వాటిని హ్యాక్ చేయొచ్చని చంద్రబాబు చెప్పారు
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ సైతం స్పష్టం చేశారు
ఎన్నికల సంఘం మౌనం వీడాలి
ఎన్నికల పారదర్శకతపై విశాఖలో వివిధ సంఘాల సదస్సులో వక్తలు
మహారాణిపేట: ఎన్నికల కమిషన్ చొరవ తీసుకొని ఈవీఎంల విషయంలో రాజకీయ పార్టీలు, ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు డిమాండ్ చేశారు. ‘ఈవీఎంలు–ఎన్నికల ఫలితాలు’ అనే అంశంపై గురువారం విశాఖలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో బెటర్ ఏపీ, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ సంయుక్తంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. వివిధ రాజకీయ పార్టీలు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
గతంలో ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని స్వయంగా చంద్రబాబు చెప్పారని అన్నారు. చంద్రబాబు దగ్గర ఐటీ సలహాదారుగా పనిచేసిన వేమూరి కృష్ణప్రసాద్ బహిరంగంగా ఈవీఎంలను హ్యాక్ చేయడమే కాకుండా వాటిని ఎలా హ్యాక్ చేయవచ్చనే అంశంపై ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించారని గుర్తు చేశారు. వీటిని సునాయాసంగా హ్యాక్ చేయవచ్చని అపరకుబేరుడు, అమెరికాకు చెందిన టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా స్పష్టం చేశారన్నారు.
ఈవీఎంలపై ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, భారత్‌లో కూడా ఇటువంటి అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం మౌనం వీడి, సందేహాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు, ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ శీతల్, బెటర్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ జి.త్యాగరాజన్, ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు పల్లా దుర్గారావు, మార్కండేయులు, కమ్యూనిస్టు నేత సూర్యనారాయణ, కాంగ్రెస్ నేత కస్తూరి వెంకటరావు, రైల్వే యూనియన్ నాయకుడు కె.రామచంద్రమూర్తి, పటా్నయక్ తదితరులు పాల్గొన్నారు.


