నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్‌కు ఈసీ వివరణ
పనాజీ: ఎస్‌ఐఆర్‌లో భాగంగా నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్‌కు జారీ చేసిన నోటీసుపై భారత ఎన్నికల సంఘం సోమవారం వివరణ ఇచ్చింది. ఆ నోటీసుకు వ్యవస్థ ఆధారిత విధానమే కారణమని తెలిపింది. ఆయన గతంలో నమోదు చేసిన ఫామ్‌లో వివరాలు సంపూర్ణంగా లేకపోవడమే ఈ నోటీసుకు కారణమయ్యిందని వెల్లడించింది. పాత గణన ఫామ్‌లో తప్పనిసరి వివరాలైన ఓటరు పేరు, ఎపిక్ నెంబర్, బంధవుపేరు, అసెంబ్లీ నియోజకవర్గం పేరు, నంబర్ వంటివి లేవని ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఫామ్‌లో అన్ని వివరాలున్నాయని, ఇప్పుడు ఆయన హాజరు కావాల్సిన అవసరం లేదని ఎలక్టోరల్ రిజి్రస్టేషన్ ఆఫీసర్ డాక్టర్ మెడోరా ఎర్మోమిల్లా డికోస్టా స్పష్టం చేశారు.
మాజీ అడ్మిరల్ ప్రకాశ్‌కు ఎస్‌ఐఆర్ నోటీసులు ఇచ్చింది. ఎస్‌ఐఆర్‌లో అన్ని ఫీల్డులు ఖాళీగా ఉండటంతో అన్‌మ్యాప్‌డ్ కేటగిరీగా పేర్కొంటూ.. ఆయన ఓటరు వివరాలు ధృవీకరించడానికి, తన గుర్తింపును నిర్ధారించడానికి ఎన్నికల అధికారి ముందు హాజరు కావాలని పేర్కొంది. దీనిపై ఎక్స్ వేదికగా ప్రకాశ్ స్పందించారు. ‘20 ఏళ్ల కిందట నేను పదవీవిరమణ చేసిన నాటినుంచి ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కోరలేదు. గోవా ఎలక్టోరల్ రోల్–2026లో నా భార్య పేరు, నా పేరు చూసి ఆశ్చర్యం వేసింది. ఎన్నికల అధికారుల ముందు హాజరుకావడానికి అభ్యంతరం లేదు.
కానీ.. నేనుండే చోటు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వేర్వేరు తేదీల్లో హాజరు కావాలని కోరారు. కొత్త ఫామ్‌కు, పాత ఫామ్‌కు ఆటేమేటిక్ లింకేజ్ లేకపోతే ఎస్‌ఐఆర్ విధానాన్ని సవరించాలి. బీఎల్‌ఓ మా ఇంటికి మూడుసార్లు వచ్చారు. ఏవైనా డాక్యుమెంట్స్ లేకపోతే ఆయనైనా అడగాలి.’అని వృద్ధులకు ఉన్న లాజిస్టికల్ అడ్డంకులను ఆయన ఎత్తిచూపారు. ఇది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వీర చక్ర అవార్డు గ్రహీత, 1971 భారత్–పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన, నావికాదళానికి అధిపతిగా పని చేసిన అధికారి తన గుర్తింపును నిరూపించుకోవాల్సి రావడం ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.


