Telangana: నేడు రాష్ట్రమంత్రివర్గ భేటీ | Telangana Cabinet Meeting on Feb 23rd | Sakshi
Sakshi News home page

Telangana: నేడు రాష్ట్రమంత్రివర్గ భేటీ

Feb 23 2026 4:12 AM | Updated on Feb 23 2026 4:49 AM

Telangana Cabinet Meeting on Feb 23rd

బడ్జెట్‌ సమావేశాల ముహూర్తం ఖరారు

మెట్రో టేకోవర్‌పై కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సో­మవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరగనుంది. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల తేదీ­లను ఖరారు చేయడంతోపాటు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి రెండో వారంలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలా రా­బ­ట్టుకోవాలనే అంశంపై చర్చించి అధికారులకు మార్గ­నిర్దేశం చేయనున్నారు.

హైదరాబాద్‌ మెట్రో రైలును నిర్మాణ సంస్థ ‘ఎల్‌ అండ్‌ టీ’ నుంచి టేకోవర్‌ చేసుకోవాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025–26 ముగిసే మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మెట్రో రైలు పేరుతో ఉన్న సుమారు రూ. 10 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేయడంతోపాటు ఎల్‌ అండ్‌ టీకి రూ. 2 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెట్రో టేకోవర్, రెండో దశ విస్తరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం సమావేశమై ప్రభుత్వానికి సమర్పించాల్సిన నివేదికకు తుదిరూపు ఇచ్చింది.

మంత్రివర్గ భేటీలో ఈ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మెట్రో రైలు టేకోవర్‌ విజయవంతంగా పూర్తయితే మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడంలో అడ్డంకులు తొలగిపోనున్నాయి.

సత్వరమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు..
ఇటీవల ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం.. తదుపరిగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతోపాటు జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లు, సహకార ఎన్నికలను సైతం వెంటనే పూర్తి చేయాలని భావిస్తోంది. డీసీసీబీ పాలక మండళ్ల ఎన్నికలను నామినేటెడ్‌ పద్ధతిలో నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఎన్నికలన్నీంటినీ సత్వరమే నిర్వహించే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అన్నదాతలకు రైతు భరోసా ఆర్థిక సహాయం చెల్లింపుపైనా కేబినెట్‌లో చర్చించి ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల అంశంపై మంత్రివర్గంలో చర్చించి ప్రకటన చేస్తారని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. పలు ఆర్డినెన్స్‌లను సైతం మంత్రివర్గం ఆమోదించనున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement