స్వచ్ఛ విద్యుత్‌కి పెట్టుబడుల పవర్‌  | India needs 22. 7 trillion dollers to hit net zero says Niti Aayog | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ విద్యుత్‌కి పెట్టుబడుల పవర్‌ 

Feb 12 2026 6:29 AM | Updated on Feb 12 2026 8:07 AM

India needs 22. 7 trillion dollers to hit net zero says Niti Aayog

2070 నాటికి 14.23 లక్షల కోట్ల డాలర్లు కావాలి 

నీతి ఆయోగ్‌ నివేదిక

న్యూఢిల్లీ: భారత్‌ సమ్మిళిత, సుస్థిర వృద్ధి సాధించడంలో విద్యుత్‌ రంగం కీలక పాత్ర పోషించనుంది. జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు, ఉత్పాదకత పెరిగేందుకు దోహదపడనుంది. ఈ నేపథ్యంలో శిలాజ ఇంధనాలను వినియోగించని, పర్యావరణహితమైన స్వచ్ఛ విద్యుత్, తటస్థ స్థాయి ఉద్గార (నెట్‌ జీరో) లక్ష్యాల సాధనకు భారీ పెట్టుబడులు అవసరం కానున్నాయి. 

2070 నాటికి రెన్యువబుల్స్, స్టోరేజ్, పంపిణీ మొదలైన విభాగాలకు సంబంధించి విద్యుత్‌ రంగానికి 14.23 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాల్సి ఉంటుంది. నీతి ఆయోగ్‌ ఒక నివేదికలో ఈ విషయాలు వివరించింది. దేశాభివృద్ధి, వాతావరణ లక్ష్యాలన్నీ కూడా విద్యుత్‌పైనే ఆధారపడి ఉన్నాయని పేర్కొంది. 2047 నాటికి నిర్దేశించుకున్న వికసిత భారత్‌ లక్ష్యాలకు సంబంధించి  ప్రస్తుత విధానాలను కొనసాగిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది, 2070 నాటికి నిర్దేశించుకున్న నెట్‌ జీరో లక్ష్యాల సాధనకు తోడ్పడే విధానాలను అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే కోణాల్లో నివేదిక రూపొందింది. దీని ప్రకారం .. 

→ 2025 డిసెంబర్‌ నాటికి 258 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యంతో ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద రెన్యువబుల్‌ ఎనర్జీ మార్కెట్‌గా భారత్‌ నిలి్చంది.  
→ తదుపరి దశ మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. పట్టణీకరణ, కూలింగ్, డిజిటలీకరణ, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, హరిత హైడ్రోజన్‌ మొదలైన వాటితో విద్యుత్‌కి డిమాండ్‌ భారీగా పెరగనుంది. వివిధ రకాల పునరుత్పాదక విద్యుత్‌ విభాగాల నుంచి పెరిగే డిమాండ్‌ని తట్టుకునే విధంగా వ్యవస్థ పటిష్టం కావాలి. 
→ ఇందుకోసం నిల్వ సామర్థ్యాలను, పంపిణీ సామర్థ్యాలను పెంచుకోవాలి. గ్రిడ్‌ కార్యకలాపాలను ఆధునీకరించాలి. విశ్వసనీయమైన విధంగా, చౌకగా స్వచ్ఛ విద్యుత్‌ లభించేలా చూసేందుకు పంపిణీ అనేది ఆర్థికంగా లాభదాయకంగా ఉండేలా చూడాలి. 
→ దేశవ్యాప్తంగా విద్యుదీకరణ వేగవంతం కావడాన్ని బట్టి భారతదేశ విద్యుత్‌ పరివర్తన ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. 
→ తలసరి విద్యుత్‌ వినియోగం 2025లో 1,400 కిలోవాట్‌అవర్‌ స్థాయి నుంచి 2070 నాటికి 7,000–10,000 కిలోవాట్‌అవర్‌కి పెరగనుంది. ఫ్రాన్స్, కొరియాలాంటి సంపన్న దేశాల స్థాయికి చేరనుంది. 
→ ప్రస్తుత పాలసీలు ఇలాగే కొనసాగితే 2070 నాటికి మొత్తం స్థాపిత సామర్థ్యం తొమ్మిది రెట్లు పెరుగుతుంది. అదే తటస్థ ఉద్గారాల లక్ష్యాలకు అనుగుణమైన నెట్‌–జీరో విధానాలను అమలు చేస్తే 14 రెట్లు పెరుగుతుంది.  
→ సోలార్‌ పీవీ సామర్థ్యం 5,500 గిగావాట్లకు చేరుతుంది. ప్రస్తుత పాలసీలను కొనసాగిస్తే ఇప్పుడు నామమాత్రంగా ఉన్న బ్యాటరీ స్టోరేజీ 1,400 గిగావాట్లకు చేరుతుంది. నెట్‌ జీరో విధానాలతో 3,000 గిగావాట్లకు చేరుతుంది.  
→ దీర్ఘకాలికంగా విద్యుత్‌ పరివర్తనలో అణు విద్యుత్‌ వ్యూహాత్మక పాత్ర పోషించనుంది. 2025లో 8.8 గిగావాట్లుగా ఉన్న సామర్థ్యం 2070 నాటికి 300 గిగావాట్లకు పెరుగుతుంది.  
→ ప్రస్తుత పాలసీల ప్రకారం 2070 నాటికి మొత్తం పెట్టుబడులు దాదాపు 8.79 లక్షల కోట్ల డాలర్లకు చేరనుండగా, నెట్‌ జీరో విధానాలతో 14.23 లక్షల కోట్ల డాలర్లకు చేరతాయి.  

Advertisement
 
Advertisement
Advertisement