చర్చ.. రచ్చ! | Ruling party blocks short term discussion on Tirumala laddu in Legislative Council | Sakshi
Sakshi News home page

చర్చ.. రచ్చ!

Feb 27 2026 2:25 AM | Updated on Feb 27 2026 9:22 AM

Ruling party blocks short term discussion on Tirumala laddu in Legislative Council

‘లడ్డూ’పై జంప్‌.. ‘లిఫ్ట్‌’పై సైలెంట్‌  

శాసన మండలిలో చంద్రబాబు సర్కారు పలాయనం

చంద్రబాబు చీకటి ఒప్పందాలు, సీమకు అన్యాయం, క్లోజ్డ్‌ రూమ్‌ మీటింగ్‌లపై మౌనం

తిరుమల లడ్డూపై స్వల్పకాలిక చర్చకు అధికార పక్షం మోకాలడ్డు

నిబంధనలకు విరుద్ధంగా ముందుగా మంత్రి మాట్లాడతారంటూ పయ్యావుల పట్టు

విపక్షం నిలదీస్తుందనే భయంతో జవాబు చెప్పలేక పారిపోయిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: అటు రాయలసీమ లిఫ్ట్‌.. ఇటు తిరుమల లడ్డూ ప్రసాదం..టీడీపీ పెద్దలను ఇరుకున పెట్టిన రెండు అంశాలపైనా శాసన మండలిలో చర్చ జరగకుండా చంద్రబాబు సర్కారు పలా­యనం చిత్తగించింది. రాష్ట్ర ప్రయోజనా­లను తాకట్టు పెడుతూ చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు.. క్లోజ్డ్‌ రూమ్‌ మీటింగ్‌లతో చీకటి ఒప్పందాలు.. ఇందాపూర్‌ – హెరిటేజ్‌ అనుబంధంపై విపక్ష వైఎస్సార్‌సీపీ మండలిలో గట్టిగా నిలదీయడంతో చర్చకు అధికార పక్షం ముఖం చాటేసింది. 

విచిత్రంగా స్పల్ప­కాలిక చర్చలో ముందుగా ప్రభుత్వం తరపున మంత్రి ప్రకటన చేశాకే విపక్షం మాట్లాడాలంటూ మెలికపెట్టి పారి­పోయింది! హెరిటేజ్‌ పేరు సభ సాక్షిగా బయటకు వస్తుందనే భయంతో అధికార పక్షం రభస సృష్టించింది. సీఎం చంద్రబాబుతో క్లోజ్డ్‌ రూమ్‌ మీటింగ్‌లో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పను­లను తాను నిలుపుదల చేయించినట్లు తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై సూటిగా సమాధానం చెప్పాలంటూ మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీయడంతో కూటమి సర్కారు దిక్కుతోచక పారిపోయింది. 

ఇక టీటీడీ లడ్డూ ప్రసాదం అంశంపై ప్రస్తుత సమావేశాల్లోనే చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు ఐదురోజుల పాటు శాసనమండలిని స్తంభింపచేశారు. ‘మండలి’ బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గురువారం చర్చకు అంగీకరించిన కూటమి సర్కారు తీరా సభ ప్రారంభం కాగానే మెలిక పెట్టింది. స్వల్పకాలిక చర్చ నిబంధనలకు విరుద్ధంగా ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తామంటూ మంత్రులే చర్చను అడ్డుకున్నారు. 

నిబంధనల ప్రకారం స్వల్పకాలిక చర్చ జరిగితే.. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన దుష్ప్రచారంలో నిజం లేదని సీబీఐ చార్జిషీట్‌ సాక్షిగా వెల్లడి కావడం.. అధిక ధరలకు హెరిటేజ్‌ అనుబంధ సంస్థ ద్వారా టీటీడీ నెయ్యి కాంట్రాక్టులను దక్కించుకోవడం.. ఇందాపూర్‌తో చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ అనుబంధం.. లాంటి అంశాలన్నీ చట్టసభ సాక్షిగా విపక్షం ఎండగడుతుందనే భయంతో ప్రభుత్వం చర్చ జరగకుండా అడ్డుకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

