జోరుగా వాహన విక్రయాలు | Vehicle Sales Surge 18pc in January Rural Demand Drives Growth FADA | Sakshi
Sakshi News home page

జోరుగా వాహన విక్రయాలు

Feb 11 2026 8:18 PM | Updated on Feb 11 2026 8:29 PM

Vehicle Sales Surge 18pc in January Rural Demand Drives Growth FADA

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి మొత్తం 27,22,558 వాహనాలు రిటైల్‌గా విక్రయమయ్యాయని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన  23,14,940 యూనిట్లతో పోలిస్తే ఇవి 18% అధికంగా ఉన్నాయి. జీఎస్‌టీ సంస్కరణల ఉత్సాహం కొనసాగడం, పంట దిగుమతి, పెళ్లిళ్ల ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నగదు సరఫరా పెరగడం, సరుకు రవాణా రంగంలో డిమాండ్‌ స్థిరంగా కొనసాగడంతో వాహనాలకు గిరాకీ పెరిగిందని ఫాడా వివరణ ఇచ్చింది.

‘‘ప్యాసింజర్‌ వాహనాలకు డిమాండ్‌ పెద్ద నగరాలకే పరిమితం కాకుండా, నిర్మాణాత్మకంగా విస్తరిస్తోంది. వార్షిక ప్రాతిపదికన ప్రయాణికుల వాహన విక్రయాల వృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 14.43%, పట్టణ ప్రాంతాల్లో 2.75%గా ఉంది. కస్టమర్లకు ఎస్‌యూవీ/కాంపాక్ట్‌ ఎస్‌యూవీలపై అమితాసక్తి, ఎంట్రీ లెవల్‌ కార్ల తిరిగి మార్కెట్లోకి విడుదల కావడం, డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి, కంపెనీల ఆఫర్లు, స్కీములు  కొనసాగడం వాహన విక్రయాల వృద్ధికి తోడ్పడ్డాయి’’ అని ఫాడా ప్రెసిడెంట్‌ సీ ఎస్‌ విఘ్నేశ్వర్‌ తెలిపారు.

వచ్చే మూడు నెలలపై ఫాడా అవుట్‌లుక్‌ 
రాబోయే మూడు నెలలపై ఫాడా ఆశావహ దృక్పథం వ్యక్తం చేసింది. డీలర్‌ విశ్వాసం బలంగా కొనసాగుతోందని, సర్వేలో పాల్గొన్నవారిలో 79.70% వృద్ధిని ఆశిస్తున్నారని, కేవలం 1.88% మాత్రమే క్షీణత ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. వృద్ధి ఆధారిత బడ్జెట్‌ 2026లో కేంద్రం మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించింది.

జీఎస్‌టీ 2.0 సంస్కరణల కొనసాగింపు, వడ్డీ రేట్లలో స్థిరత్వం, ఫైనాన్సింగ్‌ సౌలభ్యం తదితర అంశాలు కొనుగోళ్ల సామర్థ్యాన్ని పెంచవచ్చని ఫాడా అభిప్రాయపడింది. ముఖ్యంగా టూ వీలర్స్, వాణిజ్య వాహనాలు, ప్యాసింజర్‌ వాహనాల విభాగాల్లో డిమాండ్‌ సానుకూలంగా కొనసాగుతుందని అంచనా వేసింది. అయితే ఎన్నికల ప్రభావం, సీజనాలిటీ, కొన్ని ప్రాంతాల్లో మోడల్‌ లభ్యత అంశాలు వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చని ఫాడా పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement