సెకీ విద్యుత్‌కు అంతర్రాష్ట్ర సరఫరా చార్జీలు, నష్టాలు వర్తించవని స్పష్టం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలు
వీగిపోయిన విష ప్రచారం
ఎట్టకేలకు నాటి ‘సెకీ’ ఒప్పందానికి సర్కారు గ్రీన్ సిగ్నల్
తొలుత 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అనుమతి.. అంతర్రాష్ట్ర సరఫరా చార్జీలు, నష్టాలు వర్తించవని ఆదేశాల్లో స్పష్టం
వైఎస్ జగన్ ప్రభుత్వ ముందుచూపునకు ఫలితమిది
యూనిట్ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 2021లో ఒప్పందం
25 ఏళ్లపాటు వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు భరోసా
సర్కార్ తాజా నిర్ణయంతో ఇన్నాళ్లూ తాము చేసిందంతా తప్పుడు ప్రచారమేనని బాబు అండ్ కో ఒప్పుకున్నట్లే
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు (విద్యుత్ షెడ్యూలింగ్, ఆఫ్ టేక్ ప్రారంభం) ఎట్టకేలకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇది చాలా ఉపయోగకర ఒప్పందమని ఏపీ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) చేసిన సూచనపై సానుకూలంగా స్పందించింది. తద్వారా ఇన్నాళ్లూ చంద్రబాబు అండ్ కో ‘సెకీ’ ఒప్పందంపై చేసిందంతా విష ప్రచారమేనని తేటతెల్లమైంది.

2021 డిసెంబర్ 1న కుదిరిన పవర్ సేల్ అగ్రిమెంట్ (పీఎస్‌ఏ) ప్రకారం ఈ విద్యుత్ సరఫరా జరుగుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ (కనెక్టివిటీ ఆపరేషనలైజేషన్) పూర్తయిన అనంతరం విద్యుత్ తీసుకునే ప్రక్రియ (షెడ్యూలింగ్) ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
ఈ ప్రక్రియలో ఏపీపీసీసీతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు, ఏపీఆర్‌ఏపీఎల్, ఏపీఎస్‌ఎల్‌డీసీ సంస్థలు ఎస్‌ఈసీఐ, సీటీయూఐఎల్, ఆర్‌ఎల్‌డీసీలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పీఎస్‌ఏ నిబంధనలకు అనుగుణంగా వాణిజ్య లావాదేవీలు (కమర్షియల్ సెటిల్‌మెంట్) నిర్వహించాలని సూచించింది.
దీర్ఘకాలిక విద్యుత్ వినియోగం కోసం జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్ ఫర్ రెన్యూవబుల్ ఎనర్జీ(జిఎన్‌ఏ–ఆర్‌ఈ) వెసులుబాటును పొందాలని కూడా స్పష్టం చేసింది. అలాగే, ఇప్పటికే ఉన్న ఒప్పందాల ప్రకారం విద్యుత్ స్వీకరణ జరుగుతుందని, ఏపీ సరిహద్దు వరకు ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌విుషన్ సిస్టమ్ (ఐఎస్‌టీఎస్–అంతర్రాష్ట్ర ప్రసారం) చార్జీలు, నష్టాలపై రాష్ట్రానికి ఎలాంటి బాధ్యతా ఉండదని తెలిపింది.


ఐఎస్‌టీఎస్ చార్జీల మినహాయింపుతో యూనిట్ రూ.2.49కి సౌర విద్యుత్ సరఫరా చేస్తామంటూ గతప్రభుత్వానికి సెకీ రాసిన లేఖ
అదీ విజన్ అంటే..
» రైతులు పడుతున్న అవస్థలను చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వారికి ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలని సంకల్పించారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్లపాటు రోజుకు 9 గంటల చొప్పున పగటిపూటే ఇవ్వాలని దృఢంగా భావించారు. దానికి తగ్గట్టుగానే ముందుచూపుతో ఆలోచించి సౌర విద్యుత్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వ్యవసాయానికి సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టారు.
» అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు (ఐఎస్‌టీఎస్) మినహాయించి, యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే యూనిట్ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
» ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్ 11న ఏపీఈఆర్‌సీ ఆమోదించింది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్లపాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌విుషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుందని ఒప్పందంలో స్పష్టంగా ఉంది. అయినా ఈ ఒప్పందం వల్ల ఐఎస్‌టీఎస్ చార్జీల మినహాయింపు ఉండదని అప్పట్లో చంద్రబాబు అదే పనిగా దుష్ప్రచారం చేశారు. ఎల్లో మీడియా ఆయనకు వంత పాడుతూ పుంఖానుపుంఖాలుగా తప్పుడు కథనాలు ప్రచురించింది.
» కానీ అవన్నీ అవాస్తవాలని ఒప్పుకుంటూ.. ఇప్పుడు అదే చంద్రబాబు కూటమి ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు, నష్టాలు సెకీ విద్యుత్‌కు వర్తించవని అధికారికంగా స్పష్టం చేసింది. దీంతో ఇన్నాళ్లూ వారు చేసిందంతా అసత్య ప్రచారమని వారే అంగీకరించినట్లయింది.


