సభకు వెళ్లే పెద్దలెవరు? | Discussion on Rajya Sabha in the state congress | Sakshi
Sakshi News home page

సభకు వెళ్లే పెద్దలెవరు?

Feb 23 2026 4:31 AM | Updated on Feb 23 2026 4:31 AM

Discussion on Rajya Sabha in the state congress

రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజ్యసభపై చర్చ... అధిష్టానం కోటాలో సింఘ్వికి రెన్యువల్‌

మరో స్థానం కోసం తీవ్ర పోటీ... ఎస్టీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గాలకు అవకాశం?

రేసులో లంబాడా నేత బెల్లయ్య నాయక్‌

బీసీ కోటాలో సీనియర్‌ నేత వీహెచ్‌కు చాన్స్‌... పరిశీలనలో మధుయాష్కీ పేరు

ఎమ్మెల్సీ పదవి వదులుకోవాల్సి వస్తే రాజ్యసభకు మహేశ్‌గౌడ్‌?

రెడ్డి వర్గానికి ఇవ్వాల్సి వస్తే పరిశీలనలో వేం నరేందర్‌రెడ్డి, కోదండరెడ్డి పేర్లు

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి రాష్ట్రం నుంచి పెద్దల సభ కు ఎవరు వెళ్తారన్న చర్చ ఇప్పుడు అధికార కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్‌ మను సింఘ్వి (కాంగ్రెస్‌), కేఆర్‌ సురేశ్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌)ల పదవీ కాలం ఏప్రిల్‌ 9తో ముగియనున్న నేపథ్యంలో వారి స్థానంలో ఏర్పడే ఖాళీల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇటీవల షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 5లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. 

అసెంబ్లీలో బలాబలాల ప్రకారం ఈ రెండు స్థానాలు ఈసారి కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే అవకాశాలుండటంతో అధికార పార్టీ ఎవరిని రాజ్యసభకు పంపుతుందన్నది చర్చనీయాంశమవుతోంది. అయితే, ఈ రెండింటిలో ఒకటి అధిష్టానం కోటాకు వెళ్లనుంది. తెలంగాణకు సంబంధించిన కీలక కేసుల్లో న్యాయవాదిగా ఉన్న ఆ పార్టీ నేత సింఘ్విని రాష్ట్రం నుంచి మరోమారు పెద్దల సభకు పంపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఇక, రెండో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని పలువురు నేతలు ఎవరికి వారు రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేసుకుంటుండగా, ఈసారి రెడ్డి, బీసీ, ఎస్టీ వర్గాల్లో ఒకరికి చాన్స్‌ ఉందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది.

ఎవరిని పంపుతారో?
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రెండు దఫాలుగా ముగ్గురిని (రేణుకా చౌదరి, అనిల్‌కుమార్‌ యాదవ్, అభిషేక్‌ సింఘ్వి) రాజ్యసభకు పంపింది. ఈ జాబితాలో రేణుకా చౌదరి, అనిల్‌కుమార్‌ యాదవ్, అభిషేక్‌ సింఘ్వి ఉన్నారు. సింఘ్వికి రెన్యువల్‌ కావడం దాదాపు ఖరారు కాగా, రెండో సభ్యుడిగా రాష్ట్రం నుంచి రెడ్డి, బీసీ లేదంటే ఎస్టీ వర్గాల నేతల పేర్లను పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గంలో స్థానం లేని లంబాడా సామాజిక వర్గానికి ఈ సీటు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఓటర్లున్న లంబాడా సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం లేకపోవడం, ఇప్పటివరకు నల్లగొండ జిల్లాకు చెందిన శంకర్‌నాయక్‌ను మాత్రమే ఎమ్మెల్సీగా నియమించడం, కార్పొరేషన్‌ చైర్మన్ల విషయంలో పెద్దగా ప్రాధాన్యం కల్పించని నేపథ్యంలో ఈసారి బంజారా నాయకుడిని పెద్దల సభకు పంపే విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

ఈ కోటాలో తెలంగాణ ఉద్యమకారుడు, ఆదివాసీ కాంగ్రెస్‌ రాష్ట్ర మాజీ చైర్మన్, ప్రస్తుత ట్రైకార్‌ చైర్మన్‌ తేజావత్‌ బెల్లయ్య నాయక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకు అటు బంజారా సామాజిక వర్గంలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ గుర్తింపు కూడా ఉంది. సీఎం రేవంత్‌ ఆశీస్సులు కూడా ఆయనకున్నాయని, రాహుల్‌ కోటరీలో తనకున్న సంబంధాలతో ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని బెల్లయ్య ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సామాజికవర్గం నుంచి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ పేరు కూడా వినిపిస్తోంది. 

రేసులో పలువురు
సామాజిక సమీకరణల్లో భాగంగా బీసీలకు మరో అవకాశం ఇచ్చే అంశాన్నీ కాంగ్రెస్‌ పరిశీలిస్తోంది. ఈ జాబితాలో మాజీ ఎంపీ వి.హనుమంతరావు, అధిష్టానంతో సన్నిహిత సంబంధాలున్న టీపీసీసీ ప్రచార కమిటీ మాజీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం అంశాన్ని ఎజెండాగా చేసుకుని వెళుతున్న కాంగ్రెస్‌... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తోందని, ఇప్పటికే పలు కీలక స్థానాల్లో ఆయా వర్గాల నేతలను నియమించిన నేపథ్యంలో ఈసారి  రాజ్యసభకు అగ్రవర్ణాలకు చెందిన నాయకులను పంపుతారనే చర్చ కూడా జరుగుతోంది. 

ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రేవంత్‌కు అత్యంత సన్నిహితుడు, ఆయన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి పేరు ఈ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డి కూడా ఇప్పటికే ఢిల్లీ పెద్దలను కలిసి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక, రైతు కమిషన్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి కూడా తన సేవలకు గుర్తింపుగా పెద్దల సభకు పంపుతారని ఆశిస్తున్నారు. 

జగిత్యాల నియోజకవర్గ రాజకీయ పరిణామాల్లో అసంతృప్తితో ఉన్న సీనియర్‌ నేత టి.జీవన్‌రెడ్డి పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరితో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఉప రాష్ట్రపతిగా ఇండియా కూటమి నుంచి పోటీ చేసిన జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి పేరు కూడా వినిపిస్తున్నా ఆయన రాజకీయ అడుగు వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే, ఆయన్ను ఒప్పించేందుకు రేవంత్‌రెడ్డి యత్నిస్తున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. 

ఇక, మరో ట్విస్ట్‌ ఏమిటంటే.. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌ గౌడ్‌ పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తోంది. మంత్రిగా అజహరుద్దీన్‌ బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు కావస్తోంది. మరో రెండు నెలల్లో ఆయన ఎమ్మెల్సీ లేదంటే ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. కానీ, ఆయనను ఎమ్మెల్సీగా నియమించే విషయం ఇప్పటివరకు ఎటూ తేలలేదు. ఈ నేపథ్యంలో అవసరమైతే మహేశ్‌గౌడ్‌ను రాజ్యసభకు పంపి, ఆయన స్థానంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అజహరుద్దీన్‌ను ఎంపిక చేసే అవకాశాలను కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement