుల పేర్లను సర్–2002 జాబితాలో వెతికి మ్యాపింగ్ చేసేందుకు గాను ‘మార్క్ ఎలెక్టర్ యాజ్ ప్రొగినీ’అనే మరో ఐచ్ఛికాన్ని ఎంపిక చేయాల్సి ఉండనుంది.
ఓటర్ల జాబితాలోని పార్ట్ నంబర్, పార్ట్ సీరియల్ నంబర్ల ఆధారంగా ఓటర్లను గుర్తించి మ్యాపింగ్ చేసేలా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఈసీ అభివృద్ధి చేసింది. ఒక వేళ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తై ఉంటే వారి సంతానంలోని ఓటర్ల వివరాలను యాడ్ చేస్తారు. సర్ 2002లోని ఓటర్లతో వారికి ఉన్న సంబంధాన్ని సైతం నమోదు చేస్తారు. ఈ విషయంలో ఓటర్లకు ఏమైనా అనుమాలుంటే తమ ప్రాంత బీఎల్‌ఓతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకునేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈసీ వెబ్‌సైట్(https://voters.eci.gov.in/home/bookACallRequest)కు వెళ్లి తమ ఎపిక్ నంబర్, ఫోన్ నంబర్‌ను ఎంట్రీ చేస్తే సంబంధిత బీఎల్‌ఓకు ఆ ఓటరు ఫోన్ నంబర్‌ను ఈసీ పంపించనుంది. బీఎల్‌ఓ ఫోన్ చేస్తే సర్–2002 జాబితాలోని తమ ఓటరు పోలింగ్ స్టేషన్ నంబర్, పార్ట్ సీరియల్ నంబర్ వివరాలను చెప్పి 2025 జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవచ్చు.
వలస ఓటర్లు ..తస్మాత్ జాగ్రత్త!
రాష్ట్రంలోని 119 శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎస్‌ఐఆర్– 2002లో రూపొందించిన ఓటర్ల జాబితాను ఇటీవల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) కార్యాలయం తన వెబ్‌సైట్ (https://ceotelangana.nic.in/) లో పొందుపరిచింది. ఎస్‌ఐఆర్–2002లో ఓటరు పేరు/తమ తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయో లేవో ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా ఓటర్లు తెలుసుకునే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ సంఖ్య ఆధారంగా ఓటర్ల పేర్లను సులువుగా వెదకవచ్చు.
ఎస్‌ఐఆర్ 2002లో తమ పేరు/తల్లిదండ్రుల పేర్లు ఉన్నట్టు రుజువులు సమర్పిస్తే కొత్త ఎస్‌ఐఆర్‌లో ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి/ ఒక నియోకవర్గం నుంచి మరో నియోకవర్గానికి/ఒకే నియోజకవర్గంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చిరునామా మారిన వలస ఓటర్లను కొత్త ప్రాంతంలోని బీఎల్‌ఓలు గుర్తు పట్టే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి ఓటర్లు సర్– 2002 జాబితాలో తమ పేర్లు/తమ తల్లిదండ్రుల పేర్లను గుర్తించి ఆ వివరాలను తమ ప్రాంత బీఎల్‌ఓలకు మ్యాపింగ్ కోసం అందజేస్తే సర్–2026లో సమస్యలు ఎదుర్కోకుండా గట్టెక్కవచ్చు.