లడ్డూ ప్రసాదంపై చర్చ గురువారం వాయిదా పడినప్పటికీ మరుసటి రోజు శుక్రవారం సభలో ఆ అంశాన్ని చేపట్టే అవకాశం ఉన్నా.. మంత్రి పయ్యావుల కేశవ్‌ బయట మీడియాతో మాట్లాడుతూ మార్చి 4న ఆ అంశంపై చర్చ చేపడతామని ప్రకటించడం ప్రభుత్వ ఎత్తుగడను తెలియచేస్తోందని స్పష్టం చేస్తున్నారు.  

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీడీపీ చంద్రబాబు సర్కారు ఆడుతున్న కపట నాటకం శాసన మండలి వేదికగా మరోసారి బట్టబయలైంది! టీటీడీ లడ్డూ ప్రసాదంపై జరగాల్సిన స్వల్పకాలిక చర్చను గురువారం సభ ప్రారంభం కాగానే అధికార పక్షం అడ్డుకొని గందరగోళం సృష్టించింది. దీంతో మండలి వాయిదా పడింది. సభా నిబంధనల ప్రకారం స్వల్పకాలిక చర్చలో ముందుగా మంత్రి ప్రకటనకు అవకాశం లేదని మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు స్పష్టం చేసినప్పటికీ.. శాసన సభావ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటన చేసిన తర్వాతే చర్చ చేపట్టాలని, సభను ఎలా జరపాలో ప్రభుత్వానికి చెబుతారా..? అంటూ రభస సృష్టించడంతో గందరగోళ పరిస్థితుల నడుమ సభ రేపటికి వాయిదా పడింది. 

అంతకుముందు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఏదో ఒక వంకతో ప్రభుత్వం చర్చకు రాకుండా పారిపోతోందని విమర్శించారు. ప్రభుత్వం చెప్పేవన్నీ సత్యదూరం, అబద్ధాలని ధ్వజమెత్తారు. తొలుత చైర్మన్‌ అనుమతితో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి లడ్డూ ప్రసాదంపై స్వల్పకాలిక చర్చను ప్రారంభిస్తూ రెండు సార్లు మాట్లాడేందుకు ప్రయత్నించినా టీడీపీ సభ్యులు గందరగోళ పరిస్థితులు సృష్టించడంతో ప్రసంగం ముందుకు సాగలేదు. 

ప్రశ్నోత్తరాల అనంతరం వాయిదా పడిన శాసన మండలి మధ్యాహ్నం 1.07 గంటల సమయంలో తిరిగి ప్రారంభమైంది. చైర్మన్‌ మోషేన్‌రాజు సభలోకి రాగానే టీడీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు చేరుకుని ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించాలని పట్టుబట్టారు. దీనిపై చైర్మన్‌ మోషేన్‌రాజు స్పందిస్తూ.. నేను ఏం మొదలుపెడుతున్నానో తెలియకుండానే ప్రశ్నోత్తరాలు అంటున్నారంటే.. మీరు ముందుగానే నిర్ణయించుకుని వచ్చినట్లుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్సీలను వారి స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. 

ఈ సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ జోక్యం చేసుకోవడంతో.. చైర్మన్‌ మోషేన్‌రాజు స్పందిస్తూ.. ‘మీరు శాసనసభా వ్యవహారాల మంత్రి. మీకు అన్నీ తెలుసు. ఒకసారి ప్రశ్నోత్తరాల కార్యక్రమం ‘డీమ్డ్‌ టూ బీ ఆన్సర్‌..’ అన్న తర్వాత మీరు ఎలా ఎంకరేజ్‌ చేస్తున్నారు..?’ అని వ్యాఖ్యానించారు.  అనంతరం చైర్మన్‌ ఓ ప్రకటన చేశారు. లడ్డూ ప్రసాదం అంశంలో స్వల్పకాలిక చర్చ చేపడుతున్నామని, చంద్రశేఖర్‌రెడ్డిని చర్చ ప్రారంభించాలని సూచించారు.

