విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు | National Electricity Policy 2026 Modernizing Power Sector | Sakshi
Sakshi News home page

విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు

Mar 2 2026 2:42 PM | Updated on Mar 2 2026 2:46 PM

National Electricity Policy 2026 Modernizing Power Sector

దేశీయ విద్యుత్ రంగాన్ని ఆధునీకరించడమే కాకుండా, మార్కెట్ ఆధారిత వ్యవస్థగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ ఎలక్ట్రిసిటీ పాలసీ (ఎన్‌ఈపీ) 2026’ ముసాయిదాలో పొందుపరిచిన అంశాలు ఈ రంగాన్ని సమూలంగా మార్చనున్నాయి. జనవరిలో విడుదలైన ఈ ముసాయిదాపై మార్చి 19 వరకు ప్రజలు, నిపుణుల అభిప్రాయాలను కోరారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమలవుతున్న వినూత్న పద్ధతులను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్రవేశపెట్టడమే దీని ప్రధాన ఉద్దేశం.

ప్రస్తుతం మన దేశంలో విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌) తాము ఒప్పందం చేసుకున్న ప్లాంట్ల నుంచే విద్యుత్ పొందుతున్నాయి. కానీ కొత్త విధానం ప్రకారం, మార్కెట్ బేస్డ్ ఎకనామిక్ డెస్పాచ్ (ఎంబీఈడీ) అమలులోకి రానుంది. దీని ప్రకారం.. దేశంలోని విద్యుత్ ఉత్పత్తి అంతా ఒకే పూల్‌కు చేరుతుంది. అత్యంత తక్కువ ధరకు విద్యుత్ అందించే ప్లాంట్లకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గుతుంది.

ఈ క్రమంలో వచ్చే ఆర్థిక లావాదేవీల చిక్కులను పరిష్కరించేందుకు ‘బైలేటరల్ కాంట్రాక్ట్ సెటిల్‌మెంట్’(బీసీఎస్‌)ను ప్రతిపాదించారు. ఉదాహరణకు, ఒక డిస్కమ్‌ యూనిట్‌కు రూ.4 చొప్పున ఒప్పందం చేసుకున్నా మార్కెట్ ధర రూ.3 ఉంటే.. డిస్కమ్‌ మార్కెట్ పూల్‌కు రూ.3 చెల్లించి మిగిలిన రూ.1 ఒప్పందం ప్రకారం సదరు ఉత్పత్తి సంస్థకు చెల్లిస్తుంది.

కెపాసిటీ మార్కెట్స్‌తో నిరంతర సరఫరా

సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులు ప్రకృతిపై ఆధారపడతాయి. ఒకవేళ గాలి తగ్గినా లేదా ఎండ లేకపోయినా విద్యుత్ కొరత రాకుండా బ్యాకప్‌గా ఉండే ప్లాంట్లను సిద్ధం చేయడమే ‘కెపాసిటీ మార్కెట్స్’ ఉద్దేశం. ఎనర్జీ మార్కెట్‌లో సరఫరా చేసిన విద్యుత్తుకు డబ్బులు చెల్లిస్తే, కెపాసిటీ మార్కెట్‌లో విద్యుత్‌ అందుబాటును అనుసరించి రిటైనర్ ఫీజు తరహాలో చెల్లింపులు జరుగుతాయి. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి, గ్రిడ్ స్థిరత్వం దెబ్బతినకుండా ఉండటానికి ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

క్లౌడ్ ఎనర్జీ స్టోరేజ్

ఇప్పటివరకు విద్యుత్ నిల్వ అనేది కేవలం పెద్ద కంపెనీలకు, భారీ ప్రాజెక్టులకే పరిమితం. కానీ ఎన్‌ఈపీ 2026 ముసాయిదా క్లౌడ్ ఎనర్జీ స్టోరేజ్ అనే విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇది ‘స్టోరేజ్-యాజ్-ఏ-సర్వీస్’ తరహాలో పనిచేస్తుంది. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే చిన్న వినియోగదారులు కూడా తమ వద్ద ఉన్న అదనపు విద్యుత్తును ఈ క్లౌడ్ వ్యవస్థలో నిల్వ చేసుకోవచ్చు లేదా అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇది రిటైల్ స్థాయిలో నిల్వ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది.

పీర్-టు-పీర్ ట్రేడింగ్

మీ ఇంటి సోలార్ ప్యానెల్ ద్వారా తయారైన విద్యుత్తును పక్కింటి వారికో లేదా దగ్గర్లోని చిన్న దుకాణానికో నేరుగా అమ్ముకునే వీలు కల్పించడమే పీర్-టు-పీర్ ట్రేడింగ్. ఈ లావాదేవీల కోసం ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ప్రోటోకాల్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. దీనివల్ల గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో గ్రిడ్‌పై ఒత్తిడి తగ్గుతుంది.

ఈ ప్రతిపాదనలు అమలులోకి వస్తే విద్యుత్ రంగం కేవలం ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థగా కాకుండా ఒక డైనమిక్ మార్కెట్‌గా మారుతుంది. ఇది వినియోగదారులకు చౌకగా విద్యుత్ అందించడంతో పాటు దేశ ఇంధన భద్రతను బలోపేతం చేస్తుంది.

ఇదీ చదవండి: భారత చమురు మార్కెట్‌పై ‘యుద్ధ’ సెగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement