న్యూఢిల్లీ వేదికగా భారత్‌లో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సు జరగనుంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ గమనాన్ని నిర్దేశించే ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరగనున్న ఈ ఐదు రోజుల సదస్సు గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న మొదటి అతిపెద్ద ఏఐ సదస్సుగా రికార్డు సృష్టించనుంది.
దిగ్గజ కంపెనీల సారథులు
ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ టెక్ రంగంలోని అత్యంత ప్రభావవంతమైన నేతలు ఢిల్లీకి రాబోతున్నారు. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, బిల్‌గేట్స్, క్వాల్‌కామ్ సీఈఓ క్రిస్టియానో అమోన్, గూగుల్ డీప్ మైండ్ సీఈఓ డెమిస్ హసాబిస్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ సైతం భారత్ చేరుకోనున్నారనే వార్తలొస్తున్నాయి. అధికారిక జాబితాలో తన పేరు లేకపోయినప్పటికీ ఆయన క్లోజ్డ్ డోర్ సమావేశాల్లో పాల్గొంటారని, ఫిబ్రవరి 19న ప్రత్యేక ఓపెన్‌ఏఐ ఈవెంట్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
దేశీయంగా కూడా ఈ సమ్మిట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, ఇన్ఫోసిస్ నందన్ నీలేకని, సలీల్ పరేఖ్, హెచ్‌సీఎల్ టెక్ సీఈఓ సి.విజయకుమార్ వంటి దేశీయ పారిశ్రామిక వేత్తలు భారత ఏఐ విజన్ గురించి ప్రసంగించనున్నారు.
సదస్సు ప్రత్యేకతలు
ప్రభుత్వం ఈ సమ్మిట్‌ను కేవలం చర్చలకే పరిమితం చేయకుండా వాస్తవ ఫలితాల సాధన దిశగా రూపొందించింది. పీపుల్ (ప్రజలు), ప్లానెట్ (భూమి), ప్రోగ్రెస్ (పురోగతి) అనే మూడు అంశాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సుపరిపాలన.. వంటి ఏడు కీలక రంగాల్లో ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే 35,000కు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు, 500కు పైగా స్టార్టప్‌లు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నాయి.
ఇదీ చదవండి: బంగారం, వెండి ధరల అప్‌డేట్స్