ఎలా జరపాలో ప్రభుత్వానికి చెబుతారా సార్‌..?
చైర్మన్‌ అనుమతితో విపక్ష ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి లడ్డూ ప్రసాదం అంశంపై చర్చను ప్రారంభించి మాట్లాడడం మొదలుపెట్టగానే మంత్రి పయ్యావుల కేశవ్‌ అడ్డుపడ్డారు. ముందుగా ప్రభుత్వం తరఫున సంబంధిత శాఖ మంత్రి ప్రకటన చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ చైర్మన్‌కు సూచించారు. సభా నిబంధనలు అందుకు అనుమతించవని చైర్మన్‌ స్పష్టం చేయడంతో... ‘సభను ఎలా జరపాలో ప్రభుత్వానికి చెబుతారా సార్‌..? ఎలా జరపాలి? ఏం జరపాలన్నది ప్రభుత్వానికి సూచన చేస్తారా..?’ అంటూ పయ్యావుల వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్, మంత్రి మధ్య కొద్దిసేపు సంభాషణ కొనసాగింది.

మాటకు మాట...! 
మంత్రి కేశవ్‌: ప్రభుత్వం ఈ రోజు ఈ అంశంపై సమాధానం చెప్పడానికి ఎంతసేపైనా సిద్ధంగా ఉంది. వినడానికి ఓపికగా ఉండండి. సంప్రదాయం ప్రకారం మంత్రి మాట్లాడతారు. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి.

చైర్మన్‌ మోషేన్‌రాజు: ఆర్థిక మంత్రి గారూ.. మీరు చెప్పేది కరెక్టు కాదు. ఎందుకంటే.. స్వల్పకాలిక చర్చలో మంత్రి ప్రకటన చేయడమనే నిబంధన లేదు. ప్రకటనే చేయాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది. వేరే ఫార్మాట్‌లో వస్తే నేను ఖచ్చితంగా అవకాశం ఇస్తా. అంతేగానీ స్వల్పకాలిక చర్చలో మంత్రి ప్రకటనకు అవకాశం లేదు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఉంది కాబట్టే నేను అవకాశం ఇచ్చా.

మంత్రి కేశవ్‌: ఒక నిమిషం సార్‌..

చైర్మన్‌ మోషేన్‌రాజు: దీనిపై చర్చ వద్దండీ..!

కేశవ్‌: స్వల్పకాలిక చర్చకు 150 కాపీల నోట్‌లు ఏర్పాటు చేయమని రాశారు. ఎవరు రాశారు? మీరే కదా? 

చైర్మన్‌: దటీజ్‌ రాంగ్‌ డాక్యుమెంట్‌. నా అనుమతితో చేసిన కమ్యూనికేషన్‌ కాదు.

విపక్షం మైక్‌ కట్‌.. పోడియం వద్దకు సభ్యులు
సభలో గందరగోళం మధ్యే లడ్డూపై చర్చను ప్రారంభించి మాట్లాడుతున్న విపక్ష ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మైక్‌ కట్‌ కావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు నిరసన తెలుపుతూ చైర్మన్‌ పోడియం వద్దకు చేరుకున్నారు. తమ సభ్యుడు మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వాలని, చర్చను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. 

మరోవైపు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీలు ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటనకు అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. దీనిపై బొత్స సత్యనారాయణ స్పందిస్తూ ప్రభుత్వం చర్చను పక్కదారి పట్టించాలని చూస్తోందని, బీఏసీలో అనుకున్న ప్రకారం చర్చకు రావాలని కోరారు. 

ఈ సమయంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని మాట్లాడేందుకు చైర్మన్‌ మరోదఫా అనుమతించగా.. మంత్రులతోపాటు టీడీపీ సభ్యులంతా ముందుగా ప్రభుత్వం తరఫున ప్రకటన చేసేందుకు అనుమతించాలంటూ తిరిగి గందరగోళం సృష్టించారు. ఇరుపక్షాల సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement