భారత దేశాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 2025లో ప్రకటించిన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్‌డీఐ) పథకం 2026-27 ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.1 లక్ష కోట్ల నిధిని సిద్ధం చేస్తోంది.
నిధుల కేటాయింపు.. పురోగతి
గత బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.20,000 కోట్లు కేటాయించినప్పటికీ సవరించిన అంచనాల ప్రకారం కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. అయితే తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.20,000 కోట్లను మూలధన వ్యయం కింద కేటాయించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంకి కేటాయించిన మొత్తం రూ.28,049 కోట్లలో అధిక భాగం ఈ పథకానికే దక్కడం విశేషం.
ఈ పథకం అమలుకు సంబంధించి కొన్ని అంశాలు..
అక్టోబర్ 11న ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ పథకానికి సంబంధించిన నిబంధనలు, పాలన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ‘అనుసంధాన్’ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కింద ప్రాథమికంగా నిధిని ఏర్పాటు చేశారు. సెకండ్ లెవల్ ఫండ్ మేనేజ్‌మెంట్(ఎస్‌ఎల్‌ఎఫ్‌ఎం) నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టీడీబీ), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బైరాక్)లు ఇప్పటికే నామినేషన్ ప్రాతిపదికన మేనేజర్లుగా నియమితులయ్యాయి.
పథకం ప్రధాన ఉద్దేశం
ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా డీప్-టెక్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ ఆర్‌డీఐ పథకం లక్ష్యం. ఈ విభాగంలోని కంపెనీలకు చాలా తక్కువ లేదా సున్నా వడ్డీతో దీర్ఘకాలిక రుణాలు అందిస్తారు. స్టార్టప్‌ల్లో నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. అయితే, ఈ పథకం ద్వారా గ్రాంట్లు లేదా స్వల్పకాలిక రుణాలు మంజూరు చేయరని గమనించాలి. ఈ పథకంలో భాగంగా నేషనల్ క్వాంటం మిషన్, సెమీకండక్టర్ ల్యాబ్ (మొహాలీ), ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ వంటివాటికి నిధులు కేటాయించనున్నారు.
సెమీకండక్టర్ రంగానికి బూస్ట్
భారతదేశాన్ని సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం రూ.8,000 కోట్లను ‘మోడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ సెమీకండక్టర్స్’ కోసం కేటాయించింది. గతేడాది ఇది రూ.7,000 కోట్లుగా ఉంది. అయితే, భారీ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఇచ్చే పీఎల్‌ఐ పథకానికి కేటాయింపులను రూ.8,885 కోట్ల నుంచి రూ.1,345 కోట్లకు తగ్గించడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే 2026 నాటికి భారత టెక్, రీసెర్చ్ రంగం కొత్త పుంతలు తొక్కేందుకు సిద్ధంగా ఉందని అర్థమవుతోంది.
ఇదీ చదవండి: సరికొత్త లుక్‌లో మార్కెట్‌లోకి కొత్త ఈవీ


