ఎయిర్‌టెల్ సరికొత్త ఏఐ ఫ్రాడ్ అలర్ట్ ప్రారంభం | Airtel introduced AI powered fraud protection system scams OTPs | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్ సరికొత్త ఏఐ ఫ్రాడ్ అలర్ట్ ప్రారంభం

Feb 11 2026 3:10 PM | Updated on Feb 11 2026 3:18 PM

Airtel introduced AI powered fraud protection system scams OTPs

దేశంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, ముఖ్యంగా వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) లీకేజీల ద్వారా జరుగుతున్న బ్యాంకింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే అత్యాధునిక ‘ఫ్రాడ్ అలర్ట్’ ఫీచర్‌ను కంపెనీ ఆవిష్కరించింది.

ఏమిటీ ఏఐ ఫ్రాడ్ అలర్ట్?

సాధారణంగా డెలివరీ బాయ్స్ లేదా సర్వీస్ ఏజెంట్ల పేరుతో ఫోన్ చేసే మోసగాళ్లు వినియోగదారులను మాటల్లో పెట్టి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ఓటీపీలను కాజేస్తుంటారు. ఇలాంటి దాడుల నుంచి కస్టమర్లను రక్షించడమే ఈ ఏఐ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.

ఒక కస్టమర్ కాల్‌లో ఉన్నప్పుడు అవతలి వ్యక్తి బ్యాంకింగ్ ఓటీపీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఏఐ గుర్తించినట్లయితే నెట్‌వర్క్ స్థాయిలో ఎయిర్‌టెల్ వెంటనే జోక్యం చేసుకుంటుంది. కాల్ సమయంలో కస్టమర్‌కు వెంటనే ‘ఫ్రాడ్ అలర్ట్’ ద్వారా హెచ్చరిక పంపుతుంది. తద్వారా కస్టమర్ అప్రమత్తమై తన సమాచారాన్ని పంచుకోకుండా జాగ్రత్త పడవచ్చు.

ఈ సందర్భంగా ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. ‘ఎయిర్‌టెల్‌ను దేశంలోనే అత్యంత సురక్షితమైన నెట్‌వర్క్‌గా మార్చాలన్నదే లక్ష్యం. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీలు కీలకమే అయినప్పటికీ నేరగాళ్ల చేతికి చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే నెట్‌వర్క్ స్థాయిలోనే ఈ మోసాలను అడ్డుకునే ఏఐ పరిష్కారాన్ని తీసుకొచ్చాం. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇది మంచి ఫలితాలను ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

అందుబాటులోకి ఎప్పుడు?

గత రెండేళ్లుగా స్పామ్ కాల్ హెచ్చరికలు, హానికరమైన లింక్‌లను కట్టడి చేయడం వంటి చర్యలు తీసుకుంటున్న ఎయిర్‌టెల్ ఇప్పుడు ఈ ఓటీపీ ప్రొటెక్షన్‌ను మరింత బలోపేతం చేసింది. ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రారంభ దశలో భాగంగా హరియాణా రాష్ట్రంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ సదుపాయాన్ని కేవలం ఒక ప్రాంతానికే పరిమితం చేయకుండా రాబోయే రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌టెల్ కస్టమర్లందరికీ ఈ సర్వీసును విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ రక్షణ వ్యవస్థ పూర్తిగా నెట్‌వర్క్ స్థాయి ఏఐ సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా ఎలాంటి యాప్‌లు ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నెట్‌వర్క్ స్థాయిలోనే మోసపూరిత కాల్స్, ఓటీపీ లీకేజీలను గుర్తించి అడ్డుకుంటుంది.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్వల్ప ఊరట

Advertisement
 
Advertisement
Advertisement