ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్‌ ఆఫర్‌ ఇదే.. | Google Offers Voluntary Exit Packages Amid AI First Shift | Sakshi
Sakshi News home page

ఉద్యోగం వద్దనుకుంటే.. గూగుల్‌ ఆఫర్‌ ఇదే..

Feb 11 2026 3:19 PM | Updated on Feb 11 2026 5:24 PM

Google Offers Voluntary Exit Packages Amid AI First Shift

గూగుల్ తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) ఉద్యోగుల కోసం మరోసారి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను (Voluntary Exit Packages - VEP) ప్రకటించింది. ఏఐ (AI) ఆధారిత భవిష్యత్తుకు పూర్తిగా కట్టుబడి ఉన్న సంస్థగా మారేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

“కొత్త సంవత్సరాన్ని మనం బలమైన స్థితిలో ప్రారంభిస్తున్నాం. 2025లో మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. అయితే టెక్నాలజీ రంగం వేగంగా మారుతోంది. పోటీ తీవ్రంగా ఉంది. కాబట్టి మన ఏఐ మిషన్‌కు పూర్తిగా అనుగుణంగా పనిచేసే శ్రామిక శక్తి అవసరం” అని గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలిపారు.

ఏఐ-ఫస్ట్ దిశగా అడుగులు
గూగుల్ ఇప్పుడు పూర్తిగా “ఏఐ-ఫస్ట్” సంస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే వ్యాపార విభాగంలోని ప్రతి ఉద్యోగీ ఏఐని స్వీకరించి, ఎక్కువ ప్రభావాన్ని చూపాలని సంస్థ స్పష్టం చేసింది. “ఈ వేగానికి సరిపోలలేనివారు లేదా ముందుకు సాగడానికి సిద్ధంగా లేనివారు స్వచ్ఛందంగా నిష్క్రమించేందుకు కంపెనీ అవకాశం ఇస్తుంది” అని షిండ్లర్ పేర్కొన్నారు.

ఎవరిపై ప్రభావం?
ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలు ముఖ్యంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్ విభాగం, కార్పొరేట్ డెవలప్‌మెంట్, ఇతర సంబంధిత వ్యాపార విభాగాల వారికి వర్తిస్తాయి. అయితే, అమెరికాలోని పెద్ద కస్టమర్ సేల్స్ టీమ్స్, కొన్ని కస్టమర్-ఫేసింగ్ పాత్రలకు ఈ ఆఫర్ వర్తించదని స్పష్టం చేశారు. “మా వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము” అని షిండ్లర్ తెలిపారు.

ఏడాదిలో మూడోసారి.. 
ఇది గూగుల్ అమలు చేస్తున్న మూడో స్వచ్ఛంద నిష్క్రమణ ప్రణాళిక. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. 2025 జూన్‌లో ‘రిటర్న్-టు-ఆఫీస్’ విధానం కఠినతరం చేసిన సమయంలో యూఎస్ ఉద్యోగులకు ఇలాంటి ఆఫర్లు ఇచ్చింది. మళ్లీ 2025 అక్టోబర్‌లోనూ యూట్యూబ్ విభాగంలో పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఎగ్జిట్ ప్యాకేజీలు ప్రకటించింది.

వీఈపీ ప్యాకేజీలో ఏం ఉంటాయంటే..
గూగుల్‌ వీఈపీ (Voluntary Exit Program) ప్యాకేజీని ఎంచుకుని స్వచ్ఛందంగా నిష్క్రమించే ఉద్యోగులకు సాధారణంగా వారి సర్వీస్‌ పీరియడ్‌, దా ఆధారంగా లంప్‌సమ్‌ సెవరెన్స్ పే (కొన్ని వారాలు/నెలల జీతం), ప్రోరేటెడ్ బోనస్ చెల్లింపు, ఉపయోగించని సెలవులకు నగదు, కొంతకాలం వరకు ఆరోగ్య బీమా కొనసాగింపు, ఇప్పటికే వెస్ట్ అయిన RSUs/స్టాక్‌లపై హక్కులు, అలాగే కొత్త ఉద్యోగం కోసం కెరీర్ ట్రాన్సిషన్ లేదా అవుట్‌ప్లేస్‌మెంట్ సపోర్ట్ వంటి ప్రయోజనాలు అందిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement